logo

ఊహల పల్లకీలో ఆశావహులు

సహకార విద్యుత్తు సరఫరా సంఘం (సెస్‌)లో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహులు ఊహల పల్లకీలో ఊరేగుతున్నారు.

Published : 26 Nov 2022 05:14 IST

సెస్‌లో 15 డైరెక్టర్‌ స్థానాలు
రిజర్వేషన్‌పైనే ఉత్కంఠ
ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

సహకార విద్యుత్తు సరఫరా సంఘం (సెస్‌)లో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహులు ఊహల పల్లకీలో ఊరేగుతున్నారు. న్యాయస్థానం ఆదేశాలతో తొలుత పాత 11 డైరెక్టర్‌ స్థానాలకే ఎన్నికలు నిర్వహించేలా సిద్ధమయ్యారు. జిల్లా ఆవిర్భావంతో పాటు ఏర్పడిన వీర్నపల్లి, తంగళ్లపల్లి, వేములవాడ గ్రామీణం, రుద్రంగి మండలాలకు డైరెక్టర్‌ స్థానాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తూ గురువారం న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈనేపథ్యంలో డిసెంబరు 5న మొత్తం 15 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇప్పటికే గ్రామాల వారీగా సెస్‌ వినియోగదారుల ఆధారంగా ఓటరు జాబితాను సిద్ధం చేశారు. పాత మండలాల నుంచి వీటిని కొత్త మండలాల్లోని గ్రామాల వారీగా విభజించాల్సి ఉంది. ఓటరు జాబితాతో ఆధార్‌ అనుసంధానం పూర్తయ్యాక ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించారు. 2.81 లక్షల వినియోగదారుల్లో చనిపోయినవారు, బకాయిదారులు, మార్పులు చేర్పుల తర్వాత 85,128 మంది ఉన్నట్లు తేలింది. దీనిలోనూ కొన్ని తప్పులు దొర్లాయి. వీటి సవరణకు మండల కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకుంటున్నారు. కానీ వాటిని ఓటరు జాబితాలో చేర్చుతారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

సెస్‌లో 2016 ఎన్నికల్లో 11 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సిరిసిల్ల పట్టణం, సిరిసిల్ల గ్రామీణం, ఇల్లంతకుంట (బెజ్జంకి మండలం గుండారం, పెర్కబండ), గంభీరావుపేట, ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ, వేములవాడ గ్రామీణం, బోయినపల్లి (కొడిమ్యాల మండలంలోని నల్లగొండ, తిప్పాయిపల్లి) ఉన్నాయి. తాజాగా వీర్నపల్లి, తంగళ్లపల్లి, వేములవాడ అర్బన్‌, రుద్రంగి స్థానాలు పెరిగాయి. ఇందులో ఒకటి ఎస్సీ, రెండు మహిళలకు కేటాయించగా మిగతా 12 జనరల్‌ కేటగిరిలో ఉంటాయి. డైరెక్టర్‌ స్థానాల వారీగా ఓటరు జాబితాలో స్త్రీ, పురుషులు, సామాజిక వర్గాల వారీగా జాబితాను సిద్ధం చేస్తారు. అందులో ఎస్సీలు, మహిళలు ఎక్కువగా ఉన్న స్థానాలకు ఆ రిజర్వేషన్‌ను కేటాయిస్తారు. మిగతా స్థానాలు జనరల్‌లో ఉంటాయి. రిజర్వేషన్లు డిసెంబరు 5న వెలువరించే ఎన్నికల ఉత్తర్వులతోనే ప్రకటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని