logo

బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం.. సర్వం సిద్ధం

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు కరీంనగర్‌ నగరం ముస్తాబైంది. మార్కెట్‌ రోడ్డు శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం నలువైపులా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

Published : 23 Jan 2023 06:12 IST

మార్కెట్‌ రోడ్డు వేంకటేశ్వరస్వామి మూలవిరాట్టు

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు కరీంనగర్‌ నగరం ముస్తాబైంది. మార్కెట్‌ రోడ్డు శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం నలువైపులా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలోనే భారీ సభా వేదికతోపాటు మాడ వీధులను తలపించే విధంగా తీర్చిదిద్దారు. నగర పుర వీధుల్లో తళుకులీనుతున్న విద్యుద్దీపాలు, రంగురంగుల్లో దేవతామూర్తుల కటౌట్లతో కరీంనగర్‌ నగరం సరికొత్త శోభ సంతరించుకుంది. తెలంగాణ చౌక్‌, బస్టాండ్‌ ఎదురుగా, వన్‌ టౌన్‌ ఎదురుగా భారీ దేవతామూర్తుల కటౌట్లు ఆకర్శిస్తున్నాయి. నగర కూడళ్లను, మాడ వీధులను స్వాగత తోరణాలు, విద్యుత్తు దీపకాంతుల్లో రహదారులు శోభయామనంగా మారాయి.

విద్యుద్దీపాలతో దేవాలయం

నేటి నుంచి ఉత్సవాలు..

సోమవారం మాఘ శుద్ధ విదియ రోజు సాయంత్రం 6 గంటలకు అధ్యయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ఆరంభంకానున్నాయి. ఇవి మూడు రోజులపాటు ఉంటాయి. ఈ నెల 26 నుంచి బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టం ఆరంభంకానుంది. 27న ఉదయం 8 గంటలకు అంకరార్పణ, 28న ఉదయం యాగశాల ప్రవేశం, 29న తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండితులు వేదవాచాస్పతి గుళ్లపల్లి కృష్ణమూర్తి ఘనాపాఠిచే ప్రత్యేక పూజలు, 30న స్వామి వారి కల్యాణోత్సవం, 31న హనుమత్‌ వాహన సేవ, ఫిబ్రవరి ఒకటిన మహాపూర్ణాహుతి, 2న స్వామి వారి శోభాయాత్ర నిర్వహించనున్నారు.

నగరంలో వెలిసిన స్వాగత తోరణాలు

కరపత్రాల ఆవిష్కరణ

శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రాలను మంత్రి గంగుల కమలాకర్‌ ఆదివారం ఆయన స్వగృహంలో దేవాదాయ శాఖ, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. గతంలో బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని, ఆరో వార్షిక ఉత్సవాలకు కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. ఈవో ఉడుతల వెంకన్న ఆలయ ఛైర్మన్‌ చకిలం గంగాధర్‌, చకిలం శ్రీనివాస్‌, ఉత్సవ కమిటీ సభ్యులు గంప రమేష్‌, కార్పొరేటర్‌ రాజేందర్‌రావు, నందెల్లి మహిపాల్‌, నేతి రవివర్మ, సర్పంచి ఉప్పుల శ్రీధర్‌లు పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్‌ ఒంటెల సత్యనారాయణరెడ్డి ఇంటింటా కరపత్రాలను పంచిపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని