logo

ప్రత్యేక తరగతులు.. ప్రతి వారం పరీక్షలు

ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తున్న విద్యార్థులు జూనియర్‌ కళాశాలల్లో చేరిన తరవాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు.

Published : 06 Dec 2022 03:18 IST

ఇంటర్‌ ఫలితాల  మెరుగుకు చర్యలు
న్యూస్‌టుడే, గంభీరావుపేట

గంభీరావుపేట జూనియర్‌ కళాశాలలో ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులు

ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తున్న విద్యార్థులు జూనియర్‌ కళాశాలల్లో చేరిన తరవాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ప్రతి కళాశాలలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుంది. దీన్ని గుర్తించిన ఇంటర్‌ బోర్డు అధికారులు తాజాగా విద్యార్థులకు ప్రతీ వారం తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వారం రోజుల పాటు నేర్చుకున్న పాఠ్యంశాలపై పరీక్షలు పెడుతున్నారు. ఇందులో వెనకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. తద్వారా ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తున్నారు.

జిల్లాలో పది జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో వేములవాడ, ఇల్లంతకుంట, సిరిసిల్ల బాలురు కళాశాలలో ఒకేషనల్‌ (వృత్తి విద్య) కోర్సులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రథమ సంవత్సరంలో 1,108 మంది, ద్వితీయ సంవత్సరంలో 1151 మంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా వృత్తివిద్యా కోర్సుల్లో ప్రథమ సంవత్సరం 233 మంది, ద్వితీయ సంవత్సరం 276 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 2,768 మంది ఇంటర్‌ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే జిల్లాలో ఏటా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. గత విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 60 శాతం, ద్వితీయ సంవత్సరంలో 64 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగా జూనియర్‌ కళాశాలలో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కళాశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. అధ్యాపకులు చెప్పిన పాఠ్యాంశాలను చదువుతూ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. ప్రతి వారం పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీనివల్ల వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. దీనివల్ల ఈ విద్యా సంవత్సరం ఉత్తమ ఫలితాలను సాధిస్తామని అధ్యాపకులు, విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


పాఠ్యాంశంపై పట్టు...
- కేశవ్‌, బైపీసీ, ద్వితీయ సంవత్సరం

ప్రతి వారం చదువుకున్న దానిపై పరీక్షలను నిర్వహించటం వల్ల పాఠ్యాంశంపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. దీనివల్ల పరీక్షల సమయంలో సులువు అవుతుంది. అధ్యాపకులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. దీనివల్ల చదువుకున్న పాఠాలను మళ్లీ పునశ్చరణ చేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం మా కళాశాల నుంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తాం.


ఎంతగానో ఉపయోగం
- శ్రావణి, హెచ్‌ఈసీ, ద్వితీయ సంవత్సరం

ప్రత్యేక తరగతులు, ప్రతి వారం పరీక్షలను నిర్వహించటం మాకు ఎంతగానో ఉపయోగంగా ఉంది. ప్రిన్సిపల్‌ ప్రత్యేక చొరవ తీసుకుని ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం మాపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా అధ్యాపకులు నివృత్తి చేస్తున్నారు.


ఉత్తమ ఫలితాలను సాధిస్తాం
-సీహెచ్‌.మోహన్‌, డీఐఈవో

గత విద్యా సంవత్సరం వచ్చిన ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తాం. దాని కోసం కృషి చేస్తున్నాం. విద్యార్థులకు ప్రతి వారం పరీక్షలు పెట్టి వారికి చదువుపై మక్కువ పెంచుతున్నాం. ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. వెనకబడిన విద్యార్థులపై మా అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని