logo

తెరపైకి మరో ఆదాయ మార్గం

రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయం పెంచుకోవాల్సి ఉంటుంది.. లేదంటే ఆస్తిపన్ను, నల్లా బిల్లులపై ఆధారపడితే సాధారణ నిధులకు లోటు ఏర్పడే అవకాశాలు ఉంటాయి..

Published : 05 Dec 2022 05:45 IST

బల్దియాలో కొత్తగా  ప్రకటనల బోర్డులు

రహదారుల మధ్య ఏర్పాటు చేసిన క్యాంటీలివర్‌ ప్రచార బోర్డులు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌: రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయం పెంచుకోవాల్సి ఉంటుంది.. లేదంటే ఆస్తిపన్ను, నల్లా బిల్లులపై ఆధారపడితే సాధారణ నిధులకు లోటు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.. అలాకాకుండా ముందస్తుగా పుర, నగరపాలికలకు రావాల్సిన ఆదాయంపై దృష్టి సారిస్తే పాలన వ్యవహారాలకు ఎలాంటి చిక్కులు ఉండవు. ఇలాంటి పరిస్థితిలో సొంత ఆదాయం సమకూర్చుకోవాలని ఆదేశాలు అందుతుండడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధి విస్తరించింది. గతంలో 50 డివిజన్లు ఉండగా ప్రస్తుతం 60కి పెరగడంతో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత పాలకవర్గంపై పడింది. ఇందుకు నిధులు అవసరముండగా ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి నిధులు ఏడాదికి ఒకసారి విడుదల అవుతున్నాయి. వీటిని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే అభివృద్ధి పనులకు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ప్రజలకు అత్యవసరమయ్యే రహదారులు, మురుగుకాలువల నిర్మాణాలు, పండగల ఖర్చులు, విద్యుత్తు బిల్లులు, ఒప్పంద ఉద్యోగులు, కార్మికుల జీతాలు, ఇతర పనులకు సాధారణ నిధులే దిక్కు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా డివిజన్లలో చేపట్టిన వాటికి బిల్లులు ఇవ్వాలంటే కాసుల నిల్వ ఉండాలి. దీనికోసం వివిధ రకాల పన్నులు రాబట్టుకోవాల్సిన అవసరముంది.

ఆస్తిపన్నులే కీలకం

నగర పరిధిలో ప్రచార బోర్డులు, ట్రేడ్‌ లైసెన్స్‌లు, యూజర్‌ ఛార్జీలు నుంచి వచ్చే ఆదాయం తక్కువగా ఉండగా ఆస్తిపన్నుల రూపంలో వచ్చే ఆదాయం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం నివాసిత గృహాల సంఖ్య పెరగడం, భువన్‌ యాప్‌ ద్వారా కొలతలు నమోదు చేయడం, అంతస్తుల ప్రకారం ఇంటి నెంబర్లు కేటాయించి మదించడం, అనుమతులు లేకుండా నిర్మించే ఇళ్లకు అదనంగా పన్నులు వసూలు చేస్తుండటంతో ఆస్తి పన్ను పెరిగింది. రెండేళ్ల కిందటి వసూళ్లకు ఈ ఏడాది రెట్టింపు కావడంతో ఆదాయం పెరిగినట్లే.


డివైడర్ల మధ్య..

స్మార్ట్‌సిటీలో భాగంగా ఏర్పాటు చేయాల్సిన ప్రచార బోర్డులు, బస్‌ షెల్టర్లను ఆయా ఏజెన్సీలకు టెండర్‌ ప్రక్రియ ద్వారా అప్పగించారు. 14.5 కిలోమీటర్ల దూరంలో డివైడర్ల మధ్య ప్రచార బోర్డులు ఏర్పాటు చేసుకోవడానికి పలు సంస్థలు పోటీ పడ్డాయి. కొత్తవి, పాతవి కలిపి మొత్తం 70 వరకు ఉన్నాయి. ఆర్‌అండ్‌బీ సూచించిన స్థలాల్లో ఎన్‌వోసీ ఆధారంగా నగర పాలక అనుమతులు జారీ చేసింది. సదరు సంస్థ వీటిని నిర్మించుకుంటాయి. లైటింగ్‌ బోర్డులు కాగా డిపాజిట్‌తోపాటు ఏడాదికి చదరపు మీటర్‌ చొప్పున వసూలు చేయనున్నారు. ప్రచార బోర్డులపై ప్రచారం చేసినా, చేయకపోయినా ఏడాది మొత్తానికి ఫీజు కట్టాల్సిందే. పైగా ఏడాదికి పది శాతం చొప్పున ఫీజు పెంచుతారు. అంతేకాకుండా నగరపాలక, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఆ బోర్డులను ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది.


ఏడాదికి రూ.1.10 కోట్లు వచ్చేలా..

హైదరాబాద్‌, వరంగల్‌ మహానగరాల్లో ఇలాంటి క్యాంటీలివర్‌ బోర్డులు, బస్‌ షెల్టర్ల ద్వారా ఆదాయం పొందుతుండగా ఇక్కడ మాత్రం ఆలస్యం చేశారు.  ఇటీవల పాలకవర్గ సభ్యులతోపాటు నగర మేయర్‌ వై.సునీల్‌రావు సైతం ఆదేశాలు జారీ చేశారు. బల్దియాకు వచ్చే ఆదాయం రాబట్టుకోవాలని, కొత్త మార్గాలపై అన్వేషించాలని నిర్ణయం తీసుకోవడంతో చర్యలు చేపట్టారు. ఒక్కో క్యాంటీలివర్‌కు ఏడాదికి సుమారు రూ.78,800 చొప్పున ఆదాయం వస్తుంది. ఇదే తరహాలో బస్‌షెల్టర్లపై ప్రచారానికి పన్నులు వసూలు కానున్నాయి. రెండింటికి కలిపి ఏడాదికి రూ.1.10 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు