logo

చన్నీళ్లతోనే స్నానం!

జిల్లాలోని వసతి గృహాల విద్యార్థులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు వసతి గృహాల్లోని విద్యార్థులకు ఇంతవరకు రగ్గులు అందలేదు.

Updated : 04 Dec 2022 06:10 IST

పని చేయని వేడి నీటి యంత్రాలు
వసతి గృహాల విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
న్యూస్‌టుడే, సిరిసిల్ల(విద్యానగర్‌)

పైకప్పునకు ఉన్న గ్రిల్‌

జిల్లాలోని వసతి గృహాల విద్యార్థులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు వసతి గృహాల్లోని విద్యార్థులకు ఇంతవరకు రగ్గులు అందలేదు. పలువురు వారి ఇళ్ల నుంచి బ్లాంకెట్లు తెచ్చుకోగా, కొందరు చలిలోనే నిద్రిస్తున్నారు. కొన్ని చోట్ల వేడి నీటి యంత్రాలు పని చేయక చన్నీళ్లతోనే స్నానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జిల్లాలో మొత్తం 9 బీసీ సంక్షేమ, 12 ఎస్సీ సంక్షేమ, ఒక ఎస్టీ వసతి గృహం ఉంది. ఇప్పటివరకు జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాలకు, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలకు బ్లాంకెట్లు అందించలేదు. దీంతో విద్యార్థులు చలికి వణికిపోతున్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో పైకప్పునకు గ్రిల్‌ ఉండటం, ఓవైపు రగ్గులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాలకు బ్లాంకెట్లు ప్రభుత్వం నుంచి రావడం లేదని, ఎప్పుడోగాని రావని చెబుతున్నారు. బెడ్‌షీట్లు, కార్పెట్లు మాత్రమే అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలకు మాత్రం బ్లాంకెట్లు అందజేస్తున్నారు.


సర్దుకుపోతున్నారు

ఊడిపోయిన కిటికీల జాలీలు

ముస్తాబాద్‌, న్యూస్‌టుడే: ముస్తాబాద్‌ మండల కేంద్రంలో మండల సమీకృత సముదాయ భవనంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సాంఘిక  సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులు కలిపి 517 మంది వసతి గృహంలో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. దీంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో వసతులు లేక మరో నాలుగు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం మహిళా సంఘ భవనాన్ని కళాశాలకు వినియోగించుకుంటున్నారు. అందులో ల్యాబ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు కొంత ఇబ్బందిగా ఉంది. కొన్ని కిటికీల మెష్‌ జాలీలు ఊడిపోయాయి. నాలుగు అదనపు తరగతి గదులు, మూత్రశాలలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, మెష్‌ జాలీల కోసం ఇప్పటికే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించినట్లు ప్రిన్సిపల్‌ ఉదయ్‌కుమార్‌ తెలిపారు.


కిటికీలు ధ్వంసమైనా...

రాచర్ల గొల్లపల్లిలోని వెనుకబడి తరగతుల సాంఘిక
బాలుర వసతిగృహంలో నిద్రిస్తున్న విద్యార్థులు

ఎల్లారెడ్డిపేట, న్యూస్‌టుడే: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని బీసీ వసతి గృహంలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. వసతి గృహ సముదాయంలోని అయిదు గదుల్లో విద్యార్థులు నిద్రిస్తున్నారు. ప్రతి విద్యార్థికీ రెండు జతల దుప్పట్లను ప్రభుత్వం సరఫరా చేయగా రాత్రిపూట చలి నుంచి రక్షణ పొందుతున్నారు. అయితే రెండు వేడినీటి యంత్రాల్లో ఒకటి చెడిపోయి, మూలనపడింది. ఉదయం పూట సరిపడా వేడి నీరు సరఫరా కాకపోవడంతో నిరీక్షించే సమయం లేక విద్యార్థులు చన్నీళ్లతో స్నానం చేస్తూ ఇబ్బంది పడుతున్నారు. ఒక గదిలో కిటికీ ధ్వంసమవగా, మరో రెండు గదుల్లో తలుపుల గడియలు చెడిపోయాయి. దీనిపై ఇన్‌ఛార్జి వార్డెన్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ వేడినీటి యంత్రం మరమ్మతుకు గురికావడంతో ఒకే యంత్రం అందుబాటులో ఉందన్నారు. ఆ యంత్రం 50 మందికి సరిపడా వేడి నీటిని అందిస్తుందని తెలిపారు. హాస్టల్‌లో శుద్ధజల యంత్రం, టీవీ, ఇన్వర్టర్‌, ఎమర్జెన్సీ దీపాలు తదితర వసతుల కల్పనకు ప్రభుత్వానికి నివేదించామని ఆయన పేర్కొన్నారు.


రెండు రోజుల్లో అందజేస్తాం

- మోహన్‌రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి

జిల్లాలోని అన్ని ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల విద్యార్థులకు బ్లాంకెట్లను అందించాం. ఒకటో, రెండో మిగిలిపోయి ఉంటాయి. వాటికి కూడా అందజేస్తాం. ప్రభుత్వం నుంచి బీసీ సంక్షేమ వసతి గృహాలకు బెడ్‌షీట్లు, కార్పెట్లు మాత్రమే వస్తున్నాయి. రగ్గులు రావడం లేదు. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని