logo

కలగానే పర్యాటక ప్రగతి

ఆ తథాగతుడు నడయాడిన చారిత్రక నేల ధూళికట్ట బౌద్ధస్తూపం.. అభివృద్ధి చేస్తామంటూ దశాబ్దాలుగా నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు..

Published : 05 Dec 2022 05:45 IST

దశాబ్దాలుగా హామీలే తప్ప ఏమీ లేదు
ఉనికి కోల్పోతున్న ధూళికట్ట బౌద్ధ స్తూపం

పిచ్చి చెట్ల నడుమ ధూళికట్ట బౌద్ధ స్తూపం  

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: ఆ తథాగతుడు నడయాడిన చారిత్రక నేల ధూళికట్ట బౌద్ధస్తూపం.. అభివృద్ధి చేస్తామంటూ దశాబ్దాలుగా నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు.. మరోవైపు అగంతకుల దాడుల్లో స్మారక చిహ్నాలు శిథిలమయ్యాయి.. ముందస్తు అప్రమత్తతతో బౌద్ధస్తూప ఫలకాలు, నాగ ముచిలింద చిహ్నాలను కరీంనగర్‌లోని పురావస్తు శాఖ మ్యూజియంలో భద్రపర్చడంతో కనీసం అవైనా మిగిలిపోయాయి. ప్రస్తుతం బౌద్ధస్తూప పరిసరాలు అపరిశుభ్రంగా మారి ఆదరణ కోల్పోయిన నేపథ్యంలో ధూళికట్టకు పూర్వ వైభవం తేవాలని పర్యాటకులు కోరుతున్నారు.

ఘనమైన చరితకు ముప్పు

ఎలిగేడు మండలం ధూళికట్ట, జూలపల్లి మండలం వడ్కాపూర్‌ గ్రామాల సరిహద్దులో హుస్సేన్‌మియా వాగు తీరంలో బౌద్ధస్తూపం వెలిసింది. క్రీ.శ. 2వ శతాబ్దంలో గౌతమబుద్ధుడు బౌద్ధ మత బోధనలు చేసేందుకు ధూళికట్ట గ్రామాన్ని సందర్శించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వాగు తీరంలోనే బోధి వృక్షం కింద బుద్ధుడు ధ్యానం చేశారని, ఇప్పటికీ ఈ వృక్షం ఇలాగే ఉందని స్థానికులు చెబుతున్నారు. శాతావాహనుల కాలంలో ఈ ప్రాంతానికి బహుళ ప్రాచుర్యం లభించినట్లు, ఇక్కడి కట్టడాలను కూడా వారే అభివృద్ధి చేశారని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కట్టడం చుట్టూ చెట్లు పెరిగాయి. ఇటుక కట్టడాలు శిథిలమవుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో బుద్ధ విగ్రహం ఎడమ బొటన వేలు ధ్వంసమైంది. పర్యాటకుల సందడితో విలసిల్లాల్సిన ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధ్వంసమైన బుద్ధుడి విగ్రహం ఎడమ బొటన వేలు

ప్రతిపాదనలకే సరి..

బౌద్ధ స్తూపం కలిగిన ప్రాంత పర్యాటక అభివృద్ధి కోసం మ్యూజియం ఏర్పాటు చేయడం ద్వారా భావి తరాలకు బుద్ధుడి బోధనలు అందేలా చర్యలు తీసుకోవాలని అప్పట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ఇందులో వడ్కాపూర్‌, ధూళికట్టల వైపు తారు రహదారుల నిర్మాణంతో పాటు వీధి దీపాలు, ఇతరత్రా మౌలిక వసతుల ఏర్పాటు, బౌద్ధస్తూపం చుట్టూ ముళ్ల చెట్లు తొలగించి పర్యావరణ హిత రెస్టారెంట్లు, వసతిగృహాలు ఏర్పాటు చేయడం, ఔషధ గుణాలున్న మొక్కలు పెంచడం వంటి ప్రతిపాదనలున్నాయి. 2002లో బౌద్ధస్తూపం పునఃనిర్మాణానికి అప్పటి ప్రభుత్వం కొన్ని నిధులు కేటాయించింది. దీంతో ప్రత్యేకంగా ఇటుకలు తెప్పించి కొంత మేర నిర్మాణం చేపట్టి మధ్యలో వదిలేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం ‘స్వదేశీ దర్శన్‌’ కింద సకల వసతులతో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదు.


ప్రణాళిక, కార్యాచరణ సిద్ధం:
మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం డైరెక్టర్‌, హైదరాబాద్‌

ధూళికట్ట బౌద్ధ స్తూపం వద్ద పర్యాటక అభివృద్ధిపై ప్రణాళిక, కార్యాచరణ సిద్ధం చేశాం. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. వారి నిర్ణయాల మేరకే అభివృద్ధి జరిగే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని