logo

బొమ్మకల్‌ భూ దందాలపై టాస్క్‌ఫోర్స్‌ నజర్‌!

రెండేళ్ల కిందట రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన బొమ్మకల్‌ భూమాఫియా ఆగడాలపై మరోసారి కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నజర్‌ పెట్టారు.

Published : 26 Nov 2022 03:50 IST

ఈనాడు, కరీంనగర్‌

రెండేళ్ల కిందట రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన బొమ్మకల్‌ భూమాఫియా ఆగడాలపై మరోసారి కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నజర్‌ పెట్టారు. తాజాగా ఈ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధిని శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని రోజంతా విచారించినట్లు తెలిసింది. గతంలోనూ బొమ్మకల్‌ భూదందాలో కీలక పాత్రధారిగా గుర్తింపు పొందిన ఈయన వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. అప్పట్లో చేసిన తప్పిదాలనే మరోమారు చేస్తున్నారని ఆయన వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బొమ్మకల్‌ పరిధిలోని 55 గుంటల భూమి విషయంలో హైదరాబాద్‌కు చెందిన ఆ భూమి యజమానులను ఇటీవల ఈ నేత బెదిరించినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇదే భూమి విషయంలో కరీంనగర్‌ గ్రామీణ ఠాణాలో ఈ ఏడాది సెప్టెంబరు 29న ఈ నాయకుడితోపాటు ఈయనకు సహకరించిన మరో 12మంది పైన కేసు నమోదైంది. తరవాత కూడా తన పంథా మార్చుకోకుండా వారిని ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో పోలీసులు రంగప్రవేశం చేసినట్లు వినికిడి. పైగా రాష్ట్రస్థాయి అధికారికి బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయాన్ని జిల్లా పోలీసులు సవాలుగా తీసుకుంటున్నారనేది స్థానికంగా చర్చ జరుగుతోంది.

అప్పుడేం జరిగిందంటే..?: కరీంనగర్‌ను ఆనుకుని ఉన్న బొమ్మకల్‌ మేజర్‌ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ 2020 ఆగస్టు నెలలో భూ బాధితులంతా లోక్‌సత్తా స్వచ్ఛంద సంస్థ సహకారంతో వరుసగా ఆందోళనల్ని చేపట్టారు. తమకు న్యాయం చేయాలని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో ఇక్కడి విలువైన స్థలాల విషయంలో అప్పటి కలెక్టర్‌ శశాంక పర్యవేక్షణలో రెవెన్యూ, పోలీసు, టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో మూడు కమిటీలను వేసి సమగ్రంగా విచారణ జరిపించారు. అప్పుడు బొమ్మకల్‌కు చెందిన ఈ ప్రజాప్రతినిధితోపాటు మరికొంతమంది భూ దందాలో భాగస్వాములని గుర్తించి కేసులు నమోదు చేశారు. ఆక్రమిత స్థలాల విషయమై రెవెన్యూ అధికారులు విచారణల్ని జరిపి నివేదికలను ఉన్నతాధికారులకు అందించారు. స్థానికంగా ఉండని వారితోపాటు ఖాళీ స్థలాలపై ఈ భూమాఫియా కన్నేసి కోట్లాది రూపాయల భూముల్ని కాజేసినట్లు అధికారులు గుర్తించారు. ఎప్పుడో కొనుగోలు, విక్రయాలు జరిగిపోయిన భూములకు కొత్తగా డాక్యుమెంట్లు సృష్టించి తాము కొన్నామంటూ తెరపైకి వచ్చిన ఆక్రమణదారులు పలువురిని ఇబ్బంది పెట్టిన తతంగాలు అప్పట్లో ఇదే టాస్క్‌ఫోర్స్‌ అధికారుల దృష్టికి వచ్చాయి. భూదందాలకు సంబంధించిన అయిదారు సంచుల్లో కీలక దస్త్రాలను ట్రక్కులో తరలిస్తుంటే దుర్శేడ్‌ సమీపంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. తరవాత ఈ గ్రామ శివారులోని ప్రభుత్వ, శిఖం భూముల విషయంలో సర్వేలు చేపట్టి హద్దులను నిర్ణయించారు. భూమాఫియా ఆగడాలు ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా తగ్గి.. మళ్లీ ఇటీవల పెరగడంతో పోలీసులు మరోసారి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని