logo

యాసంగి విద్యుత్తు ప్రణాళిక ఏదీ?

యాసంగి వ్యవసాయ సాగు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 2,07,054 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది.

Published : 06 Dec 2022 03:18 IST

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

పంటల సాగుకు దుక్కిదున్నుతున్న రైతు  

యాసంగి వ్యవసాయ సాగు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 2,07,054 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. సాగుకు కీలకమైన ఎస్సారెస్పీ నీటి సరఫరాను సైతం ఈ నెల 25 నుంచి విడుదల చేసేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అత్యంత కీలకమైన విద్యుత్తు సరఫరాకు మాత్రం యాసంగి ప్రణాళిక తయారు కాలేదు.

సాగునీటి సరఫరాలో మార్పులుండేనా?

జిల్లాలో వరి 1,92,809 ఎకరాల్లో, మిగిలిన ఎకరాల్లో కందులు, వేరుశెనగ, పెసలు, మినుముల పంటలు సాగు కానున్నాయి. సేద్యానికి సరిపడా విత్తనాలు, ఎరువులను వ్యవసాయశాఖ రైతులకు అందుబాటులో ఏర్పాటు చేసింది. టన్నుల వారీగా యూరియా 7,102, డీఏపీ 453, కాంప్లెక్స్‌ 4,277, ఎంఓపీ, ఇతరాలు కలిపి 625 టన్నుల్లో సిద్ధం చేశారు. విత్తనాల వారీగా బీపీటీ 3,144, ఆర్‌ఎన్‌ఆర్‌ 1,098, హెచ్‌ఎంటీ సోనా 250.9, జేజీఎల్‌ 2011, కేఎన్‌ఎం 130, ఇతరత్రా 1014 టన్నుల నిల్వలు ఏర్పాటు చేశారు. ఎస్సారెస్పీ నీటిని ఈ నెల 25 నుంచి ఒక తడి, జనవరిలో రెండు, ఫిబ్రవరిలో రెండు, మార్చిలో రెండు, ఏప్రిల్‌లో ఇంకో రెండు తడులు సరఫరా చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వేసవిలో నీటి తడుల అవసరాలను బట్టి పలు మార్పులు, చేర్పులు ఉండనున్నాయి.

అన్నదాతల్లో ఆందోళన

ప్రభుత్వం ఇప్పటికే 24 గంటల విద్యుత్తు సరఫరా అందిస్తుండగా పంట కోతల తర్వాత దాదాపు 10 నుంచి 12 గంటల విద్యుత్తు సరఫరా మాత్రమే అందిస్తున్నారు. రాత్రివేళల్లో సరఫరా నిలిపివేస్తుండగా ఉదయం, మధ్యాహ్నం అప్పుడప్పుడు రెండు, మూడు గంటలు మాత్రమే అందిస్తున్నారు. ఇప్పటికే నారుమళ్లు సిద్ధం చేస్తుండగా జనవరి మొదటి వారం నుంచి నాట్లు వేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్తు సరఫరా లేకుంటే సాగు ప్రశ్నార్థకం కానుంది. వరికి నీటికి అవసరం ఎక్కువ కావడం జనవరిలో నాట్లు ఊపందుకుంటే ఏప్రిల్‌ వరకు దిగుబడి వచ్చే అవకాశాలుంటాయి. మార్చిలో ఉష్ణోగ్రతల ఉద్ధృతి పెరిగితే నీటి తడుల సంఖ్య పెరుగుతుంది. ఇలాగే వ్యవసాయ విద్యుత్తు సరఫరా ఉంటే సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


వారంలో ప్రణాళిక రూపొందిస్తాం  - సుదర్శన్‌, జిల్లా విద్యుత్తు శాఖాధికారి

పంట కోతల అనంతరం ప్రస్తుతం సాగు కోసం విద్యుత్తు అవసరం తక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 47 వేల విద్యుత్తు కనెక్షన్లు ఉండగా కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు వెంటనే మంజూరు చేస్తున్నాం. వారం రోజుల్లో విద్యుత్తు సరఫరాకు సంబంధించిన ప్రణాళిక రూపొందిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని