logo

విజయ సంకల్పం

విజయంతో ముడిపడిన ముచ్చటైన పండుగ నేటి దసరా. విజయానికి ప్రతీకగా నిలిచే పర్వదినాన.. మనసారా సంకల్పిస్తే అందరికి గెలుపు ఫలాలు దరిచేరుతాయి. లక్ష్యం దిశగా అడుగులు వేస్తే అనుకున్న ఫలితాలు దగ్గరవుతాయి. ఇదే రోజున శమీ వృక్షాన్ని పూజించిన రాముడు రావణుడిపై గెలిచాడని..

Published : 05 Oct 2022 05:22 IST

దసరా వేడుక.. ఆకాంక్షలకు ప్రతీక

ఈనాడు, కరీంనగర్‌

విజయంతో ముడిపడిన ముచ్చటైన పండుగ నేటి దసరా. విజయానికి ప్రతీకగా నిలిచే పర్వదినాన.. మనసారా సంకల్పిస్తే అందరికి గెలుపు ఫలాలు దరిచేరుతాయి. లక్ష్యం దిశగా అడుగులు వేస్తే అనుకున్న ఫలితాలు దగ్గరవుతాయి. ఇదే రోజున శమీ వృక్షాన్ని పూజించిన రాముడు రావణుడిపై గెలిచాడని.. దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడిని యుద్ధంలో ఓడించిందని..

పాండవులు జమ్మిచెట్టుపై నుంచి ఆయుధాల్ని దింపి వాటితో పోరాటానికి వెళ్లి విజేతలుగా నిలిచారనే విశిష్ఠతలున్నాయి. చెడుపై జరిపిన పోరులో మంచితనం జయకేతనం ఎగురవేసిందనేందుకు సంకేతం నేటి పాలపిట్టను చూసే వేడుక. అందుకే ఏ పని మొదలు పెట్టినా.. దసరానే ఆలంబనగా మలుచుకుంటారు. ఆయా వర్గాల వారంతా విజయపథంలోకి అడుగు పెట్టాలనే ఆకాంక్షల్ని మనసారా కోరుకుంటారు. ఇలాంటి వారి ఆశయాలన్ని నెరవేరాలని దసరా రోజున మనమంతా ఆశిద్దాం.

మ్మడి కరీంనగర్‌ జిల్లాలో డిగ్రీ ఉత్తీర్ణులైన వారంతా ప్రభుత్వ కొలువును గెలువాలనే తలంపుతోనే ప్రతి రోజు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ నెల 16న జరిగే గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షకు నాలుగు జిల్లాల నుంచి దాదాపుగా 60 వేల మంది రాయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 503 పోస్టులలో తమకు అవకాశం దక్కాలనే ఆకాంక్షతో చదువుతున్నారు. ఇటీవల జరిగిన ఎస్సై, కానిస్టేబుళ్ల రాతపరీక్షకు దాదాపుగా 45వేల మంది యువతీ యువకులు హాజరై తమ ప్రతిభను చూపారు. త్వరలో రానున్న ఫలితాల్లో గెలుపు ధీరులుగా మారాలనే ఉత్సుకతను చూపిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా పడే వివిధ రకాల ఉద్యోగాలతోపాటు బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ కొలువులను గెలువాలనే జోష్‌ను మన కుర్రకారు చూపిస్తోంది.

పాలన మెరుగనేలా..

ఇటీవలే పెద్దపల్లి జిల్లా సమీకృత భవన సముదాయంతో నూతన కలెక్టరేట్‌ ప్రారంభమవడం.. జగిత్యాలలోని కొత్త భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉండటంతో కొత్త జిల్లాల ఏర్పాటైన తరువాత ఉమ్మడి జిల్లాలో పరిపాలన సౌలభ్యాలు ప్రతి ఏడాది పురోగతితో ముందుకుసాగుతున్నాయి. 2016 సంవత్సరంలో సరిగ్గా దసరా రోజునే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నాలుగు జిల్లాలుగా పాలనా స్వరూపాన్ని మార్చుకుంది. విజయదశమి రోజునే అసలైన విజయాలు దరిచేరాలనేలా జిల్లాలు రూపుదిద్దుకున్నాయి.


అన్నదాతకు అండగా..

ఆరుగాలం శ్రమనే నమ్ముకున్న అన్నదాత ఆవేదనలు నేటి నుంచే తీరేలా జిల్లాలో పరిస్థితులు మారాలి. పండించిన పంటకు గిట్టుబాటు ధరను మార్కెటింగ్‌, కొనుగోలు రూపంలో ఎలాంటి ఇక్కట్లు లేకుండా ఉండేలా పరిస్థితులు కనిపించాలి. జలధారలు ఎక్కువగా ఉండటంతో భూముల్లో బంగారం పండించేలా వ్యవసాయ, ఉద్యానశాఖల తోడ్పాటు మరింతగా పెరగాలి.  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6.57లక్షల మంది అన్నదాతలున్నారు. ఇటీవల భారీ వర్షాలతో నాలుగు జిల్లాల పరిధిలో 50వేలకుపైగా ఎకరాల పంటపొలాలు దెబ్బతిన్నాయి. పరిహారం అందించడంతోపాటు అన్నం పెట్టే అన్నదాతకు నేటి దసరా నుంచి అంతా మంచి జరిగేలా పరిస్థితులు దరిచేరాలి.


ఆరోగ్యమస్తు.. అనేలా..!

కరోనా విపత్తు తరువాత జిల్లాలో ఆరోగ్యానికి పెద్దపీట వేసేలా బస్తీ దవాఖానాలతోపాటు ఉన్న ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగవుతున్నాయి. ఇక నాలుగు జిల్లాల్లో వైద్యకళాశాల అనే సుదీర్ఘమైన కల నెరవేరడంతో జిల్లాసుపత్రుల్లో సేవలు పెరగనున్నాయి. ఆందోళన కలిగించేలా నాలుగు జిల్లాల పరిధిలో రక్తహీనత సమస్యలు మహిళలు, చిన్నారుల్లో వెంటాడుతున్నాయి. ఇటీవల పైలెట్‌ ప్రాజెక్ట్‌గా సిరిసిల్ల జిల్లాలో ఆరోగ్య పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. అసలు రుగ్మతల్ని తెలుసుకుని వాటికి తగిన వైద్య చికిత్సను అందించేలా బాటలు వేస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అవగాహన మంత్రాన్ని ప్రతి ఒక్కరు నేటి నుంచి ఆచరణలో చూపించగలగాలి.


రాజకీయ బలం..

వచ్చే ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వీలుండటంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతోపాటు గతంలో ఓటమిని చవిచూసిన వారంతా తమ బలం, బలగాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో నిమగ్నమవుతున్నారు. మరోవైపు వారసుల్ని కొందరు ఈ దసరా నుంచి రాజకీయ అరంగేట్రం చేయించేందుకు సన్నద్ధమవుతున్నారు. 12 శాసనసభ స్థానాల్లో మూడు ప్రధాన పార్టీలతోపాటు ఇతర పార్టీలు తమ ప్రాబల్యాన్ని పెంచుకునేలా అడుగులేస్తున్నాయి. ఇక నేటి దసరా పండుగ నాడే తెరాస జాతీయ పార్టీగా ఏర్పాటయ్యేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అధికార పార్టీలోని కొందరి నాయకులు కేంద్ర రాజకీయాల్లోని యోగంపై గంపెడాశల్ని పెట్టుకున్నారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని