logo

ప్రారంభానికి సిద్ధం.. జన సమీకరణపైనే దృష్టి

జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్‌ సముదాయం, తెరాస పార్టీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవంతోపాటు, వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలకు సర్వం సిద్ధం చేశారు.

Published : 06 Dec 2022 03:18 IST

న్యూస్‌టుడే, జగిత్యాల

జగిత్యాలలోని మోతె రోడ్డులో సభా వేదిక

జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్‌ సముదాయం, తెరాస పార్టీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవంతోపాటు, వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలకు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ జిల్లా కేంద్రానికి తొలిసారి వస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధర్మపురికి రెండుసార్లు, మెట్‌పల్లికి రెండుసార్లు వచ్చారు. ధర్మపురికి పుష్కరాల సందర్భంగా ఒకసారి రాగా ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మరోసారి వచ్చారు. మెట్‌పల్లికి రెండుసార్లు వచ్చినప్పటికి ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఇంట్లో జరిగిన కార్యక్రమాలకే వచ్చారు. రాయికల్‌లో జీయర్‌ ట్రస్ట్‌ కార్యక్రమంలో అప్పటి మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. నాలుగేళ్ల క్రితం రాంపూర్‌, రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌజ్‌ పనులను పరిశీలించారు. జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్‌ నిర్మాణం పూర్తయి రెండేళ్లు దాటింది. రెండుసార్లు కార్యక్రమం ఖరారైనప్పటికి వాయిదా పడింది. ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదరగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

సభకు రెండు లక్షల మంది అంచనా..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాకు వస్తున్న సందర్భంగా మోతె శివారులో భారీ బహిరంగసభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమ బాధ్యతలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు భుజాన వేసుకున్నారు. ఇప్పటికే రెండుసార్లు వచ్చి దిశానిర్దేశం చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీ కవిత సైతం హరీష్‌రావుతో కలిసి ఓసారి వచ్చారు. జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్‌, తెరాస జిల్లా అధ్యక్షుడు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యేలు డాక్టర్‌ ఎం.సంజయ్‌కుమార్‌, సుంకె రవిశంకర్‌, చెన్నమనేని రమేష్‌బాబు తదితరులు తమ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాతోపాటు కరీంనగర్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల నుంచి ప్రజలు వచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 200 ఆర్టీసీ బస్సులను కేటాయించారు. ఇతర వాహనాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. రెండు లక్షల మంది అంచనాతో మోతె సమీపంలో సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, పాడి కౌశిక్‌రెడ్డి, టి.భానుప్రసాద్‌రావు తదితరులు కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు