logo

జ్ఞాన యోగం.. శ్లోక పఠనం

భగవద్గీత పఠనం వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేస్తుంది.. సమాజంలో నిలబడేలా చేసే అంశాలు అందులో ఉంటాయి.. ఇటీవల కొన్ని ధార్మిక సంస్థలు చిన్నతనం నుంచే భగవద్గీత పఠనం..

Published : 04 Dec 2022 06:07 IST

నేడు గీతా జయంతి
న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం

చిన్నారులతో నిర్వాహకులు

భగవద్గీత పఠనం వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేస్తుంది.. సమాజంలో నిలబడేలా చేసే అంశాలు అందులో ఉంటాయి.. ఇటీవల కొన్ని ధార్మిక సంస్థలు చిన్నతనం నుంచే భగవద్గీత పఠనం.. శ్లోకాల కంఠస్థం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. నేర్పించడమే కాకుండా పోటీలూ నిర్వహిస్తున్నాయి. చిన్నారులూ ప్రతిభ చాటుతున్నారు. ఆధ్యాత్మికంగా.. ప్రశాంత జీవనానికి కొందరు మహిళలు కూడా వారి బాటలో పయనిస్తున్నారు. రాంనగర్‌ హనుమాన్‌ మందిరంలో, సాయినగర్‌ కృష్ణ మందిర్‌లో, మలయాళ సద్గురు మఠం అశోక్‌నగర్‌లో భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నారు. జిల్లాలో భగవద్గీత శ్లోక పఠనంలో ప్రతిభ చూపుతున్న చిన్నారులు.. తోటి మహిళలకు నేర్పిస్తున్న తీరుపై గీతా జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.


కరోనా కాలంలో సాధన చేశా..

- చిట్టెంపల్లి వరుణ్‌ కృష్ణ

ప్రస్తుతం పదోతరగతి చదువుతున్నా. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం ప్రారంభించా. కరోనా కాలంలో ఖాళీ సమయం దొరకడంతో అమ్మానాన్నలు వీటిని నేర్చుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు సంపూర్ణంగా శ్లోకాలు కంఠస్థం చేశాను. ఇటీవల తితిదే వారు నిర్వహించిన పోటీల్లో ద్వితీయ స్థానం సాధించా. ఇది ఎంతో ఉత్సాహన్ని ఇచ్చింది. కంఠస్థ శ్లోకాలను ఇప్పుడు భావాలతో అధ్యయనం చేస్తున్నా.


18 అధ్యాయాలు..700 శ్లోకాలు కంఠస్థం

- ఎస్‌.వివేకానంద స్వామి, కొత్తపల్లి

మా ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. నాలుగో తరగతి చదువుతున్న నేను అమ్మానాన్నల ప్రోత్సాహంతో ఏడాదిన్నర కాలంగా భగవద్గీత శ్లోకాలు కంఠస్థం చేస్తున్నా. మా తాతయ్య ఆంజనేయులు విశ్రాంత బ్యాంకు ఉద్యోగి. ఈయన వేదభవనంలో పాఠాలు బోధిస్తారు. తాతయ్య స్ఫూర్తితో వికాస తరంగిణి వారి ఆన్‌లైన్‌లో శ్లోకాల పఠన కోర్సులో చేరి నేర్చుకున్నా. 18 అధ్యాయాలు, ఏడు వందల శ్లోకాలు కంఠస్థం చేసినందుకు చినజీయర్‌ స్వామిజీ జ్ఞాపిక అందించారు. హైదరాబాద్‌ సంస్థ వారు గీతా జయంతి సందర్భంగా నిర్వహించిన పోటీలో ద్వితీయ బహుమతి అందుకున్నా. వీటిని నేర్చుకోవడంతో ఓపిక, ప్రశాంతంగా సమాధానం ఇవ్వడం, జ్ఞాపకశక్తి పెరిగాయి.


భయం పోయింది

- జి.చైతన్య, గంగిపల్లి, మానకొండూర్‌

నేను మానకొండూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నా. మా పాఠశాల ఉపాధ్యాయులు మురళీమోహన్‌ నాలుగు నెలల కిందట భగవద్గీత నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి నేర్పించారు. నాలుగో అధ్యాయంలోని 42 శ్లోకాలు కంఠస్థం చేశాను. మొదట్లో ఈ శ్లోకాలు నేర్చుకునేందుకు భయం వేసింది. క్రమంగా చదువుతున్న కొద్ది సులభంగా మారాయి. ఆ నమ్మకంతోనే కరీంనగర్‌లో తితిదే, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ వారు నిర్వహించిన పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచా. మొత్తం ఏడు వందల శ్లోకాలు నేర్చుకుంటానన్న నమ్మకం కల్గింది.


భగవద్గీత అభ్యసనంతో మంచి మార్గం

- బొద్దుల పవన్‌ తేజ

నేను రాంనగర్‌ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో గురువు బొమ్మకంటి కిషన్‌ దగ్గర భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నా. ఆ దిశగా మా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. తొమ్మిదో తరగతి చదువుతున్న నేను భగవద్గీత తాత్పర్యాలతో సహా నేర్చుకుంటున్నా. గొప్ప విషయాలు అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నా. ఎవరితో ఉద్వేగంగా మాట్లాడకూడదు, నిజం మాట్లాడాలి. ఎదుటి వారికి నచ్చేలా మాట్లాడాలి. మంచిని పెంచే జీవన విధానాన్ని బోధించే శ్లోకాలు మాకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. లయన్స్‌ క్లబ్‌ వారు నిర్వహించిన పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి పొందాను.


ఇంట్లోనే నేర్పిస్తున్నా..

- ఉదయలక్ష్మి, గృహిణి, జ్యోతినగర్‌, కరీంనగర్‌

1991లో సుందర సత్సంగ్‌ కార్యక్రమాలకు వెళ్లేదాణ్ని. అక్కడ జీవితానికి పనికి వచ్చే 40 సూత్రాలు చెప్పేవారు. అందులో ఒకటి భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం. రోజుకు రెండు నేర్చుకున్నా సంవత్సరంలో మొత్తం శ్లోకాలు వస్తాయని చెప్పారు. అలా సాధన చేసి నేర్చుకున్నా. నేను నేర్చుకున్నవి పది మందికి పంచాలనే ఇంటి వద్దనే ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు నేర్పిస్తున్నా. ప్రస్తుతం 20 మంది మహిళలు వస్తున్నారు. మా ఇంటిదాక రాలేని వారికి ఆన్‌లైన్‌లో చెబుతున్నా. చిన్న పిల్లలకు కూడా ఇంటి వద్ద చెప్పాలనుకుంటున్నా.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు