logo

ఉద్యాన పంటలతో స్థిరమైన ఆదాయం

జగిత్యాల జిల్లా ఉద్యానపైర్ల సాగులో రాష్ట్రంలోనే ప్రాధాన్యత కలిగి ఉండగా యాసంగివేళ ఆయిల్‌పామ్‌ సాగు సన్నాహాలు, ఇతర పంటల్లో రాయితీ అవకాశాలు, సాగుకు సాయపడే అంశాలను జిల్లా అధికారి జె.ప్రతాప్‌సింగ్‌ ‘న్యూస్‌టుడే’తో వివరించారు.

Published : 26 Nov 2022 05:26 IST

జిల్లా ఉద్యాన అధికారి జె.ప్రతాప్‌సింగ్‌
న్యూస్‌టుడే, జగిత్యాల వ్యవసాయం

జగిత్యాల జిల్లా ఉద్యానపైర్ల సాగులో రాష్ట్రంలోనే ప్రాధాన్యత కలిగి ఉండగా యాసంగివేళ ఆయిల్‌పామ్‌ సాగు సన్నాహాలు, ఇతర పంటల్లో రాయితీ అవకాశాలు, సాగుకు సాయపడే అంశాలను జిల్లా అధికారి జె.ప్రతాప్‌సింగ్‌ ‘న్యూస్‌టుడే’తో వివరించారు.

2022-23 సంవత్సరానికి గాను జిల్లాలో 9 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ నాటుట లక్ష్యంగా ఉండగా ఇప్పటికే 3,200 ఎకరాల్లో మొక్కలకు రైతులు నాన్‌సబ్సిడీ మొత్తాన్ని చెల్లించారు. గొల్లపల్లి మండలం అబ్బాపూర్‌లోని నర్సరీలో 5.35 లక్షల నారు మొక్కలను పెంచుతుండగా వచ్చే ఫిబ్రవరి, మార్చి మాసాల్లో రైతుల క్షేత్రాల్లో నాటేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మొక్కలు నాటేకన్నా ముందుగానే పొలంలో బిందుసేద్య పరికరాలను అమర్చేలా కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వ్యవసాయశాఖ సహకారంతో జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగుపై సమావేశాలు జరుపుతుండగా జిల్లాలో ఇంకనూ పెద్దఎత్తున రైతులు ఆయిల్‌పామ్‌ సాగుకు దరఖాస్తు చేస్తున్నారు. దీనికిగాను రైతులు త్వరితగతిన రిజిస్ట్రేషన్‌ తదితర ప్రక్రియలను పూర్తిచేయాలి.

సూక్ష్మసేద్యం

నాబార్డు ద్వారా 2016-17, 2017-18 సంవత్సరాలకుగాను 5,567 హెక్టార్లు బిందుసేద్య పరికరాలను, 2018-19 సంవత్సరానికిగాను 765 హెక్టార్లలో, 2019-20లో 4,500 హెక్టార్లలో, 2020-21లో 500, 2021-22లో 550 హెక్టార్లలో బిందు, తుంపరసేద్య పరికరాలిచ్చాం. జిల్లాలో మొత్తం 24 వేల హెక్టార్లకు సూక్ష్మసేద్యం విస్తరించింది. ఈ సంవత్సరం ఆయిల్‌పామ్‌కు బిందుసేద్య పరికరాల రాయితీ ఉంది.

పండ్ల తోటలకు రాయితీ

హెక్టారు టిష్యూకల్చర్‌ అరటికి రూ.30,700, బొప్పాయి రూ.22,500, మామిడి రూ.9,800, జామ రూ.17,600, సీతాఫలం రూ. 25,400 చొప్పున రాయితీఉండగా రాయితీ సొమ్మును రైతుల ఖాతాలకు జమచేస్తాం. ఇప్పటికే పలు యూనిట్లను మంజూరివ్వగా ఇంకనూ రైతుల దరఖాస్తుకు అవకాశముంది. ప్లాస్టిక్‌ మల్చింగ్‌ హెక్టారుకు రూ.16 వేలు, పాతమామిడి తోటల పునరుద్ధరణకు రూ.20 వేల చొప్పున రాయితీ ఉంది.

పెరుగుతున్న సాగు

పసుపుసాగులో రాష్ట్రంలోనే రెండోస్థానంలో ఉండటం విశేషంగాకాగా జామ, అరటి, మామిడి, బత్తాయి, సీతాఫల్‌, కూరగాయలు, పూలసాగు క్రమంగా పెరుగుతోంది. మామిడిని 13,937 హెక్టార్లు, పసుపు 14,709, తీపినారింజ 80, అరటి 311, బొప్పాయి 46, మిరప 2191, కూరగాయలు 2,918, పూలు 76, ఉల్లి 607, ఇతర పంటలను 580 హెక్టార్లలో రైతులు పండిస్తున్నారు. ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన మామిడి మార్కెట్‌ జగిత్యాలలో ఉండగా హరితగృహాలు, పందిళ్లపై తీగజాతి కూరగాయలసాగు, పండ్లు, పూలవంటి ఉద్యాన పంటలను వాణిజ్య సరళిలో సాగుచేస్తున్నారు. ప్రతి రైతు తనకున్న భూమిలో కొద్ది విస్తీర్ణంలోనైనా కూరగాయలను పండించాలి. పండ్లతోటలను సాగుచేసే రైతులు భూసార పరీక్ష చేయించాలి. మామిడిలో పూతకు ముందునుంచే యాజమాన్య పద్ధతులను పాటించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని