logo

తొలిమెట్టు.. ఉడుంపట్టు

పిల్లల్లో అక్షర విజ్ఞానాన్ని మెరుగుపరిచేందుకు విద్యాశాఖ చేపట్టిన ‘తొలిమెట్టు’ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) సత్పలితమిస్తోంది. అధికారుల పర్యవేక్షణ ముమ్మరం చేయడంతో పురోగతి సాధ్యమవుతోంది.

Published : 06 Dec 2022 03:18 IST

వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
పెరిగిన కనీస సామర్థ్యాలు
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

విద్యార్థుల సాధన

పిల్లల్లో అక్షర విజ్ఞానాన్ని మెరుగుపరిచేందుకు విద్యాశాఖ చేపట్టిన ‘తొలిమెట్టు’ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) సత్పలితమిస్తోంది. అధికారుల పర్యవేక్షణ ముమ్మరం చేయడంతో పురోగతి సాధ్యమవుతోంది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలకు కొదవలేదు. ప్రాథమిక దశలో అక్షర పునాది పటిష్ఠం చేసేందుకు ఈ ఏడాది ఆగస్టు 16న ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. అంతకు ముందు కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కనీస సామర్థ్యాలు తెలుసుకునేందుకు అంతర్గత పరీక్ష నిర్వహించారు. తర్వాత నెలవారీగా పరీక్షలు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు నెలల ప్రగతి చూసుకుంటే కాస్తా గాడిలో పడినట్లయింది.  

వారంలో అయిదు రోజుల సాధన

ప్రభుత్వ పాఠశాలల్లోని 3, 5వ తరగతి విద్యార్థులు చదవడం, రాయడం, చతుర్వేద ప్రక్రియలు కూడికలు, తీసివేతలపై పట్టు సాధించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. పాఠశాల విద్యాశాఖ కమిటీ, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేశారు. 1వ తరగతిలో నిమిషానికి 20 పదాలు, 2వ తరగతి పిల్లలు 25, 3వ, 4వ తరగతి పిల్లలు 40, ఐదో తరగతి విద్యార్థులు 50 పదాలను ధరాళంగా చదవాల్సి ఉంటుంది. వారంలో ఐదు రోజులు చదువు చెప్పి తర్వాత రోజు పరీక్ష కొనసాగుతోంది. ప్రతి నెల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమీక్షిస్తున్నారు.

అక్షర పురోగతి  

జిల్లాలో 353 ప్రాథమిక, 83 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 16,173 మంది చదువుతున్నారు. ప్రతి విద్యార్థిలోని కనీస సామర్థ్యాలను అంచనా వేస్తున్నారు. పాఠ్య పుస్తకాలను చదువున్నారా? రాయగలుతున్నారా? అనే విషయాలను ఉపాధ్యాయులు పరిశీలిస్తున్నారు. పాఠశాలకు గైర్హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి కారణాలు తెలుసుకుని పంపించాలని వివరిస్తున్నారు. ఉపాధ్యాయులు నిరంతరంగా శ్రమిస్తుండటంతో నాలుగు నెలల ప్రగతి కంటే సగానికి పైగా పెరిగింది. విద్యార్థుల అక్షర ప్రగతిని ప్రత్యేక యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు.

గణితంలో తడబాటు

గణిత అభ్యసన సామర్థ్యాల్లో విద్యార్థులు తడబడుతున్నారు. కూడిక, తీసివేతలు తప్ప మిగిలిన భాగహారం, గుణకారాల్లో వెనకబడ్డారు. ఆగస్టులో భాగహారంలో 5 శాతం ఉంటే నవంబర్‌లో ఒక్క శాతం కలుపుకొని, అంటే 6 శాతం మాత్రమే సాధించారు. గుణకారంలో 7 నుంచి 18 శాతానికి ఆంగ్లం చదవడంలో 18 నుంచి 25 శాతానికి చేరుకున్నారు. రాయడంలో 8 శాతానికి 16 పెరిగింది. చదవడంలో కంటే పిల్లలు రాయడంలో దృష్టిసారించలేకపోతున్నారు. పాఠాలు ఆర్థం చేసుకోవడం తక్కువే.


ప్రమాణాల పెంపే లక్ష్యం
- మాధవి, జిల్లా విద్యాధికారిణి

తొలిమెట్టులో విద్యార్థుల ప్రమాణాలు పెంపు లక్ష్యంగా పని చేస్తున్నాం. ప్రతి విద్యార్థి అక్షర ప్రగతిని అంచనా వేస్తున్నారు. విద్యార్థుల లోపాలను సరిదిద్దుకుంటున్నారు. నాలుగు నెలల ప్రగతిలో మెరుగుపడింది. అన్ని పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని