logo

పట్టుదల ముందు వైకల్యం బలాదూర్‌

అంగ వైకల్యం తమ ఆశయానికి అడ్డురాదని నిరూపిస్తున్నారు జిల్లాకు చెందిన క్రీడాకారులు. ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన జాతీయస్థాయి పారా త్రోబాల్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన రాష్ట్ర జట్టులో బోయినపల్లి మండలం మల్లాపూర్‌కు చెందిన మంత్రి మనోహర్‌, రుద్రంగికి చెందిన సింగారపు బాబు, కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన వెంకటేశ్‌ ఉన్నారు.

Published : 06 Dec 2022 03:18 IST

పారాలింపిక్స్‌లో  రాణిస్తున్న జిల్లా యువకులు
న్యూస్‌టుడే, బోయినపల్లి

పారా త్రోబాల్‌ పోటీల్లో క్రీడాకారులు (పాతచిత్రం)

అంగ వైకల్యం తమ ఆశయానికి అడ్డురాదని నిరూపిస్తున్నారు జిల్లాకు చెందిన క్రీడాకారులు. ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన జాతీయస్థాయి పారా త్రోబాల్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన రాష్ట్ర జట్టులో బోయినపల్లి మండలం మల్లాపూర్‌కు చెందిన మంత్రి మనోహర్‌, రుద్రంగికి చెందిన సింగారపు బాబు, కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన వెంకటేశ్‌ ఉన్నారు. చిన్నతనం నుంచి అంగవైకల్యం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి ఆసక్తి ఉన్న క్రీడలను మాత్రం వదల్లేదు. కుటుంబ పోషణ కోసం పనులు చేసుకుంటూ ఖాళీ సమయంలో సాధన చేస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. జాతీయ పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారులపై కథనం.


డ్రైవింగ్‌, సెంట్రింగ్‌ పనులు చేస్తూ..

మల్లాపూర్‌ గ్రామానికి చెందిన మంత్రి మనోహర్‌ డిగ్రీ వరకు చదువుకున్నాడు. గ్రామంలో తోటి స్నేహితులు వాలీబాల్‌ ఆడుతుండగా నిత్యం చూడటంతో తనకు ఆడాలన్న ఆసక్తి కలిగింది. పుట్టుకతో ఒక కాలు చిన్నగా ఉండటంతో వాలీబాల్‌ ఆడటానికి సంశయించేవాడు. గ్రామానికి చెందిన మాధవరెడ్డి ప్రోత్సాహంతో సకలాంగులతో కలిసి వాలీబాల్‌ ఆడటం ప్రారంభించాడు. రుద్రంగికి చెందిన బాబుతో పరిచయం ఏర్పడటంతో పారా త్రోబాల్‌ నేషనల్‌ పోటీల్లో పాల్గొంటున్నాడు. 2014 నుంచి ఇప్పటి వరకు పదిహేను సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. పారా త్రోబాల్‌లో డిఫెన్సింగ్‌ ఆటగాడిగా రాణిస్తున్నాడు. చిన్నతనంలోనే తండ్రి మృతి చెందాడు. కుటుంబ పోషణ కోసం డ్రైవింగ్‌, సెంట్రింగ్‌ పనులకు వెళ్తున్నాడు. ఖాళీ సమయంలో వాలీబాల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. పోటీలకు వెళ్లిన సమయంలో రూ.15 వేలు ఖర్చు అవుతుందని, తానే భరిస్తున్నట్లు మనోహర్‌ తెలిపాడు. ప్రభుత్వం, దాతలు సహకరించి ప్రోత్సహించాలని కోరాడు.


పంచాయతీ కార్మికుడిగా పని చేస్తూనే...

కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన వెంకటేశ్‌కు చిన్నతనం నుంచి కాలు, చేయి వైకల్యం ఉంది. ఎంబీఏ పూర్తి చేసిన పంచాయతీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. రుద్రంగికి చెందిన బాబు ప్రోత్సాహంతో 2015 నుంచి రాష్ట్ర జట్టు నుంచి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నాడు. వాలీబాల్‌తోపాటు క్రికెట్‌, చదరంగం, క్యారం ఆటలపై ఆసక్తి ఉన్న వెంకటేశ్‌ ఇటీవల జిల్లా స్థాయి చెస్‌ పోటీల్లో సత్తా చాటి మొదటి స్థానంలో నిలిచాడు. ఎంబీఏ పూర్తి చేసినప్పటికి కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్మికుడిగా పని చేస్తున్నట్లు తెలిపాడు. పోటీలకు వెళ్లిన సమయంలో ఖర్చులకు డబ్బులు సమకూర్చుకోవడం భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.


పెయింటింగ్‌ వేస్తూ...

రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సింగారపు బాబుకు చిన్నతనంలో కుడి కాలుకు పోలియో సోకింది. పదో తరగతి చదువుకున్న అనంతరం జీవనోపాధి వేటలో గల్ఫ్‌ వెళ్లిన బాబు స్వగ్రామానికి వచ్చిన అనంతరం క్రీడలపై దృష్టిసారించాడు. స్నేహితులు, స్థానిక యువకులతో కలిసి వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ సాధన చేశాడు. 19 సార్లు జాతీయ, 6 సార్లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. శ్రీలంక, థాయిలాండ్‌, మలేషియా దేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని రెండు గోల్డ్‌, నాలుగు సిల్వర్‌ మెడల్స్‌ సాధించాడు. పారాలింపిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ సకలాంగులకు అందిస్తున్న విధంగా తమకు ప్రభుత్వం అండగా నిలవాలని పోరాడుతున్నాడు. ప్రస్తుతం పెయింటింగ్‌ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని