logo

కొండంత ఉత్సాహం!

జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్‌కల్యాణ్‌ పర్యటన అభిమానుల్లో, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. కొండగట్టు, ధర్మపురి ఆలయాల్లో పూజలు.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ జనసేనాని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పర్యటన సాగింది..

Published : 25 Jan 2023 04:32 IST

అంజన్న, నారసింహుడి సన్నిధిలో పవన్‌ కల్యాణ్‌ పూజలు
ఘన స్వాగతం పలికిన అభిమానులు, నేతలు

ఈనాడు, కరీంనగర్‌, న్యూస్‌టుడే- మల్యాల, కొడిమ్యాల, ధర్మపురి ; జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్‌కల్యాణ్‌ పర్యటన అభిమానుల్లో, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. కొండగట్టు, ధర్మపురి ఆలయాల్లో పూజలు.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ జనసేనాని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పర్యటన సాగింది.. ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ఆయనకు అభిమానులు ఘన స్వాగతం  పలికారు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున మల్యాల మండలం అంజన్న క్షేత్రానికి ఉదయమే చేరుకుని తమ అభిమాన నేత కోసం వేచి చూశారు.. ఉదయం 11 గంటల సమయంలో తన వాహన శ్రేణితో జగిత్యాల జిల్లాలో అడుగిడిన  పవన్‌కల్యాణ్‌ రాత్రి 7 గంటల తరవాత తిరుగు పయనమయ్యారు. మొదట కొండగట్టుకు చేరుకున్న ఆయన ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయానికి వెళ్లే ముందు.. అంజన్న దర్శనం తరవాత కారులో నుంచే అభిమానులకు అభివాదం చేశారు. వారాహి వాహనానికి పూజల తరవాత అదే వాహనంపైకి ఎక్కి ప్రసంగించారు. తెలంగాణ నేల తల్లికి పాదాభివందనమనే మాటలతో ప్రారంభించి.. జై తెలంగాణ, జైహింద్‌’ అంటూ ప్రసంగాన్ని ముగించారు. తరువాత కొడిమ్యాల మండలం నాచుపల్లి శివారులోని రిసార్ట్స్‌కు చేరుకుని పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు. సుమారు ముప్పావు గంటకుపైగా సాగిన సమావేశంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. సిద్ధంగా ఉండాలని శ్రేణులకు సూచించారు. అనంతరం ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను నేరెళ్ల శ్రీనివాసాచార్యులు వివరించారు. ఈవో శ్రీనివాస్‌, ఆలయ కమిటీ సభ్యుడు రామయ్య పలువురు ధర్మకర్తలు స్వామి ప్రసాదాన్ని శేషవస్త్రాన్ని పవన్‌కల్యాణ్‌కు అందించారు. స్వామిని దర్శించుకుని హైద్రాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.

ధర్మపురి ఆలయంలో పూజలు

పోలీసుల తీరుపై ఆగ్రహం

పవన్‌ కల్యాణ్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై భక్తులు, పవన్‌కల్యాణ్‌ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ ఆంక్షల్ని విధించడంతోపాటు పార్టీ ముఖ్యులను కూడా ఆలయం చెంతన నిలబడకుండా బయటకు పంపించారని ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యంగా గర్భగుడిలో ఉన్న వారందరినీ పోలీసులు బలవంతంగా బయటకి పంపించేశారని, ఈ సందర్భంగా డీఎస్పీ ప్రకాశ్‌, ఒకరిద్దరు సీఐలు దురుసుగా ప్రవర్తించారని జనసేన నాయకులు తెలిపారు. మరోవైపు మీడియాను కూడా లోపల ఉంచకుండా బయటకు పంపించడంతో డీఎస్పీతో పలువురు వాదనకు దిగారు. నాచుపల్లి రిస్టార్ట్స్‌ వద్ద లోపలికి అనుమతించలేదని నిరసన తెలిపిన హుస్నాబాద్‌కు చెందిన జనసేన నాయకుడితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొడిమ్యాల ఠాణాకు తీసుకెళ్లారు. కొండగట్టు ఆలయ ఈవో వెంకటేశ్‌ను ఓ ఎస్సై వెనక్కి నెట్టేయడంతో తోటి ఆలయ సిబ్బంది ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

విశేషాలు..

సీఎం.. సీఎం నినాదాలతో యువత తమ అభిమానాన్ని చాటారు.

వారాహి వాహనం వద్ద అభిమానులతోపాటు పోలీసులు ఫొటోలు దిగారు.

కొండగట్టు వద్ద తమ నేతను చూసేందుకు పలువురు అభిమానులు గుట్టలు, భవనాలపైకి ఎక్కారు.

వాహనశ్రేణి వెంబడి కార్యకర్తలు, అభిమానులు దారిపొడుగునా పరుగెత్తడం కనిపించింది.

పవన్‌కల్యాణ్‌ వచ్చిన సమయంలో కొండగట్టులో భక్తుల దర్శనాన్ని గంటన్నరపాటు నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని