logo

ప్రజా చైౖతన్యం..పరిశుభ్ర పథం

స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ సర్వేలో  ఉమ్మడి జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. నెలవారీ పాయింట్ల సాధనలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది.

Updated : 05 Dec 2022 06:33 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ సర్వేలో  ఉమ్మడి జిల్లా ముందంజ
జాతీయ స్థాయి పాయింట్ల సాధనలో సిరిసిల్ల ప్రథమం
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌, మెట్‌పల్లి


కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌లో సీసాల్లో నింపిన సేంద్రియ ఎరువు

స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ సర్వేలో  ఉమ్మడి జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. నెలవారీ పాయింట్ల సాధనలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని స్చచ్ఛభారత్‌ మిషన్‌ ప్రకటించిన ఓడీఎఫ్‌ ఫ్లస్‌ స్వచ్ఛసర్వేక్షణ్‌ సర్వే పాయింట్ల పట్టికలో దేశంలోని మొదటి నాలుగు స్థానాలు తెలంగాణకే దక్కగా అందులోనూ మూడు ఉమ్మడి జిల్లాలో ఉండటం విశేషం.

స్వచ్ఛ ప్రగతిలో రాజన్నసిరిసిల్ల ముందువరుసలో ఉండగా జగిత్యాల జిల్లా కాస్త వెనుకబడి ఉంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు, అధికారుల పర్యవేక్షణ, ప్రజా చైతన్యం తోడవడంతో ఫోర్‌ స్టార్‌(నాలుగు నక్షత్రాలు) రేటింగ్‌లో ముందునిలిచాయి. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తేనే జాతీయ పురస్కారం వరించనుంది.

స్వచ్ఛతలో ప్రత్యేకతలు

పల్లెప్రగతిలో ఊరికొక సెగ్రిగేషన్‌ షెడ్డు, డంపింగ్‌ యార్డు నిర్మించారు. ఇంటికొక చెత్త బుట్టను పంపిణీ చేశారు. ట్రాక్టర్ల ద్వారా తడి, పొడి చెత్త సేకరించి, సెగ్రిగేషన్‌ షెడ్లలోని ఘన, ద్రవ పదార్థాలను వేరు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ను నిషేధించి వినియోగాన్ని నియంత్రించడంలో పంచాయతీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. స్వచ్ఛతలో పల్లెలు పోటీ పడుతున్నాయి. పలు గ్రామాల్లో వినూత్నంగా పుష్పగుచ్ఛాలు తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు, ప్రధాన కూడళ్లలో ప్రజారోగ్యంపై సందేశాత్మక చిత్రాలు ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి.

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లోకపేటలో పచ్చదనం

ప్రతి నెలా దేశవ్యాప్తంగా రేటింగ్‌

పల్లెలను బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దడం, గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణ, ఘన పదార్థాల నిర్వహణ, సేంద్రియ ఎరువుల తయారీ, ఇంకుడుగుంతలు, మురుగు పారుదల వ్యవస్థ, పరిశుభ్రతపై ప్రతి నెలా జిల్లా స్థాయిలో స్వచ్ఛభారత్‌ అధికారులు పంచాయతీల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. గ్రామ స్థాయిలో అధికార బృందాలతో తనిఖీ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా ప్రతి నెలా దేశవ్యాప్తంగా జిల్లాలకు రేటింగ్‌ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఫోర్‌ స్టార్‌ ప్రగతి సర్వే విడుదల చేశారు. ఏప్రిల్‌ చివరి నాటికి అన్ని పంచాయతీలు సంపూర్ణంగా ఆన్‌లైన్‌ చేయడంతో పాటు అంతర్గత తనిఖీలు పూర్తి చేస్తే ఫైవ్‌స్టార్‌ కేటాయించనున్నారు.


లోపాలు సరిదిద్దుకుంటేనే పురస్కారం

పల్లెల్లో పారిశుద్ధ్య చర్యలు నామమాత్రంగా ఉన్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్వహణ అధ్వానంగా మారింది. వర్షం, మురుగును నేలలోకి ఇంకించే ఇంకుడుగుంతలకు బిల్లుల చెల్లింపు నిలిచిపోవడంతో పెద్దగా ఫలితం కనిపించడం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి సంపూర్ణ స్వచ్ఛత ప్రగతిని ఆన్‌లైన్‌ చేయాల్సి ఉండటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. లోపాలను సరిదిద్దుకుంటే జిల్లాకు జాతీయ పురస్కారం సొంతం కానుంది.  


ఏ జిల్లాలో ఎలా..

* రాజన్నసిరిసిల్ల జిల్లాలో 255 పంచాయతీలుండగా వంద శాతం ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌ కనబరిచింది. ఫైవ్‌ స్టార్‌లో 249 పంచాయతీలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పోటీలో నిలిచేందుకు సిద్ధమవుతోంది.

* కరీంనగర్‌ 313 పంచాయతీలకు 311 ప్రగతి నివేదికలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తమయ్యాయి. 99.36 శాతంతో అడుగు దూరంలో ఉంది. ఫైవ్‌ స్టార్‌లోనూ 311 పంచాయతీల వివరాలు నమోదు చేశారు. మిగిలిన వాటిని ఆన్‌లైన్‌ చేస్తున్నారు.

* పెద్దపల్లిలో 266 పంచాయతీలకు 245 స్వచ్ఛత నివేదికలు ఆన్‌లైన్‌ చేయడంతో పాటు తనిఖీ పూర్తయింది. 96.11 శాతం నమోదైంది. ఫైవ్‌ స్టార్‌లో 245 పంచాయతీలు నమోదు చేసి మిగిలిన వాటిని చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

* జగిత్యాలలో 380 పంచాయతీలకు 150 పంచాయతీలే ఆన్‌లైన్‌లో ప్రగతి నమోదు చేయగా 39.47 శాతంతో ఫోర్‌ స్టార్‌ ప్రగతి సాధించలేకపోయింది. తనిఖీ అధికారులు గ్రామాల వారీగా స్వచ్ఛత ప్రగతిని సందర్శించి, ఆన్‌లైన్‌ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు