logo

సరఫరా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం

‘మంథని డివిజన్‌లో వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.

Published : 26 Nov 2022 05:26 IST

ఆధునిక పరికరాలతో బిల్లు రీడింగ్‌  
డీఈఈ గంగారామ్‌
న్యూస్‌టుడే, మంథని గ్రామీణం

‘మంథని డివిజన్‌లో వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. వరదలతో దెబ్బతిన్న నియంత్రికలు, స్తంభాల బిగింపు పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నాం. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నాణ్యమైన విద్యుత్తును అందించడానికి చర్యలు చేపట్టాం’ అని ఎన్‌పీడీసీఎల్‌ డివిజనల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(డీఈఈ) గంగారామ్‌ తెలిపారు. డివిజన్‌లో విద్యుత్తు సరఫరాకు సంబంధించి సమస్యలపై ఆయన ‘న్యూస్‌టుడే’కు ఇచ్చిన ముఖాముఖిలో వివరించారు.

ఈ ఏడాది గోదావరి వరదలతో దెబ్బతిన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల పునరుద్ధరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇలాగైతే యాసంగి సాగుకు ఇబ్బందులు ఎదురవుతాయి కదా!
గోదావరి వరదలతో దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాం. డివిజన్‌లో 33 కేవీ స్తంభాలు 8, 11 కేవీ స్తంభాలు 494, ఎల్‌టీ స్తంభాలు 692, ట్రాన్స్‌ఫార్మర్లు 537 దెబ్బతిన్నాయి. రైతులు ఇబ్బందులు పడకుండా వాటిని తిరిగి బిగించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తాం.

వ్యవసాయ అవసరాలకు వినియోగించే ట్రాన్స్‌ఫార్మర్లు పాడయితే మరమ్మతుకు తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఏటా రైతులు నష్టపోతున్నారు.
పాడయిన ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతు చేసి 48 గంటల్లో తిరిగి బిగిస్తున్నాం. అయితే ట్రాన్స్‌ఫార్మరు మరమ్మతు కేంద్రం నుంచి గమ్యం చేరడానికి రవాణా సౌకర్యం అందుబాటులో లేని సందర్భంలో కొంత జాప్యం జరుగుతోంది.

విద్యుత్తు బిల్లులకు రీడింగ్‌ను సకాలంలో తీసుకోకపోవడంతో, స్లాబ్‌ మారి అధిక బిల్లులు వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను అధిగమించలేరా?
రీడింగ్‌ తీయడంలో రెండు మూడు రోజులు ఆలస్యం జరిగినా బిల్లు ఎక్కువగా రాదు. రీడింగ్‌ నమోదుకు నవంబరు నుంచి అండ్రాయిడ్‌ యంత్రాలను వినియోగిస్తూ 17వ తేదీలోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నాం. మంథని డివిజన్‌లో ప్రస్తుతం 27 అండ్రాయిడ్‌ పరికరాలతో రీడింగ్‌ నమోదు చేస్తున్నాం.

బేగంపేట ఉపకేంద్రం పరిధిలో ఒక ప్రాంతంలో విద్యుత్తు సమస్య తలెత్తితే సరి చేయడానికి మొత్తం ప్రాంతానికి సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నారు.
సమస్య ఉన్న ప్రాంతానికే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నాం. ఉపకేంద్రం మొత్తానికి నిలిపివేస్తే సంస్థకే నష్టం జరుగుతోంది. అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం.

వ్యవసాయానికి కేవలం తొమ్మిది గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అందులోనూ తరచూ అంతరాయం కలుగుతుందనే ఆరోపణలున్నాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహావసరాలకు 24 గంటల పాటు నిరంతర సరఫరా అందిస్తున్నాం. వ్యవసాయ అవసరాలకు సాయంత్రం 4.45 గం.ల నుంచి ఉదయం 4 గంటల వరకు సరఫరా చేస్తున్నాం. పంట కోతల సమయంలో కరెంటు అవసరం ఉండదు గనకే అంతరాయం ఉంటుంది. అదనులో ఎలాంటి ఇబ్బందులుండవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు