logo

ప్రయోగం.. ప్రజా ప్రయోజనం

చిట్టి బుర్రలో మెరిసిన ఆలోచనలు సమకాలీన అంశాలపై పరిశోధనల వైపు మళ్లించాయి. విద్యార్థుల మేధస్సుకు ఉపాధ్యాయుల ప్రోత్సాహం తోడవడంతో ఆవిష్కరణలు ఔరా అనిపించాయి.

Published : 04 Dec 2022 06:07 IST

రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక పోటీలకు ఎంపిక
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

చిట్టి బుర్రలో మెరిసిన ఆలోచనలు సమకాలీన అంశాలపై పరిశోధనల వైపు మళ్లించాయి. విద్యార్థుల మేధస్సుకు ఉపాధ్యాయుల ప్రోత్సాహం తోడవడంతో ఆవిష్కరణలు ఔరా అనిపించాయి. రేపటి పౌరుల ప్రతిభ చూపరులను ఆకట్టుకుంది. రెండు రోజుల కిందట పెద్దపల్లిలో జరిగిన 30వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ వైజ్ఞానిక పోటీల్లో వీరి ప్రదర్శనలు ముందువరుసలో నిలిచాయి. జిల్లా స్థాయిలో చాలా మంది విద్యార్థులు పోటీ పడగా అత్యుత్తమ ప్రదర్శనతో ఆరు ప్రాజెక్టు నమూనాలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి.


ల్యాబ్‌కు పంపకుండానే లవణాల గుర్తింపు

-మానస, పదో తరగతి, జడ్పీ పాఠశాల రాగినేడు, పెద్దపల్లి మం.

మనం తాగే నీటిలో శరీరానికి అవసరమైన లవణాలు తగిన మోతాదులో లేకుంటే కీళ్లు, మోకాళ్లు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి. స్వచ్ఛమైన నీటిలో 250-500 శాతం ఖనిజ లవణాలుండాలి. ఆర్‌వో ప్లాంటులో ఇవి కేవలం 50లోపే ఉంటుండగా మిషన్‌ భగీరథలో 300-400 శాతం ఉన్నాయి. నీటి నమూనాలను ప్రయోగశాలకు పంపించకుండానే టీడీఎస్‌(టోటల్‌ డిసాల్వ్‌ సాలిడ్స్‌) పరికరంతో సులువుగా లవణాల శాతాన్ని గుర్తించవచ్చు.


వ్యర్థాలకు అర్థం.. పరిసరాలు శుభ్రం

-రష్మిత, 8వ తరగతి, బీసీ గురుకుల పాఠశాల, పెద్దపల్లి

ఇళ్లలో ఉపయోగించే చాలా వస్తువులు వ్యర్థాలుగా మారిన తర్వాత అధిక మొత్తంలో పోగవడం పర్యావరణానికి సమస్యగా మారింది. వ్యర్థాలను వృథాగా వదిలేయకుండా తిరిగి వాడుకలోకి తేవడం ద్వారా అపరిశుభ్రత తొలగించవచ్చు. ఇందుకోసం ‘వేస్ట్‌ ఫ్రమ్‌ ది వేస్ట్‌ థింగ్‌ రీసైక్లింగ్‌ యూసింగ్‌’ విధానం ఉపయుక్తంగా ఉంటుంది. పనికిరాని దుస్తులతో బోధనోపకరణాలు, కాగితపు డబ్బాలతో అలంకార సామగ్రికి జీవం పోయవచ్చు.


రసాయన ఎరువుల వాడకంపై అవగాహన

-సాయిమాధవ్‌, 9వ తరగతి, ఆదర్శ పాఠశాల, ధర్మారం

రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే పంటలకు రసాయన ఎరువులను పిచికారీ చేస్తుండటంతో అనారోగ్యానికి గురవుతున్నారు. విష స్వభావ సూచికలను పట్టించుకోవడం లేదు. క్రిమిసంహారక మందు డబ్బాలపై ఉండే ఎరుపు రంగు సూచిక మందు అత్యంత విషపూరితమైనదని సూచిస్తుంది. ఫెరామన్‌ ట్రాప్స్‌(లింగాకర్షక బుట్టలు), దీపపు తెరలు విధానంతో రైతుల్లో రసాయన ఎరువుల వినియోగంపై అవగాహన పెంచవచ్చు. విషపూరిత రసాయనాలను గుర్తించేలా చేయవచ్చు.


ఆహార నియమాలతో ఆరోగ్య రక్షణ

-శ్రీజ, 9వ తరగతి, అల్ఫోర్స్‌ పాఠశాల, సుల్తానాబాద్‌

చాలా రకాలైన అనారోగ్యాలకు ఆహార అలవాట్లే కారణం. ఇవి అనేక రోగాలకు కారణమవుతున్నాయి. ఆరోగ్య నియమాలు పాటించడంపై నిర్లక్ష్యం వల్ల ఆసుపత్రుల పాలై ఆర్థికంగా నష్టపోతున్నారు. ‘ది హెల్త్‌ అండ్‌ ఫైన్‌లెస్‌ ఆఫ్‌ స్కూల్‌ రింగ్స్‌ గుడ్‌ హెల్త్‌’ విధానంలో ఆహార నియమాలను తెలుసుకోవచ్చు. వీటిని పాటించడం ద్వారా పరిసరాల పరిశుభ్రత పెంపొందించడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


మిశ్రమ పంటలతో సాగు లాభదాయకం

-సాత్విక, 8వ తరగతి, జడ్పీ ఉన్నత పాఠశాల, రొంపికుంట, కమాన్‌పూర్‌ మం.

పూర్వకాలంలో మాదిరిగా మిశ్రమ పంటల సాగు ఇప్పుడు చేయడం లేదు. కమతాల్లో ఒకే రకమైన పంట సాగు చేస్తుండటంతో అతివృష్టి లేదా అనావృష్టి సమయంలో రైతులు నష్టపోతున్నారు. చిరుధాన్యాలైన జొన్న, కంది, శనగ, గోధుమ వంటి పంటలు సాగు చేస్తే లాభాలు గడించవచ్చు. పోషకాహార ఉత్పత్తుల సాగు పెరగనుంది. పంట దిగుబడులతో పాటు పశుగ్రాసం కొరత తీరుతుంది. ఏక కాలంలో వివిధ పంటల సాగుతో ఖర్చులు తగ్గుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని