logo

ఇచ్చిందే తిను.. పెట్టిందే మెనూ..!

జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందించే ఆహారంలో నాణ్యతతో పాటు మెనూ పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Published : 24 Nov 2022 04:22 IST

ప్రభుత్వ ఆసుపత్రిలో దుస్థితి

పట్టించుకోని వైద్యబృందం

న్యూస్‌టుడే, కరీంనగర్‌ సంక్షేమ విభాగం

జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందించే ఆహారంలో నాణ్యతతో పాటు మెనూ పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెనూలో ఒకటి ఉంటే మరొకటి అందిస్తున్నారు. ఆసుపత్రిలో అందించే అన్నం కంటే బయట దాతల సహాయంతో అందిస్తున్న అన్నం బాగుంటుందని రోగుల బంధువులు చెబుతున్నారు. పలువురు సర్కారు దావాఖానాలో ఇలానే ఉంటుందనగా మరికొందరు ఆసుపత్రి ఆవరణలో నిర్వహిస్తున్న అన్నదాన కేంద్రం నుంచి భోజనాన్ని తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. సర్కారు దవాఖానాలో రోగులకు అందిస్తున్న ఆహారంపై ‘న్యూస్‌టుడే’ బుధవారం పరిశీలన చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ప్రతి రోగికి వైద్య సిబ్బంది సూచన మేరకు శస్త్రచికిత్స జరిగిన రోగులు, సాధారణ రోగులకు ఆహారం అందించాలి. శస్త్రచికిత్స జరిగిన వారికి మూడు రోజుల వరకు పాలు, బ్రెడ్డు, ఇడ్లి, ఉప్మా అందించాలి. సాధారణ రోగులకు రెండు పూటలా సన్న బియ్యంతో అన్నం, ఒక ఆకుకూర, ఒక కూరగాయ, సాంబార్‌, ఒక కోడిగుడ్డు, ఒక సీజనల్‌ పండు, ఒక కప్పు పెరుగు అందించాలి. కాగా బుధవారం కేవలం రెండు కూరలు ఇచ్చారు. ఆకుకూర లేదు. పాలు, బ్రెడ్డు, ఒక కోడిగుడ్డు, ఒక అరటిపండు అందించారు. అందులో వంకాయటమాట కూర కొంతవరకు బాగానే ఉన్నా పప్పు మొత్తం పలచగా ఉంది. ఇక పాల విషయానికి వస్తే నీళ్లలో పాలు కలిపారా? పాలల్లో నీళ్లు కలిపారా ? అన్న సందేహం తలెత్తుతోంది. బ్రెడ్డు గట్టిగా ఉంది. సీజనల్‌ పండుకు బదులు ఎప్పుడూ అరటిపండునే అందిస్తున్నారు. బీపీటీ బియ్యంతో అన్నం వడ్డిస్తున్నామని చెబుతున్నా అన్నం దొడ్డుగా ఉంటుంది. కప్పు పెరుగుకు బదులు మజ్జిగ ఇస్తున్నారు. సాంబారు కనిపించేనే లేదు.

అన్నం కోసం వరుసలో నిల్చున్న బాలింతల బంధువులు

బాలింతలకు తప్పని ఇబ్బందులు

జిల్లా మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణులు, బాలింతలు ఉంటారు. వారికి ఆహారం విషయంలో వైద్య సిబ్బంది అవగాహన కల్పించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బాలింతలకు కూరలు అందిస్తున్నప్పటికీ కారం, పచ్చడితో తింటున్నారు. ఆసుపత్రిలో కందిపప్పు, వంకాయ టమాట కూర అందిస్తున్నారు. కందిపప్పు అని తెలియకపోవడంతో పెసరుపప్పు అని తినడం మానేశారు. వంకాయతో ఎలర్జీలు వస్తాయని భయపడి కారం, పచ్చడితో తింటున్నారు. కూరల విషయంలో బాలింతలకు అవగాహన కల్పించాలి. అక్కడ పూర్థిస్తాయి అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో ఇచ్చిందే మెనూగా కొనసాగుతోంది.

కారం, పచ్చడితో భోజనం చేస్తున్న బాలింత


పరిశీలించి చర్యలు తీసుకుంటాం

-రత్నమాల, ఆస్పత్రి సూపరింటెండెంట్‌

ప్రతి రోగికి మెనూ కోసం రోజుకు రూ.100 చెల్లిస్తున్నాం. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని