logo

ఒగ్గుకథ.. ఐలయ్యకు ప్రాణపదం

ఒగ్గు కథపై మక్కువతో 15వ ఏటే ఆ కళను తన ఒంట పట్టించుకున్నారు. మొదట్లో జగ్గు ఊపే పాత్ర పోషించి మహిళా పాత్రల వేషం వేస్తూ కథలు చెప్పేవారు.

Published : 28 Nov 2022 03:40 IST

కేంద్ర సంగీత నాటక పురస్కారానికి ఎంపిక కావడంతో సర్వత్రా హర్షం
గంగాధర, న్యూస్‌టుడే

ఒగ్గరి అయిలయ్యను సత్కరిస్తున్న ఎమ్మెల్యే రవిశంకర్‌

ఒగ్గు కథపై మక్కువతో 15వ ఏటే ఆ కళను తన ఒంట పట్టించుకున్నారు. మొదట్లో జగ్గు ఊపే పాత్ర పోషించి మహిళా పాత్రల వేషం వేస్తూ కథలు చెప్పేవారు. దాదాపు 45 ఏళ్లు దేశ, విదేశాల్లో వందలాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు మిద్దె రాములుకు ఆయన ఒగ్గు కళలో మెలకువలు నేర్పించారు. ఒగ్గు కథలతో ఎందరో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకున్నారు. ఆయనే కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని మారుమూల గ్రామం ర్యాలపల్లికి చెందిన ఒగ్గరి ఐలయ్య (80). ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా అందిస్తున్న కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురిని సిఫారసు చేయగా అందులో ఒగ్గరి ఐలయ్య ఒకరు.

పల్లె నుంచి దిల్లీ వరకు..

పేదరికంతో కుటుంబాన్ని పోషించుకోవడమే ఇబ్బందిగా మారిన ఆ రోజుల్లో తాను ఒగ్గు కథను జీవనోపాధిగా ఎంచుకున్నారు. 15 నుంచి 60 ఏళ్ల వయసు వరకు ఊరూరా ఒగ్గు కథలు చెప్పారు. మల్లన్న దేవుడి పట్నాల్లో ఒగ్గు కథలకు ప్రాధాన్యం దక్కగా.. ఈయన బృందానికే ఆ అవకాశం దక్కేది. దిల్లీలో నాలుగుసార్లు, హిమాచల్‌ప్రదేశ్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ఇతర రాష్ట్రాల్లో ఒగ్గు కళతో అక్కడి ప్రజలు, అభిమానులను ఐలయ్య మెప్పించారు. 1990లో మారిషస్‌ దేశంలోనూ తన బృందంతో ప్రదర్శించిన ఒగ్గు కథలు అలరించాయి. అప్పట్లో యూట్యూబ్‌ ఛానళ్లు, ఇతర సాధనాలు పెద్దగా లేకున్నా క్షేత్రస్థాయి ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ తనకు ఇష్టమైన అభ్యర్థులకు ఒగ్గు కథల ద్వారా ప్రచారం చేపట్టి ఇందిరాగాంధీ, పీవీ నర్సింహారావు వంటి ప్రముఖులతో సత్కారాలు పొందారు. ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు, ఇతర సామాజిక అంశాలపై ప్రజలను జాగృతం చేశారు. 45 ఏళ్లపాటు ఒగ్గు కథల్లో వేషాలతో అలరించిన ఆయన ప్రస్తుతం బృందంలో ఒకరిగా ఉంటూ జగ్గు, డప్పు వాయిస్తున్నారు. పలువురు యువకులకు ఒగ్గు కళలో నైపుణ్యం కల్పించేలా శిక్షణ ఇచ్చారు. దిల్లీలో త్వరలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా కేంద్ర పురస్కారం అందుకోనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను గుర్తించడం సంతోషంగా ఉందని, ప్రాణం ఉన్నంతవరకు ఒగ్గుకళను విడిచేది లేదని ఈ సందర్భంగా ఐలయ్య పేర్కొన్నారు. ఆయనను స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, కురుమ యువచైతన్య సమితి జిల్లా అధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్‌, తదితరులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని