logo

పైసలు లేవు... పనులు చేసేదెట్లా?

ఈ చిత్రంలో కనిపిస్తున్నది కంచర్ల స్మశానవాటిక. రూ. 12.60 లక్షలతో నిర్మించి ఏడాదిన్నర అవుతుంది. ఎంబీ రికార్డు చేయలేదని పలుమార్లు మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచి ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 28 Nov 2022 05:56 IST

సర్పంచుల ఆందోళన

వీర్నపల్లి, న్యూస్‌టుడే

వీర్నపల్లి సర్వసభ్య సమావేశంలో అధికారులను నిలదీస్తున్న సర్పంచులు

చిత్రంలో కనిపిస్తున్నది కంచర్ల స్మశానవాటిక. రూ. 12.60 లక్షలతో నిర్మించి ఏడాదిన్నర అవుతుంది. ఎంబీ రికార్డు చేయలేదని పలుమార్లు మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పీఆర్‌ ఏఈ ఎంబీ రికార్డు నమోదు చేశారు. పూర్తయిన నిర్మాణాలకు ఇప్పటికీ క్యూసీ కాకపోవడంతో పూర్తి స్థాయిలో నిధులు అందలేదు. ఈ పనిలో జీఎస్టీ పోను రూ. 1.50 లక్షల వరకు బిల్లు రావాల్సి ఉందని సర్పంచి చెబుతున్నారు. ఈయన ఒక్కరికే కాదు. జిల్లాలోని అందరి సర్పంచులకు బిల్లులు రాక నానా అవస్థలు పడుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధుల చెల్లింపులో ఆలస్యంతో గ్రామ పంచాయతీల నిర్వహణ ఇబ్బందిగా మారింది. పనులు చేసిన ప్రథమపౌరులు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు. తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టలేని పరిస్థితి నెలకొంది.  పలు చోట్ల మండల సర్వసభ్య సమావేశాల్లో అధికారులను నిలదీస్తూనే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనులకు రావాల్సిన పైసల కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి నిర్వహణ, అభివృద్ధి పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన నిధులు విడుదల చేస్తున్నాయి. పారదర్శకంగా నిధుల వివరాలు ప్రజలకు తెలియజేయాలని కేంద్రం పీఎఫ్‌ఎంఎస్‌ (పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌), గ్రామ స్వరాజ్‌ పోర్టల్‌లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరులో జాప్యం జరుగుతోంది. కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు సైతం జులై నుంచి నిలిపివేసింది. దీంతో పల్లెల్లో పనులు ప్రశ్నార్థకంగా మారాయి. ఇటీవల కేంద్రం నుంచి 10 శాతం లోపు నిధులను పంచాయతీలో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నా అవి ఎటూ సరిపోవని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.  

రూ. 20.60 కోట్లకు పైగా రాక...

జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు మార్చి నుంచి, రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు జులై నుంచి నిలిచిపోయాయి. 255 పంచాయతీలకు ప్రతి నెలా రూ. 4.12 కోట్లు రావాల్సి ఉండగా ఐదు నెలలుగా రావడం లేదు. రూ. 20.60 కోట్లకు పైగా విడుదల చేయాల్సి ఉంది. పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వివిధ పనులు, మరమ్మతులకు, కార్మికుల జీతాలు, చెత్త ట్రాక్టర్ల నిర్వహణకు డబ్బులను వడ్డీకి తెచ్చి ప్రథమ పౌరులు చెల్లిస్తున్నారు. దీంతో సర్పంచులపై ఆర్థిక భారం పడుతోంది. అలాగే వైకుంఠధామాలు నిర్మించి ఏళ్లు కావస్తున్నా క్యూసీ(క్వాలిటీ కంట్రోల్‌) జరగకపోవడంతో పూర్తిస్థాయిలో చెల్లింపులు జరగలేదు. ఒక్కో స్మశానవాటిక నిర్మాణంలో సర్పంచులకు సుమారు రూ. 2.50 లక్షలు రావాల్సి ఉంది. గ్రామాల్లో మరమ్మతులు, వివిధ పనులకు ఖర్చు చేసిన పైసలు రాలేదంటూ ఆరోపిస్తున్నారు. బంకుల్లో ఇంధనాన్ని అరువు తీసుకువస్తున్నామని చెబుతున్నారు. మిషన్‌ భగీరథ పనులకు బిల్లులు రాలేదంటూ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పదవీ కాలం దగ్గరికొస్తుండటంతో పైసలు రావేమోనన్న ఆందోళనకు గురవుతున్నారు. పెట్టిన డబ్బులు రాకుంటే ఆత్మహత్యలే శరణ్యమని పలువురు సర్పంచులు మండల సర్వసభ్య సమావేశాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థిక పరిస్థితి ఘోరంగా మారింది

- జగ్మాల్‌, ఎర్రగడ్డతండా సర్పంచి

పదవి చేపట్టిన ప్రారంభంలో మిషన్‌ భగీరథ పనులు చేసినా ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. క్యూసీ కాకపోవడంతో వైకుంఠధామాల బిల్లులు రాలేదు. దీంతో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారింది. పెట్రోలు బంకుల్లో ఇంధనాన్ని అరువు తీసుకుంటున్నాం. పారిశుద్ధ్య కార్మికులను బతిమిలాడి పనులు చేయిస్తున్నాం. పదవీ కాలం సమీపించింది. అసలు డబ్బులు వస్తాయో, రావోనన్న ఆందోళన అందరిలోనూ ఉంది. వెంటనే సర్పంచులకు రావాల్సిన బకాయిలను ఇప్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పంచాయతీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తే పల్లెలను అభివృద్ధి చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని