logo

బండి సంజయ్‌ను అడ్డుకోవడంతో ఉద్రిక్తత

కోరుట్ల శివారులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో కాషాయదండు తమ నిరసనల్ని హోరెత్తించారు.

Published : 28 Nov 2022 03:40 IST

మల్యాల వద్ద రోడ్డుపై కట్టెలు కాల్చి నిరసన తెలుపుతున్న భాజపా కార్యకర్తలు

న్యూస్‌టుడే- జగిత్యాల గ్రామీణం, కోరుట్ల గ్రామీణం:    కోరుట్ల శివారులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో కాషాయదండు తమ నిరసనల్ని హోరెత్తించారు. కోరుట్ల నుంచి కరీంనగర్‌ వరకు మార్గమధ్యలో అడుగడుగునా సంజయ్‌ను తీసుకెళ్తున్న పోలీసుల వాహన శ్రేణిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సోమవారం బైంసాలో నిర్వహించే ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొనేందుకు కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయం నుంచి తన శ్రేణులతో సంజయ్‌ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో బయలుదేరారు. ఆయనతోపాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలకు చెందిన సుమారు 20కిపైగా వాహనాలు సంజయ్‌ను అనుసరించాయి. కోరుట్ల మండలం వెంకటాపూర్‌ సమీపంలో బండి సంజయ్‌ను ఆపి వెనక్కి తీసుకొస్తుండటంతో కాషాయం పార్టీ నేతలు, కార్యకర్తలు తమ నిరసన గళాన్ని బలంగా వినిపించారు. పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. సమాచారాన్ని అందుకున్న భాజపా నాయకులు, కార్యకర్తలు కోరుట్ల నుంచి కరీంనగర్‌ వరకు దాదాపుగా 15 చోట్ల రోడ్డుపై బైఠాయించి ఆందోళనల్ని చేపట్టారు.  రోడ్డుకు అడ్డంగా ఉన్న నిరసనకారులను చెదరగొడుతూ కాన్వాయ్‌ను ముందుకు తీసుకెళ్లారు.

పలుచోట్ల ఆందోళన చేస్తున్నవారిని పక్కకు తరలించే క్రమంలో కొందరు భాజపా నాయకులు కార్యకర్తలు గాయపడ్డారు. టీనగర్‌ వద్ద శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్‌ దిష్టిబొమ్మతో నిరసన తెలిపారు. మల్యాల వద్ద నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు వెనక్కితోయడంతో కొందరు కిందపడ్డారు. మల్యాల వద్ద తమ పార్టీ కార్యకర్తలను కొట్టారని, నూకపల్లి ఉపసర్పంచిని ఎస్సై తన్నారని ఆరోపిస్తూ భాజపా శ్రేణులు నిరసన తెలిపాయి. పార్టీ కార్యకర్తలు ఎక్కడెక్కడ ఆందోళన చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకుంటూ ముందుగా వచ్చిన పోలీసులు వారిని అడ్డు తప్పించే ప్రయత్నాలు చేశారు.  మరోవైపు కరీంనగర్‌లోనూ పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని