logo

సమృద్ధిగా వనరులు.. ప్రగతి పరుగులు

నాలుగు దశాబ్దాలక్రితం రైతుకూలీల ‘జగిత్యాల జైత్రయాత్ర’ సభతో దేశవ్యాప్తంగా అందరిదృష్టిని ఆకర్షించిన జగిత్యాల 2016 అక్టోబరులో విజయదశమి రోజున ప్రత్యేక జిల్లాగా ఆవిర్భవించింది. విజయాన్ని చేకూర్చే విజయదశమి రోజున కొత్తజిల్లాగా ఏర్పడి ఆరేళ్లు గడవగా సమృద్ధి వనరులతో ముందుకు సాగుతోంది.

Published : 05 Oct 2022 05:16 IST

దసరాతో కొత్తజిల్లాగా ఏర్పడి ఆరేళ్లు

జగిత్యాల ధరూర్‌క్యాంపు, న్యూస్‌టుడే: నాలుగు దశాబ్దాలక్రితం రైతుకూలీల ‘జగిత్యాల జైత్రయాత్ర’ సభతో దేశవ్యాప్తంగా అందరిదృష్టిని ఆకర్షించిన జగిత్యాల 2016 అక్టోబరులో విజయదశమి రోజున ప్రత్యేక జిల్లాగా ఆవిర్భవించింది. విజయాన్ని చేకూర్చే విజయదశమి రోజున కొత్తజిల్లాగా ఏర్పడి ఆరేళ్లు గడవగా సమృద్ధి వనరులతో ముందుకు సాగుతోంది.

జిల్లాలో ఇటీవల నూతనంగా బీమారం, ఎండపల్లి మండలాలను ప్రకటించగా కొత్త మండలాలతో పాటు ఇదివరకున్న మండలాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సిద్ధం చేయాల్సిఉంది. జిల్లాకేంద్రంతో పాటు కోరుట్ల, మెట్పల్లి రెవెన్యూ డివిజన్లలోనూ అన్నిశాఖలకు తగినట్లుగా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పరచాలి.

* జగిత్యాలలో రూ.48 కోట్లతో కలెక్టరేట్‌, పోలీసు భవనాల నిర్మాణాన్ని చేపట్టగా కలెక్టరేట్ నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభానికి ఎదురుచూస్తోంది. రూ.50 కోట్లతో పట్టణ అభివృద్ధితో పాటు రూ.6 కోట్లతో చేపట్టిన సమీకృత మార్కెట్ పూర్తిచేయాలి. కోరుట్లలో సమీకృత మార్కెట్ నిర్మించాల్సి ఉంది.

* దళితబంధు లబ్ధిదారుల సంఖ్యను భారీగా పెంచటం, కొత్త రేషన్‌కార్డులజారీ, నూతన జోన్ల పరిధిలో పదోన్నతులు, బదిలీలపూర్తి, పట్టణాల సుందరీకరణ, రింగురోడ్ల నిర్మాణం, పరిశ్రమల స్థాపన, పుణ్యక్షేత్రాల అభివృద్ధి, క్రీడామైదానాల్లో సదుపాయాల కల్పన, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు తదితరాలు అవశ్యంగా ఉన్నాయి.

* వెల్గటూరు, మల్లాపూర్‌ మండలాల్లో ఫుడ్‌పార్కుల నిర్మాణంపై ప్రజల్లో ఆశలున్నాయి. ధరణి పోర్టల్‌లోని భూ సమస్యల పరిష్కారం, సాదాబైనామాలకు వచ్చిన దరఖాస్తుల్లో అర్హులకు పట్టామార్పిడి, అన్నిప్రాంతాల్లో రెండు పడకగదుల ఇళ్లనిర్మాణం, రాయితీ గొర్రెలు, పాడిగేదెల పంపిణీని పూర్తిచేయాల్సిఉంది.

* ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని రూ.1,937 కోట్లతో చేపట్టగా ముప్కల్‌ పంపుహౌజును పూర్తిచేస్తే ఎల్లంపల్లి జలాలను ఎత్తిపోసే వీలుంటుంది. వరద కాలువలో నిండుగా నీరు నిలిచి జిల్లాలో 45 వేల ఎకరాలకు అదనంగా నీరందుతుండగా రూ.61 కోట్లతో చేపట్టిన రోళ్లవాగు ప్రాజెక్టును పూర్తి చేయాల్సిఉంది.


జగిత్యాల పొలాస పరిశోధనస్థానం

* విభిన్న పంటల సాగుతో రాష్ట్రంలోనే ప్రత్యేకత కలిగిన జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో శాశ్వత పండ్ల మార్కెట్ రూపుదిద్దుకుంటుండగా లక్ష్మీపూర్‌లో రూ.7 కోట్లతో తలపెట్టిన విత్తనశుద్ధి కర్మాగారాన్ని పూర్తిచేయాల్సిఉంది. పొలాసలో ఆవాల పరిశోధన కేంద్రం, చల్‌గల్‌లో ఉద్యాన పరిశోధనకేంద్రం ఏర్పాటుచేయాలి.


* జిల్లాలో ఇదివరకు 2.04 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతుండగా ఇటీవల 31 వేలమందికి నూతనంగా పింఛన్లను మంజూరు ఇచ్చారు. బీడీ కార్మికుల ఈపీఎఫ్‌ కటాఫ్‌ తేదీని నిజామాబాద్‌ జిల్లాలో ఎత్తివేయగా మన జిల్లాలోనూ ఎత్తివేస్తే దాదాపుగా 30 వేలమందికిపైగా పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉంది.


* జగిత్యాల వైద్యకళాశాలను అన్ని హంగులతో సిద్ధంచేయగా ఈ విద్యా సంవత్సరం 150 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. రూ.10 కోట్లతో చేపట్టిన నర్సింగ్‌ కళాశాల భవనం, రూ.20 కోట్లతో మాతాశిశు సంరక్షణ కేంద్రం, డయాగ్నొస్టిక్‌ కేంద్రం, ఆక్సిజన్‌ తయారీ కేంద్రం తదితరాలతో జగిత్యాల మెడికల్‌ హబ్‌గా మారుతోంది.


* ధరూర్‌క్యాంపులో కోర్టు భవనాల నిర్మాణానికి స్థలాన్ని కేటాయించగా విద్యాభవన్‌, అమరవీరుల సంస్మరణ పార్కు, నూకపల్లిలో నాలుగువేల రెండు పడకగదుల ఇళ్లనిర్మాణం, పట్టణాల్లో మినీ ట్యాంకుబండ్స్‌ నూతన శోభను తెస్తున్నాయి. జగిత్యాలలో పార్కును నిర్మించాల్సిఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని