logo

గ్రంథాలయం.. విజ్ఞాన భాండాగారం

నిరుద్యోగ యువత రాత్రనక పగలనక పుస్తకాలతో కుస్తీపడుతోంది. అధికస్థాయిలో ఉద్యోగ ప్రకటనలు వెలువడటంతో ఉద్యోగ సాధనే లక్ష్యంగా చదువుల్లో యువతీయువకులు నిమగ్నమయ్యారు.

Published : 22 Jan 2023 05:48 IST

ముస్తాబాద్‌లో అందుబాటులో ఉన్న పుస్తకాలు

న్యూస్‌టుడే, ముస్తాబాద్‌: నిరుద్యోగ యువత రాత్రనక పగలనక పుస్తకాలతో కుస్తీపడుతోంది. అధికస్థాయిలో ఉద్యోగ ప్రకటనలు వెలువడటంతో ఉద్యోగ సాధనే లక్ష్యంగా చదువుల్లో యువతీయువకులు నిమగ్నమయ్యారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు పట్టణాలకు వెళ్లి ఉద్యోగం కోసం సన్నద్ధం కావాలంటే వ్యయ, ప్రయాసాలతో కూడిన పని. అందుకు ప్రభుత్వం జిల్లా కేంద్రంతోపాటు కొన్ని మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ స్టీడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. మండల కేంద్రాల్లోని గ్రంథాలయాల్లో నిరుద్యోగ యువతకు కావాల్సిన స్టడీ మెటీరియల్‌ను సమకూర్చింది.  

అందుబాటులో 8,300 పుస్తకాలు

ముస్తాబాద్‌ మండల కేంద్రంలో దాదాపు 38 సంవత్సరాల క్రితం గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోత్గల్‌ వెళ్లే రోడ్డు పక్కన అద్దె భవనంలో గ్రంథాలయం కొనసాగుతుంది. గ్రంథాలయంలో 8,300 వరకు వివిధ రకాల పుస్తకాలు ఉన్నాయి. ప్రస్తుతం రూ.100 చెల్లించి 770 మంది సభ్యత్వం తీసుకున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువత గ్రంథాలయంలోని స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు యువతకు సూచిస్తున్నారు.

పోటీ పరీక్షల ప్రత్యేకం

గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ గ్రూప్‌-1, గ్రూప్‌-2, జాతీయ చరిత్ర, స్వాతంత్రోద్యమ చరిత్ర, జాతీయ సమగ్ర గ్రామీణాభివృద్ధి, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సాయుధ పోరాటం, ఇండియా ఎకానమి, అభివృద్ధి మార్పులు, తెలంగాణ పోరాటం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, సిరిసిల్ల సిరిమల్లేలు, భారత జాతీయ సమగ్ర రాజకీయాలు, భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ముఖచిత్రం, సైన్స్‌, గణితం, కంటెంట్‌, మెథాడాలజి, బీఆర్‌ అంబేడ్కర్‌, కానిస్టేబుల్‌, ఎస్సై ఎంట్రేన్స్‌ ఎగ్జామ్స్‌కు సంబంధించిన స్టడీమెటీరియల్‌, వెల్ఫేర్‌, మెకానిజం, పర్యావరణ విపత్తు నిర్వహణ వంటి పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయి.


సద్వినియోగం చేసుకోవాలి
- మహ్మద్‌ గులాం హుస్సేన్‌, గ్రంథాలయ ఇన్‌ఛార్జి

ముస్తాబాద్‌ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉంది. పతి రోజు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చదువుకునే వీలుంది. స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకొని నిరుద్యోగ యువత ఉద్యోగాలను సాధించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని