logo

రేషన్‌ కార్డులో పేరెక్కేదెప్పుడు..?

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేసింది కానీ.. కుటుంబ సభ్యుల్లో కొత్తగా పేరు నమోదు చేసుకున్నవారి పేర్లను ఆమోదించడం లేదు.

Updated : 28 Nov 2022 05:53 IST

న్యూస్‌టుడే, భగత్‌నగర్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేసింది కానీ.. కుటుంబ సభ్యుల్లో కొత్తగా పేరు నమోదు చేసుకున్నవారి పేర్లను ఆమోదించడం లేదు. ఈ ప్రక్రియను చేపట్టడం లేదు. సుమారు ఏడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో కొత్తగా వివాహం చేసుకున్నవారి పేరు కుటుంబ సభ్యుల్లో చేరడం లేదు. వివాహం జరగ్గానే అమ్మాయి తల్లిదండ్రులు తమ కుటుంబ సభ్యుల నుంచి కుమార్తె పేరు తొలగించి, అత్తగారి ఇంట్లో చేర్చుకోవాలని సూచిస్తుండడంతో చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు. తొలగింపునకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం పేరు చేర్చడంలో మాత్రం అవకాశం కల్పించడం లేదు. పిల్లలు పుట్టాక వారి పేర్లను రేషన్‌ కార్డులో చేర్చడానికి దరఖాస్తు చేసుకుంటున్న వారికీ నిరాశే ఎదురవుతోంది.


చిత్రంలో కుటుంబంతో కలిసి కనిపిస్తున్న దమ్మన శ్యామ్‌ ప్రసాద్‌.. రాంనగర్‌లో నివాసం ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2017, మార్చి 31న తన కుమారుడు, కుమార్తె పేర్లను రేషన్‌ కార్డులో చేర్చడం కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. జిల్లా వ్యాప్తంగా ఏకంగా 41,643 మంది రేషన్‌ కార్డులో పేరు నమోదు, పేరు మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు.


దరఖాస్తులకు మోక్షం ఎప్పుడో..?

రేషన్‌ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని కోరుతూ అధికారుల లెక్కల ప్రకారం 41,643 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇన్‌స్పెక్టర్‌ స్థాయిలో 13,756, తహసీల్‌ స్థాయిలో 997, డీఎస్‌వో స్థాయిలో 12,998 పెండింగ్‌లో ఉండగా 12,980 దరఖాస్తులు అఫ్రూవ్‌ చేశారు. 912 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. కనీసం అఫ్రూవ్‌ చేసిన వారిపేర్లను రేషన్‌ కార్డులో నమోదు చేసినా లబ్ధిదారులకు కొంత ఆర్థికంగా చేయూతగా ఉండేది కానీ ఆ దిశగా అడుగులు పడడం లేదు.  

తొలగింపులో ముందు..

రేషన్‌కార్డు రద్దు చేయడంలో ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ‘360 డిగ్రీలు’ పేరిట కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చింది. దీంతోనే రేషన్‌కార్డులు, లబ్ధిదారుల సమాచారాన్ని సేకరిస్తోంది. లబ్ధిదారుడికి కారు, ఐదెకరాల పైబడి వ్యవసాయం, ఆదాయపు పన్ను, తదితర అంశాలను పరిశీలిస్తూ అనర్హులకు ఆటోమెటిక్‌గా కార్డు రద్దు చేస్తోంది. ఇలా జిల్లాలో 1,406 కార్డులు తొలగిపోయాయి. ఇక కుటుంబ సభ్యుల్లో ఎవరు మృతి చెందినా వెంటనే తొలగిస్తున్నారు కానీ.. పుట్టినవారి పేర్లను నమోదు చేయడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని