logo

ఓటు.. ఓ బాధ్యత

ఓటు హక్కు నమోదు, పోలింగ్‌ కేంద్రాల్లో వసతులు తదితర అంశాలపై ప్రజలకు  సులభంగా సమాచారం అందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వివిధ సంస్కరణలు అమలు చేస్తోంది.

Published : 25 Jan 2023 04:32 IST

సాంకేతిక పరిజ్ఞానంతో నమోదు ప్రక్రియ సులభతరం
పోలింగ్‌ శాతం పెరిగితేనే ఎన్నికల సంఘం కృషికి సార్థకత
నేడు జాతీయ ఓటరు దినోత్సవం
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌, జగిత్యాల ధరూర్‌క్యాంపు

ఓటు హక్కు నమోదు, పోలింగ్‌ కేంద్రాల్లో వసతులు తదితర అంశాలపై ప్రజలకు  సులభంగా సమాచారం అందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వివిధ సంస్కరణలు అమలు చేస్తోంది. అయినా దేశంలో ప్రతి ఎన్నికల్లో 30 నుంచి 40 శాతం వరకు తక్కువ ఓట్లు పోలవడం ఆందోళన కలిగిస్తోంది.
అభివృద్ధిలో మన కన్నా దిగువన ఉన్న దేశాల్లో ఓటుహక్కు వినియోగం ఎక్కువగా ఉన్నా ఇక్కడి ఓటర్లు హక్కు వినియోగంలో తడబడుతున్నారు. సుపరిపాలన కావాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. బుధవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఓటుహక్కు వినియోగం తీరు, తదితర అంశాలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

నమోదులోనూ అతివలే అధికం

ఉమ్మడి జిల్లాలోని 12 శాసనసభ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. మొత్తం 27,45,818 మందికి గాను 13,53,748 మంది పురుషులు, 13,91,971 మంది మహిళలు, 99 మంది ఇతరులున్నారు. రామగుండం, కరీంనగర్‌ మినహా అన్ని నియోజకవర్గాల్లో అతివల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలోని 27 లక్షల ఓటర్లలో 39 ఏళ్లలోపు వారి సంఖ్య 10 లక్షలకు పైగా ఉంది.

ప్రలోభాలతో ప్రమాదం

ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఎన్నికల్లో మద్యం, డబ్బు ఏరులై పారుతున్నాయి. ఇటీవలి కాలంలో ఒక్క ఓటుకు రూ.6 వేల వరకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రలోభాలకు ఆశ పడకుండా, అభివృద్ధి కాంక్షించే వారికి పట్టం కట్టాలనే బాధ్యత పౌరుల్లో పెరిగితేనే ప్రభుత్వ కృషికి సార్థకత లభిస్తుంది.

తెరపైకి రిమోట్‌ ఓటింగ్‌ విధానం

విద్యాభ్యాసం, ఉద్యోగం, వివాహం, ఉపాధి కోసం ఊరు విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రిమోట్‌ ఓటింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. ఈ విధానంతో సొంతూళ్లకు రాకుండానే దేశంలో ఎక్కడి నుంచైనా ఓటు వేయవచ్చు. ముందుగా దరఖాస్తు చేసుకుంటే ‘మల్టీ కాన్‌స్టిట్యుయెన్సీ రిమోట్‌ ఓటింగ్‌’ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దీంతో పని చేసే చోట నుంచే స్వస్థలాలకు సంబంధించి ఎన్నికల్లో పాల్గొనే వీలుంటుంది.


నిర్లిప్తత వీడాలి

ప్రతి ఎన్నికల్లోనూ పల్లెల్లోనే ఓటరు చైతన్యం కనిపిస్తోంది. అక్షరాస్యులు అధికంగా ఉండే పట్టణాల్లోనే తక్కువ పోలింగ్‌ నమోదవుతోంది.

2018 శాసనసభ ఎన్నికల్లో మానకొండూర్‌లో 85.2, మంథనిలో 84.15, హుజూరాబాద్‌లో 83.2 శాతం పోలింగ్‌ నమోదైతే, పట్టణ ప్రాంతాలైన కరీంనగర్‌లో 68.0, రామగుండంలో 71.4 శాతం నమోదైంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్‌లో 59.89, రామగుండంలో 56.13 శాతం మంది ఓట్లేశారు.

కరీంనగర్‌ నియోజకవర్గంలోని బొమ్మకల్‌లో అత్యల్పంగా 24.80, రామగుండంలోని అల్లూర్‌ పోలింగ్‌ కేంద్రంలో 27.48 శాతం నమోదైంది.


సాంకేతిక దన్ను

18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవడానికి మీసేవ, ఇంటర్నెట్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే చరవాణి ద్వారా అంతర్జాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌లో కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎల్‌వోలకు పని భారం తగ్గించి, సేవలు సులభతరం చేసేందుకు ‘గరుడ యాప్‌’ ఉపయుక్తంగా ఉంది. పాస్‌పోర్టు ఆధార పత్రాలతో ప్రవాస భారతీయులు కూడా స్థానికంగానే ఓటు హక్కు పొందుతున్నారు. కొత్త ఓటర్లకు ఆకర్షణీయ రంగులో ఉన్న గుర్తింపు కార్డును ఇంటి వద్దకే పంపిస్తున్నారు.


అవగాహన ఎంత..!

ఓటరు అవగాహన సర్వేలో పాల్గొన్న డిగ్రీ విద్యార్థులు

జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణంలోని డిగ్రీ కళాశాల విద్యార్థులతో ‘న్యూస్‌టుడే’ మాట్లాడింది. ఓటు హక్కు నమోదు, అవగాహన, ఓటు వినియోగం అంశాలపై వారి అభిప్రాయాలు సేకరించింది. సర్వేలో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని