logo

ఇలా బిల్లు.. అలా చెల్లింపు

విద్యుత్తు బిల్లుల రీడింగ్‌ నమోదులో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్‌) చర్యలు చేపట్టింది.

Published : 28 Nov 2022 03:40 IST

విద్యుత్తు మీటరు రీడింగ్‌ నమోదులో ఆధునిక సాంకేతికత
ఈ నెల నుంచే జిల్లాలో అందుబాటులోకి సేవలు
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

ఆండ్రాయిడ్‌ యంత్రం

విద్యుత్తు బిల్లుల రీడింగ్‌ నమోదులో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్‌) చర్యలు చేపట్టింది. వినియోగదారులకు పారదర్శక సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు అమలవుతున్న స్పాట్‌ బిల్లింగ్‌ యంత్రాల స్థానంలో ఆండ్రాయిడ్‌ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సేవలు సత్వరమే అందడంతో పాటు తప్పులు లేకుండా రీడింగ్‌ వచ్చే అవకాశం ఉంది.

విద్యుత్తు రీడింగ్‌ బిల్లుల నమోదులో ఇకపై హెచ్చు తగ్గులకు ఆస్కారం ఉండదు. రీడింగ్‌ తీసిన వెంటనే వినియోగదారులు బిల్లు చెల్లించుకునే వెసులుబాటు కల్పించారు. కొత్త విధానంలో రీడింగ్‌ ప్రక్రియ జిల్లాలో ఈ నెలలో ప్రారంభమైంది. కొత్త పద్ధతి ప్రకారం బిల్లుల నమోదులో తప్పులకు అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలోని మంథని, పెద్దపల్లి విద్యుత్తు డివిజన్ల పరిధిలో గృహ, వాణిజ్య, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సంబంధించి 2,24,052 కనెక్షన్లున్నాయి.

మంథనిలో కొత్త పరికరంతో రీడింగ్‌ తీస్తున్న ఎన్‌పీడీసీఎల్‌ అధికారి

రీడింగ్‌ తీసిన వెంటనే చెల్లించేలా..

విద్యుత్తు రీడింగ్‌ పరంగా సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ఆండ్రాయిడ్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. చరవాణి మాదిరిగా ఉండే పరికరాన్ని ప్రత్యేక సాప్ట్‌వేర్‌తో అనుసంధానించి బిల్లింగ్‌ సిబ్బందికి అందజేశారు. పాత పద్ధతి ప్రకారం ఒక ఉద్యోగి తన పరిధిలోని కనెక్షన్లకు మీటరు రీడింగ్‌ తీసి ఈఆర్వో కార్యాలయంలో అప్‌లోడ్‌ చేయాల్సి వచ్చేది. ఇందుకు రెండు, మూడు రోజుల సమయం పట్టేది. అప్పటివరకు వినియోగదారుకు ఆన్‌లైన్‌లో బిల్లు కనిపించేది కాదు. అలాగే వివరాలు అప్‌లోడ్‌ చేసే సమయంలో సాంకేతిక సమస్యలతో మొరాయించేవి. ఆండ్రాయిడ్‌ యంత్రాలతో బిల్లింగ్‌ తీసిన తర్వాత మళ్లీ అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఈఆర్వో కార్యాలయంలో అప్‌లోడ్‌ చేసిన తర్వాతనే బిల్లులు చెల్లించే అవకాశం ఉంది. కొత్త పరికరాలతో రీడింగ్‌ తీసిన వెంటనే నేరుగా చెల్లించుకోవచ్చు.

త్వరలో చరవాణి ఆధారితంగా..

విద్యుత్తు రీడింగ్‌ను ప్రతి నెలా బిల్లింగ్‌ సిబ్బందితో పాటు ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు నమోదు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్త పద్ధతిలో కాకుండా అధికారులు తమ చరవాణితోనే రీడింగ్‌ తీసే విధానం త్వరలోనే ప్రారంభం అవుతుంది. చరవాణిలో నమోదైన రీడింగ్‌ను ప్రింట్‌ తీయడానికి ప్రత్యేక యంత్రాన్ని సమకూర్చనున్నారు. మొబైల్‌ను మీటరు వద్దకు తీసుకెళ్లగానే రీడింగ్‌ నమోదవుతుంది. వెంటనే ప్రింటర్‌ నుంచి రశీదు వస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ విధానం కొనసాగుతుండగా, డిసెంబరు నుంచి జిల్లాలో అమలు కానుంది.

ఇప్పటివరకు ఇలా..

గతంలో గృహ, పారిశ్రామిక, ఇతర అవసరాలకు సంబంధించి మీటర్ల రీడింగ్‌.. దస్త్రాల ఆధారంగా ఉండేది.

వినియోగదారుల ఇంటికి వెళ్లి దస్త్రంలో రీడింగ్‌ నమోదు చేసి బిల్లులు జారీ చేసేవారు.

దీంతో సేవల్లో కొంత జాప్యం జరుగుతుండటంతో అనంతరం స్పాట్‌ బిల్లింగ్‌ యంత్రాలు వచ్చాయి.

ఒప్పంద సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి పరికరాల సాయంతో రీడింగ్‌ నమోదు చేస్తున్నారు.

అయితే కాలం చెల్లిన యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి.

ఒక యంత్రం పాడయితే సంబంధిత ఉద్యోగి పరిధిలో కనెక్షన్ల రీడింగ్‌ నిలిచిపోతోంది.

ప్రత్యామ్నాయంగా మరొకరు వచ్చి రీడింగ్‌ నమోదు చేయాల్సి వస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.


తప్పులకు అవకాశం లేదు

బి.సుదర్శన్‌, ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ

జిల్లాలో ఆండ్రాయిడ్‌ యంత్రాలతో రీడింగ్‌ నమోదు ప్రారంభించాం. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన యంత్రాలు కావడంతో రీడింగ్‌లో తప్పులు దొర్లే అవకాశం లేదు. కొత్త విధానంపై ఎలాంటి ఫిర్యాదులు రావడం లేదు. వచ్చే నెల నుంచి మా శాఖ అధికారులు చరవాణి సాయంతో రీడింగ్‌ తీయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని