logo

మురుగు శుద్ధికి పడని అడుగులు!

‘తక్షణమే మురుగు జలాల శుద్ధికి చర్యలు తీసుకోనట్లయితే కఠిన చర్యలు తప్పవని’ కాలుష్య నియంత్రణ మండలి, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ హెచ్చరించినా’... ‘నగరంలో మురుగు జలాల శుద్ధి కేంద్రాల ఏర్పాటునకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని’ నగర మేయర్‌ ప్రభుత్వాన్ని కోరినా సంబంధిత అధికారుల్లో చలనం రావడం లేదు.

Published : 06 Dec 2022 03:18 IST

ప్రతిపాదనల్లోనే పనులు... నత్తనడకన నిర్మాణాలు
న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

రామగుండంలో పూర్తికాని మురుగు జలాల శుద్ధి కేంద్రం

‘తక్షణమే మురుగు జలాల శుద్ధికి చర్యలు తీసుకోనట్లయితే కఠిన చర్యలు తప్పవని’ కాలుష్య నియంత్రణ మండలి, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ హెచ్చరించినా’... ‘నగరంలో మురుగు జలాల శుద్ధి కేంద్రాల ఏర్పాటునకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని’ నగర మేయర్‌ ప్రభుత్వాన్ని కోరినా సంబంధిత అధికారుల్లో చలనం రావడం లేదు. శ్రీపాద ప్రాజెక్టు నిర్మాణంలో సుందిళ్ల బ్యాక్‌ వాటర్‌తో మల్కాపూర్‌లోని రామగుండం నగరపాలిక మురుగు  జలాల శుద్ధి కేంద్రం ముంపునకు గురికావడంతో పరిహారంగా రూ.11.25 కోట్లు ఇస్తే మరోచోట మురుగు జలాల శుద్ధి కేంద్రం నిర్మించుకుంటామని రామగుండం నగరపాలిక కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా గోదావరినది జలాలు కలుషితమవుతున్నాయి. తమవంతు బాధ్యతగా ఆయా ప్రాంతాల నుంచి వెలువడే మురుగు జలాల శుద్ధి కోసం సింగరేణి, ఎన్టీపీసీ యాజమాన్యాలు ప్రత్యేకంగా మురుగు జలాల శుద్ధి కేంద్రాలను నిర్మించుకోగా రామగుండం నగరపాలిక మాత్రం తమ బాధ్యతను విస్మరిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిధులు కేటాయించినా...

జీరో డిస్‌ఛార్జి సీవరేజ్‌ సిస్టమ్‌ కోసం రామగుండం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే ప్రత్యేక నిధుల్లోంచి రూ.12 కోట్లు కేటాయించినా అంచనాలే పూర్తి కాలేదు. గోదావరిఖని ప్రాంతం నుంచి వెలువడుతున్న మురుగు జలాల శుద్ధి కోసం మల్కాపూర్‌ శివారులో మురుగు జలాల శుద్ధి కేంద్రం నిర్మాణానికి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.97 కోట్లు కేటాయించారు. రామగుండం ప్రాంతం నుంచి వెలువడే మురుగు జలాల శుద్ధికి కేంద్రం నిర్మాణం కోసం డి.ఎం.ఎఫ్‌.టి. నిధులు రూ. 2.86 కోట్లు కేటాయించగా మల్కాపూర్‌లో శుద్ధి కేంద్రం ఊసే లేదు. రామగుండంలో నిర్మాణం కొంత మేరకు జరిగినప్పటికీ గుత్తేదారునకు బిల్లులు చెల్లించకపోవడంతో సుమారు ఏడాదిగా పనులు నిలిపివేశారు. ఎలాగోలా బిల్లులు చెల్లించడంతో ఇటీవలె పనులను తిరిగి ప్రారంభించారు. గోదావరిఖనిలో ప్రధాన మురుగు కాలువపైన గ్రీన్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఎకో చైన్స్‌ విధానంలో మురుగు జలాలను శుద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదు. గోదావరిఖనిలోని రెండు ప్రధాన మురుగు కాలువల నుంచి వెలువడే మురుగు జలాలను శుద్ధి చేసేలా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకుంది. నగరంలోని ప్రధాన మురుగు కాలువల్లో ప్రవహించే మురుగు జలాల శుద్ధి కోసం రూ.47 కోట్లు కేటాయించాలంటూ నగర మేయర్‌ డాక్టర బంగి అనిల్‌కుమార్‌ కొన్ని నెలల క్రితం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, కేంద్ర పట్టణాభివృద్ది మంత్రిని కలిసి వినతిపత్రాలు సైతం సమర్పించారు.

స్వచ్ఛ సర్వేక్షన్‌లోనూ..

నగరంలో మురుగు జలాల శుద్ది కేంద్రాలు లేకపోవడంతో స్వచ్ఛ సర్వేక్షణ్‌ మార్కుల కేటాయింపులోనూ రామగుండం నగరపాలిక వెనకబడుతోంది. సంపూర్ణ పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణతో పాటు మురుగు జలాల శుద్ధి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కీలకమైన అంశంగా ఉంది. చెత్త నిర్వహణ అటకెక్కడంతో పాటు మురుగు జలాల శుద్ధి కేంద్రాల ఏర్పాటునకు చర్యలు తీసుకోకపోవడంతో ఈ విభాగంలో మార్కులను కోల్పోవాల్సి వస్తుంది. నగరంలో మురుగు జలాల శుద్ధి కేంద్రాలు ఉంటే స్వచ్ఛ సర్వేక్షణ్‌ల ‘వాటర్‌ ప్లస్‌’ కేటగిరీలో సుమారు 1000 మార్కులు వచ్చే అవకాశముంది. రామగుండంలో మురుగు జలాల శుద్ధి కేంద్రాలు లేకపోవడంతో ఈ మార్కులను కోల్పోవాల్సి రాగా ర్యాంకింగ్‌లో వెనకబడాల్సి వస్తోంది.

మానవ వ్యర్థాల్లోంచి ఎరువు...

మురుగు జలాల శుద్ధితో పాటు మానవ వ్యర్థాల నిర్వహణలోనూ ప్రత్యేక దృష్టి సారిస్తున్న ప్రభుత్వం ప్రత్యేకంగా మానవ వ్యర్థాల నుంచి ఎరువును తయారు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పది నగరాల్లో రూ.16 కోట్లతో ఎఫ్‌.ఎస్‌.టి.పి. కేంద్రాల నిర్మాణం చేపట్టారు. దీనిలో భాగంగా గోదావరిఖని మల్కాపూర్‌ శివారులో రూ.1.6 కోట్లతో ఎఫ్‌.ఎస్‌.టి.పి. కేంద్రం ఏర్పాటు చేశారు. పనులు దాదాపుగా పూర్తికాగా కొద్ది పాటి పనులతో వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. కాగా ఈ విషయంలోనూ జాప్యం నెలకొంటోంది. కేంద్రం వినియోగంలో లేకపోవడంతో పాటు రక్షణ వ్యవస్థ లేదు. కేంద్రంలోని మరుగుదొడ్లు, మూత్రశాలలను ధ్వసం చేయడంతో పాటు అందులోని సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. నగరంలోని సెఫ్టిక్‌ ట్యాంకుల్లోంచి తీసుకొచ్చిన వ్యర్థాలను కేంద్రానికి తీసుకురాగానే ప్రత్యేక విధానంతో శుద్ధిచేసి ఎరువును తయారు చేస్తారు. అనంతరం జలాలను తిరిగి గోదావరిలోకి వదిలేస్తారు. దీంతో నదీ జలాలు కలుషితం కాకుండా ఉండే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని