logo

పనితీరుకు పరీక్షలు

దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్రంలోని గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ కృషి చేస్తోంది.

Published : 26 Nov 2022 05:26 IST

నగరాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం పోటీలు
ప్రజాభిప్రాయ సేకరణకే ప్రాధాన్యం
న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

అభివృద్ధికి నోచుకోని ఓ ప్రధాన రహదారి 

దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్రంలోని గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ కృషి చేస్తోంది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో నగరాలు, పట్టణాలను చెత్త రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేలా ఎనిమిదేళ్లుగా పోటీలు నిర్వహిస్తూ ర్యాంకులు ప్రకటిస్తున్న కేంద్రం.. తాజాగా మౌలిక వసతులపై కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది.

బహిరంగ మల, మూత్ర విసర్జన రహితం, చెత్త నుంచి సంపాదన లక్ష్యంతో కేంద్రం ‘స్వచ్ఛ సర్వేక్షన్‌’ పోటీలు నిర్వహిస్తుంది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, రామగుండం నగరపాలికలు ఆరేళ్లుగా ఈ పోటీలో పాల్గొంటున్నాయి. కరీంనగర్‌ నగరపాలిక ర్యాంకు 2021లో 74 కాగా, 2022లో కాస్త మెరుగుపడి 67వ ర్యాంకులో నిలిచింది. రామగుండం నగరపాలిక 2021లో 93వ ర్యాంకులో ఉండగా 2022లో చెత్త నిర్వహణపై నగరపాలిక నిర్లక్ష్యానికి నిదర్శనంగా 136వ ర్యాంకునకు పడిపోయింది. ప్రజాభిప్రాయ సేకరణ, చెత్త సేకరణ, నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన రహితం, చెత్త రహిత నగరం, వాటర్‌ ప్లస్‌ తదితర అంశాల ఆధారంగా కేంద్రం మార్కులు కేటాయిస్తున్న నేపథ్యంలో 2023లోనైనా మెరుగైన ర్యాంకులు సాధించడానికి పురపాలికలు తగిన ప్రణాళికలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

యంత్రంతో భూగర్భ కాలువలో మురుగు తొలగిస్తున్న కార్మికుడు

సదుపాయాలపై దృష్టి

దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లోని ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య, రవాణా, రక్షణ, ట్రాఫిక్‌, చెత్త నిర్వహణ, నీటి సదుపాయం, మురుగు నిర్వహణ, గృహ నిర్మాణం, పర్యావరణం, ప్రణాళిక తదితర సదుపాయాలపై ‘అర్భన్‌ ఔట్‌కమ్స్‌ ప్రేమ్‌వర్క్సు’ దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ఆయా నగరాలు, పట్టణాలకు సంబంధించిన వివిధ అంశాలపై మూడేళ్ల సమాచారాన్ని ఇప్పటికే కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం ఆయా నగరాలు, పట్టణాల పురోగతిని అంచనా వేస్తుంది. ప్రజల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యం ఉండనుండగా ‘ఈజీ ఆఫ్‌ లివింగ్‌’లో ప్రజలు ఇవ్వాల్సిన సమాచారంపై పాలకవర్గం, అధికారులు విస్తృతంగా ప్రచారం చేపట్టాల్సి ఉంది. వెబ్‌సైట్‌లో లేదా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి అందులో అడిగే 17 ప్రశ్నలకు ప్రజలు 1 నుంచి 5 వరకు రేటింగ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈజీ ఆఫ్‌ లివింగ్‌పై గోడలపై రాతలు, హోర్డింగ్‌ల ఏర్పాటు, ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడం, పత్రికల్లో కథనాలు, అవగాహన సదస్సులకు వేర్వేరుగా 100 మార్కులు ఉంటాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఐదు విభాగాల్లో ఉత్తమ నగరాలు, పట్టణాలకు కేంద్రం అవార్డులను ప్రకటించనుంది. 

రమేశ్‌నగర్‌ కూడలిలో పేరుకుపోయిన చెత్త

మురుగు నిర్వహణే కీలకం

అండర్‌ డ్రైనేజీ నిర్వహణలో కార్మికులకు బదులుగా అత్యాధునిక యంత్రాలను వినియోగించాలనే లక్ష్యంతో ‘మ్యాన్‌ హోల్‌ టు మిషన్‌ హోల్‌’ నినాదంతో కేంద్రం ‘సఫాయి మిత్ర సురక్షా ఛాలెంజ్‌’ కార్యక్రమాన్ని మూడు విభాగాల్లో చేపట్టింది. రాయితీపై యంత్రాలను ఇప్పించడం, వాటి వినియోగం, పారిశుద్ధ్య కార్మికుల రక్షణ చర్యలు ఇందులో కీలకం. ప్రజల ఫిర్యాదులపై టోల్‌ఫ్రీ నంబరు వినియోగం, సెప్టిక్‌ ట్యాంకుల పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ, సంక్షేమం, మురుగు నిర్వహణ, తదితర అంశాల్లో మొత్తం 1000 మార్కులతో పోటీ ఉంటుంది. జనాభా ప్రతిపాదికన గతేడాది దేశంలోని 243 నగరాలు, పట్టణాలు ఈ పోటీలో పాల్గొనగా మూడో విభాగంలో రామగుండం నగరపాలిక రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. సుమారు రూ.6 కోట్లతో అత్యాధునిక యంత్రాలను కొనుగోలు చేయడంతో మార్కులు పెరిగి మూడో స్థానం వచ్చేందుకు దోహదపడగా వాటిని వినియోగించకుండా మూలన పడేయడంతో ఈ సారి మార్కులు తగ్గే అవకాశముంది. సఫాయిమిత్ర సురక్షా ఛాలెంజ్‌ మార్గదర్శకాలను సంపూర్ణంగా అమలు చేస్తే మెరుగైన ర్యాంకును కైవసం చేసుకునే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని