logo

కరిగిపోతున్న కొండలు

జిల్లా వ్యాప్తంగా మట్టి తవ్వకాలకు అనుమతులు లేవు. ఇదే కానీ మట్టి మాఫియా జిల్లాలో చెలరేగిపోతోంది.

Updated : 26 Nov 2022 06:33 IST

అనుమతి లేకుండా తవ్వకాలు
ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

సిరిసిల్ల పట్టణ శివారులోని ఎద్దుగుట్ట నుంచి లారీలో మట్టి తరలింపు

జిల్లా వ్యాప్తంగా మట్టి తవ్వకాలకు అనుమతులు లేవు. ఇదే కానీ మట్టి మాఫియా జిల్లాలో చెలరేగిపోతోంది. వీరి చేతిలో పడిన ఎద్దుగుట్ట, మైసమ్మగుట్ట, అగ్రహారం గుట్టలు కరిగిపోతున్నాయి. తనిఖీలతో అడ్డుకోవాల్సిన మైనింగ్‌శాఖ సిబ్బంది లేమితో చేతులెత్తేసింది. రెవెన్యూశాఖ ఇలాంటివి చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. వీటితో పాటుగా స్థిరాస్తి వ్యాపారం, ప్రైవేటు నిర్మాణాలు ఎక్కువయ్యాయి. వీటిని ఆసరాగా చేసుకుని అనుమతులు లేకుండా నిత్యం వందలాది లారీల మట్టిని అక్రమార్కులు తరలిస్తున్నారు. ఇందుకు ఎక్స్‌కవేటర్లు, లారీలను పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. ప్రభుత్వ నిర్మాణ పనుల్లో క్యూబిక్‌ మీటరుకు రూ.30 చొప్పున సెస్‌ రూపంలో చెల్లిస్తారు. జిల్లాలో మట్టి తవ్వకాలకు రెవెన్యూ, గనులశాఖల నుంచి అనుమతులను ఎవరికీ ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్మాణాలకు తాత్కాలిక అనుమతులిచ్చిన ప్రాంతంలోనూ అక్రమార్కులు తవ్వకాలు చేస్తున్నారు. దీనికి స్థానిక వాహనదారులు కూటమిగా ఏర్పడి ఈ దందా కొనసాగిస్తున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి

రెవెన్యూ, గనులశాఖ అనుమతితో మట్టి క్వారీల నుంచి తవ్వుకునే అవకాశం ఉంది. దీనికి క్యూబిక్‌ మీటరుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే అనుమతులు తీసుకోకుండా తవ్వకాలు చేపట్టడంతో ప్రభుత్వానికి చెందాల్సిన ఆదాయం పక్కదారి పడుతోంది. సిరిసిల్ల శివారులోని ఎద్దుగుట్ట, మైసమ్మగుట్ట ప్రాంతాల్లో కొద్దికాలంగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి రోజుకు రూ.లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఇంత పెద్దఎత్తున అక్రమాలు జరుగుతుంటే విజిలెన్సు అధికారులు అటువైపు కన్నెత్తి చూసే పరిస్థితిలేదు. వీరిపై అధికార పార్టీ నేతలు, జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో చర్యలు తీసుకునే సాహసం చేయడం లేదు. ఇది అక్రమార్కులకు మరింతగా కలిసివస్తోంది.

జీరో వేబిల్లుపై స్పష్టత కరవు

మట్టి తవ్వకాల్లో ప్రభుత్వ, ప్రైవేటు అవసరాలకు ప్రభుత్వం జీరో వేబిల్లు విధానం తీసుకొచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీని కోసం ఏడాది క్రితమే ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. జిల్లా, మండలాల వారీగా రెవెన్యూశాఖ మట్టి క్వారీలను గుర్తించాలి. వాటిలో తవ్వకాలకు నిరభ్యంతరాలు తెలపాలి. ఈ సాఫ్ట్‌వేర్‌ ప్రక్రియ ప్రాథమిక దశలోనే నిలిచిపోయింది. ప్రభుత్వ నిర్మాణాలకు పని అంచనాల్లో మట్టి వినియోగం మేరకు బిల్లులు చెల్లించే క్రమంలో సెస్‌ రూపంలో తీసుకుంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అవసరాలకు మించి పక్కదారి పడుతోంది. దీనికి ఉదాహరణ సిరిసిల్ల-కామారెడ్డి, సిరిసిల్ల-వేములవాడ బాహ్యవలయ రహదారి నిర్మాణాలకు పని అంచనాలో చూపించిన దానికంటే ఎక్కువ మట్టిని వినియోగించినట్లు ఇటీవల తనిఖీల్లో తేలింది. అదనంగా వినియోగించిన మొత్తానికి బిల్లులు చెల్లించాలని రహదారులు భవనాల శాఖకు గనులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


ప్రభుత్వ నిర్మాణాలకే...

-సైదులు, సహాయ సంచాలకుడు, జిల్లా గనులశాఖ

ప్రభుత్వ నిర్మాణాలకు వేములవాడ మండలం అగ్రహారంలో ఏప్రిల్‌లో తాత్కాలిక అనుమతులిచ్చాం. జిల్లా వ్యాప్తంగా మిగతా ఎక్కడా రెవెన్యూ, గనులశాఖ ఇచ్చిన అనుమతులు లేవు. క్వారీల ఏర్పాటుకు రెవెన్యూశాఖ ఎన్‌ఓసీలు జారీ చేస్తే వేబిల్లులు జారీ చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని