logo

అనుమానితుల గుర్తింపునకు సర్వే

కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా కుష్ఠు వ్యాధి బాధితులను గుర్తించేందుకు సర్వేలు నిర్వహించలేదు. దీంతో రోగులు ఎంత మంది ఉన్నారనేది వెల్లడి కాలేదు.

Published : 06 Dec 2022 03:18 IST

ఉమ్మడి జిల్లాలో 6 నుంచి 14 రోజులపాటు వివరాల సేకరణ
న్యూస్‌టుడే, మెట్‌పల్లి

సర్వే నిర్వహిస్తున్న బృంద సభ్యులు (పాతచిత్రం)

కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా కుష్ఠు వ్యాధి బాధితులను గుర్తించేందుకు సర్వేలు నిర్వహించలేదు. దీంతో రోగులు ఎంత మంది ఉన్నారనేది వెల్లడి కాలేదు. కరోనా ప్రభావం తగ్గడంతో రోగులను గుర్తించి సకాలంలో మందులు అందించి వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ‘జాతీయ కుష్ఠు’ నిర్మూలనలో భాగంగా అనుమానితులను గుర్తించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఇంటింటి సర్వే చేపట్టనుంది. ఈ నెల 6 నుంచి 22 వరకు 14 రోజుల(పనిదినాల్లో) పాటు అనుమానితుల వివరాలు సేకరించి చికిత్స అందించనున్నారు.

ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 167 మంది కుష్ఠు వ్యాధి బాధితులు చికిత్స పొందుతున్నారు. కొత్తవారిని గుర్తించేందుకు 14 రోజలు పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,417 మంది ఆశా కార్యకర్తలు, 753 మంది ఏఎన్‌ఎంలు ఇంటింటి సర్వే చేయనున్నారు. పరీక్షలు నిర్వహించి బాధితులను గుర్తిస్తారు. ప్రతి రోజు బృంద సభ్యులు ఉదయం 6 గంటల నుంచి 20 నివాసాల్లో సర్వే నిర్వహిస్తారు. ఇంట్లో ఉంటున్న వారిలో చిన్నపిల్లల నుంచి ముదుసలి వరకు అందరిని క్షుణ్నంగా పరీక్షించి అనుమానాస్పద కేసుల వివరాలు సేకరించి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆధికారులకు సమాచారం ఇస్తారు. ప్రాథమిక లక్షణాలున్న వారికి 15 రోజుల పాటు సమీపంలోని ఆసుపత్రిలో వైద్యాధికారులు, సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారు. కుష్ఠువ్యాధి అని తేలితే చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకుంటారు. ఆయా జిల్లాల వైద్యాధికారులు, రాష్ట్ర, జాతీయ బృందాలు సర్వేను పర్యవేక్షిస్తారు. ఉమ్మడి జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తుల సంఖ్య తక్కువగా ఉండడంతో వంద శాతం అరికట్టే విధంగా అధికారులు కృషి చేయనున్నారు..


ప్రాథమిక స్థాయిలో నియంత్రించేందుకు..
- డాక్టర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో, జగిత్యాల

ప్రారంభ దశలోనే వ్యాధి లక్షణాలు గుర్తిస్తే సకాలంలో వైద్య సేవలు అందించి ప్రాథమిక స్థాయిలో నియంత్రించేందుకు అవకాశం ఏర్పడుతుంది. చిన్న మచ్చలే అంటూ నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాధిపై అపోహలు వద్దు. ఇంటింటి సర్వేకు వచ్చే బృందానికి ప్రజలు సహకరించాలి. సిబ్బంది సర్వేలో అనుమానం ఉన్న ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయాలి. వ్యాధి నిర్ధారణ జరిగితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత మందులు అందిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని