logo

ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను

ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులకు సైతం వాటి హద్దులు ఎక్కడి వరకు ఉన్నాయన్నది తెలియడం లేదు.

Published : 25 Jan 2023 04:32 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని

ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులకు సైతం వాటి హద్దులు ఎక్కడి వరకు ఉన్నాయన్నది తెలియడం లేదు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న ఆక్రమణదారులు అందులో పాగా వేసి రియల్‌ దందాకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెవెన్యూ లొసుగులను కొందరు తమకు అనుకూలంగా మలచుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సెంటుభూమి సైతం దొరకని పరిస్థితి.

రహదారినీ వదిలిపెట్టని అక్రమార్కులు

రహదారి విస్తరణ కోసం సింగరేణి సేకరించిన భూమిని సైతం అక్రమార్కులు కబ్జా చేశారు. మేడిపల్లి ఓసీపీ ఏర్పాటు సమయంలో రామగుండం వెళ్లేందుకు రహదారి నిర్మాణం కోసం సింగరేణి సంస్థ 13.12 ఎకరాల భూమిని సేకరించింది. మేడిపల్లి నుంచి రామగుండం వరకు 100 అడుగుల రహదారి నిర్మాణం కోసం తీసుకుంది. దానిని సైతం కబ్జా చేయడంతో ప్రస్తుతం ఆ రహదారి 60 అడుగులకే పరిమితమైంది.

ప్రజోపయోగానికి కరవు

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు ప్రజోపయోగానికి గుర్తించలేకపోతున్నారు. అందుబాటులో ఉన్నా వాటిని గుర్తించకపోవడంతో ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోలేని దుస్థితి నెలకొంటోంది. నాలుగేళ్ల క్రితం మంజూరైన ఈఎస్‌ఐ ఆస్పత్రికి స్థలం చూపించకపోవడంతో నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరైనా కేవలం స్థలం లేకపోవడంతో నిర్మాణానికి నోచుకోవడం లేదు.

రియల్‌ దందాలో ఇందిరమ్మ స్థలాలు

ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో సేకరించిన భూమిలో కొంత మంది ఆక్రమించుకొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తున్నారు. ఎన్టీపీసీ జ్యోతినగర్‌ అన్నపూర్ణకాలనీ సమీపంలోని న్యూపీకేరామయ్య కాలనీ వద్ద నిరుపేదల ఇళ్ల కోసం ప్రభుత్వం 100 ఎకరాలు సేకరించింది. అందులో 85 ఎకరాలను ఇందిరమ్మ ఇళ్ల కోసం పేదలకు పంపిణీ చేసింది. ఇంకా 15 ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. దీనిని కబ్జాచేసి రియల్‌ దందా సాగించేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారు. 2008లో సేకరించిన 100 ఎకరాల భూమికి పరిహారం సైతం చెల్లించింది. ఒక సర్వే నెంబరులో 7.36 ఎకరాల భూమి రికార్డులో తప్పుగా నమోదైంది. ఒక సర్వే నెంబరుకు బదులు మరో సర్వే నెంబరులో చూపిస్తుండటంతో దీనిని ఆసరాగా చేసుకున్న కొంత మంది ఖాళీగా ఉన్న భూమిలో రియల్‌దందా మొదలు పెట్టారు. దీనిని 2009లోనే గుర్తించి సవరించాలని ఉన్నతాధికారులకు లేఖలు రాసినా ఇప్పటి వరకూ ఎలాంటి మార్పు చేయలేదు.

హద్దులు లేకపోవడంతో..

ఎన్టీపీసీ సమీపంలోని జంగాలపల్లి శివారులో ఇందిరా ఆవాస్‌ యోజన పథకానికి 2008లోనే ప్రభుత్వం 24.27 ఎకరాల భూమిని సేకరించింది. మరో 6 ఎకరాల ప్రభుత్వ భూమిని కలుపుకుని 30.27 ఎకరాల భూమిని ఇందిరా ఆవాస్‌ యోజన పథకానికి కేటాయించింది. ఒక్కో ఎకరానికి రూ.5 లక్షల పరిహారం చెల్లించింది. ఈ భూమిని పేదలకు కేటాయించకపోవడంతో ఖాళీగా ఉంది. ఇటీవలె అందులోంచి 10 ఎకరాల భూమిని ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి కేటాయించింది. ప్రస్తుతం మరో 20ఎకరాలు ఖాళీగా ఉంది. దీనికి ఎలాంటి హద్దులు లేకపోవడంతో ఆక్రమించుకోవడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయి.


మా దృష్టికి వస్తే చర్యలు

లక్ష్మీనారాయణ, జిల్లా అదనపు పాలనాధికారి

ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న విషయం మాదృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేస్తాం. ఇందిరమ్మ స్థలాల్లో ఆక్రమణకు పాల్పడే వారిపై విచారణ చేస్తాం. సర్వే నెంబర్ల ప్రకారం పరిశీలించి కబ్జాకు గురి కాకుండా చర్యలు తీసుకుంటాం.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని