logo

ధరణి దగాలో కొత్త కోణాలు?

తిమ్మిని బమ్మి చేయడంలో సిద్ధహస్తులమని నిరూపించారు. ఉన్నతాధికారులనే కంగుతినిపించారు. భూ మోసాల్లో కొత్త కోణాలను ఆవిష్కరించారు.

Published : 07 Dec 2022 06:15 IST

లోలోపలే తప్పును సరిదిద్దే ప్రయత్నం
ఈనాడు, కరీంనగర్‌

తిమ్మిని బమ్మి చేయడంలో సిద్ధహస్తులమని నిరూపించారు. ఉన్నతాధికారులనే కంగుతినిపించారు. భూ మోసాల్లో కొత్త కోణాలను ఆవిష్కరించారు. కాసుల కక్కుర్తి కోసం ఉన్నతాధికారుల కళ్లుగప్పారు. జిల్లాలో సంచలనాన్ని రేకెత్తించిన ధరణి రికార్డులో పేరు మార్పిడి వ్యవహారంలో కొందరు అక్రమార్కుల తీరిది. రెవెన్యూ శాఖనే కంగు తినిపించేలా జరిగిన ఘోర తప్పిదాన్ని సరిదిద్దుకునే పనిలో ఉన్నతాధికారులున్నారు. శాఖకు అప్రతిష్ఠ తెచ్చేలా జరిగిన ఈ లోపంపై లోలోపల గుస్సా చేస్తూనే అసలు పాత్రధారులెవరు..? సూత్రధారులెవరనే కోణంలో విచారణను ఇన్నాళ్లుగా కొనసాగించారు. విచారణలో బాధ్యులుగా గుర్తించిన ఇద్దరు పొరుగు సేవల సిబ్బందిపై వేటు వేసినట్లు తెలిసింది. వీరి వెనుక ఉండి అసలు ఈ భూబాగోతాన్ని నడిపించిన ఓ తహసీల్దార్‌ ప్రమేయంపైనా నజర్‌ పెట్టారు. పలుమార్లు విచారించడంతో కొన్ని ‘కొత్త’ మోసాలు బయటపడినట్లు తెలిసింది.

అసలేం జరిగిందంటే..

కరీంనగర్‌కు దగ్గరలో ఉన్న ఓ మండల కేంద్రంలోని విలువైన భూమి పట్టాలో రాత్రికి రాత్రి పేరు మారిపోయింది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న 1.07 గుంటల జాగ ధరణి రికార్డుల్లో అసలు యజమాని స్థానంలో మరొకరి పేరు వచ్చి చేరింది. బాధితుల నుంచి ఎలాంటి అర్జీ లేకుండానే లోలోపల నడిచిన ఈ వ్యవహారం భూమోసాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. జిల్లా కలెక్టరుకు తెలియకుండానే ఆయన పేరిట డిజిటల్‌ సంతకంతో ఈ తతంగం నడిచింది.  భూయజమానులు తమ పేరు స్థానంలో వేరే వ్యక్తి పేరు వచ్చిన విషయమై జిల్లా రెవెన్యూ అధికారులను కలవడంతో  అక్రమం వెలుగులోకి వచ్చింది. ఇంటి దొంగను గుర్తించేందుకు.. గుట్టు తేల్చేందుకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు నడుంబిగించారు. ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. బాధితుడికి న్యాయం చేస్తామనేలా భరోసా ఇచ్చారు. ఈ మోసంలో బాధ్యులను కనుక్కునే బాధ్యతను కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అప్పగించారు. గత కొన్నాళ్లుగా విచారణల పేరిట అక్రమాన్ని గుర్తించే పనిలో ఉన్న పోలీసులకు కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. ఓ తహసీల్దార్‌తోపాటు ధరణి పోర్టల్‌ను పర్యవేక్షించే ఇద్దరు సిబ్బంది ప్రమేయమున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించినట్లు సమాచారం. ధరణిని పర్యవేక్షించే ఇద్దరు ఉద్యోగుల పాత్ర పక్కాగా ఉందని తెలియడంతో వారిద్దరిని విధుల నుంచి తొలగించారు. తహసీల్దార్‌ను కూడా పలుమార్లు విచారించారు. అయినా ఎక్కడా కాగితం రూపంలో ఆయన తప్పు చేసినట్లు తెలియలేదనే భావనతో ఆయనపై చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. గతంలో  ఇలాంటి తప్పిదాలలో ఆ అధికారి హస్తం ఉందనే విషయాన్ని మాత్రం ఉన్నతాధికారులు గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మమ అనిపించేలా చర్యలు

భూ దందా విపరీతంగా జరిగే మండలం అవడంతో ఆ అధికారి వ్యవహారమే ప్రత్యేకంగా ఉంటుందనేది రెవెన్యూ శాఖలోనే వినిపిస్తున్న మాట. భూరికార్డుల విషయంలో తనకున్న పట్టును ఆసరాగా చేసుకుని చేతివాటాన్ని చూపించారనే ఆరోపణలున్నాయి. ఇతని చర్యలతో బాధపడ్డ భూ యజమానులు పలుమార్లు ఉన్నతాధికారులతోపాటు మానవ హక్కుల సంఘాలను ఆశ్రయించిన సందర్భాలున్నాయి. అయినా ఆయన ఎవరికీ భయపడననే డాబుని మాత్రం అందరి ముందు చూపిస్తారు.. ప్రభుత్వ భూములు పరులపరమైన కేసుల్లోనూ ఈయన హస్తముందనే ఆరోపణలున్నాయి. తనకు కొందరు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే తీరుని మాటల్లో ప్రదర్శిస్తాడనే ప్రచారముంది. ఆయనపై ప్రజావాణి సహా ఇతర సందర్భాల్లో ఎన్ని ఫిర్యాదులు అందినా ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈధరణి రికార్డులో పేరు మార్పు వ్యవహారంలోనూ శాఖాపరంగా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులే వెనుకడుగేసే పరిస్థితి కనిపిస్తుందనే ప్రచారం జిల్లాలో జరుగుతోంది. టాస్క్‌ఫోర్స్‌ విచారణను కూడా నిలిపివేసినట్లు సమాచారం. ఈ విషయమై మాట్లాడేందుకు జిల్లా ఉన్నతాధికారులు నిరాకరిస్తుండటం గమనార్హం.!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని