logo

బృహత్తర ప్రణాళికపైనే ఆశలు

భక్తుల కొంగుబంగారం..కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న ఆలయంపై ఎట్టకేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వరాలజల్లు కురిపించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 08 Dec 2022 04:56 IST

మల్యాల, న్యూస్‌టుడే: భక్తుల కొంగుబంగారం..కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న ఆలయంపై ఎట్టకేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వరాలజల్లు కురిపించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో జిల్లావాసులు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొండగట్టులో భక్తులకు సరైన వసతులులేక అసౌకర్యానికి గురవుతున్నారని, తరచూ ఆయా పార్టీల నాయకులు ఆందోళనలు చేయడం పరిపాటిగా మారింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని ఈ ఆలయం డిప్యూటీ కమిషనరు హోదాకలిగి, ఏటా రూ.20కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుండగా భక్తుల ఇక్కట్లు మాత్రం తీరడంలేదు. ఆలయ పరిధిలో మాస్టర్‌ప్లాను అమలు చేయాలన్న ప్రతిపాదనలు ఏళ్ల తరబడి అమలుకు నోచని వైనంపై పలుమార్లు ‘ఈనాడు’లో కథనాలు ప్రచురితమయ్యాయి. ముఖ్యమంత్రిగా 8 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ మొదటిసారిగా జగిత్యాల బహిరంగ సభలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.వంద కోట్లు కేటాయించడంతోపాటు యాదాద్రి తరహాలో తీర్చి దిద్దుతామని పేర్కొనడంతో వివిధ పార్టీల నాయకులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

చేపట్టాల్సిన పనులు..

కొండగట్టులో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి ‘మాస్టర్‌ ప్లాను అమలు చేయాల్సి ఉంది. దాదాపు 20 ఏళ్ల క్రితమే మాస్టర్‌ ప్లాను కోసం ఉన్నతాధికారులు పలుమార్లు ప్రణాళికలు రూపొందించినా అమలుకు నోచలేదు. దీంతో ఆలయం పక్కన కొన్ని నిర్మాణాలు చేపట్టి కూల్చేయడం మళ్లీ నిర్మించడం వల్ల నిధుల దుర్వినియోగం జరుగుతోంది. ఆలయానికి ప్రాకార మండపం విస్తరించి, భక్తులు సేదతీరడానికి డార్మిటరీ హాళ్లు, బస చేయడానికి దాదాపు వంద గదుల నిర్మాణం చేపట్టాలి. కొండ దిగువ నుంచి మెట్లదారి పక్కన కొండపైకి ‘రోప్‌వే’ నిర్మాణం చేపట్టాలి. కొండపైన హనుమాన్‌ దీక్షాపరులు మాలవిరమణ చేయడానికి అవసరమైన మండప నిర్మాణం, పురాతన మెట్లదారిని అభివృద్ధి పర్చాల్సి ఉంది. కొండపైన భక్తులు తమ వాహనాలు నిలుపుకోవడానికి స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ‘వై’ జంక్షను సమీపంలోని ఘాట్‌రోడ్డుపక్కన ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ దానిని పార్కింగ్‌ కోసం వినియోగించుకోకపోవడంతో ట్రాఫిక్‌ సమస్య పెరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి నాలుగైదు ఎకరాల్లో భూమిని చదును చేసి పార్కింగ్‌ కోసం వినియోగించాలి. కొండపైన జింకల పార్కు ఏర్పాటు చేయాలి. కొండగట్టు అంజన్న పేరిట 43ఎకరాల విలువైన భూములుండగా..నాలుగేళ్ల క్రితం కొండగట్టు ప్రాంతంలోని మరో 333 ఎకరాల ప్రభుత్వ భూములను కూడా అప్పటి జిల్లా కలెక్టరు శరత్‌ ఆలయానికి స్వాధీనం చేశారు. భక్తుల కోసం సత్రాలను, అతిథి గృహ భవనాలను నిర్మించాలి. అన్నదాన సత్రం, ప్రసాదం తయారీ కోసం ప్రత్యేక భవనాలు అవసరం. దాదాపు నాలుగేళ్ల క్రితం కొండగట్టు ఘాట్‌రోడ్డు పక్కన ఆర్టీసీ బస్సు బోల్తా పడి 65 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తర్వాత బాధిత కుటుంబాలను విస్మరించారని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారిని ఆదుకుని, ఘాట్‌రోడ్డును డబుల్‌రోడ్డుగా విస్తరించి కొన్ని చోట్ల ప్రమాదకరమైన వాలు, మూలమలుపులను సరిచేయాల్సి ఉంది. నిపుణులు సూచించినదాని ప్రకారం కొండపైకి మరో ఘాట్‌రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన అవసరాన్ని పరిశీలించాలి. దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఆలయాన్ని యాదాద్రి తరహాలో రూపొందించాలని భక్తులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని