logo

రూ.వంద కోట్లపైనే కొండంత ఆశలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతేడాది డిసెంబరు 7న జరిగిన జగిత్యాల బహిరంగ సభలో ప్రకటించారు.

Published : 26 Jan 2023 05:06 IST

న్యూస్‌టుడే, మల్యాల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతేడాది డిసెంబరు 7న జరిగిన జగిత్యాల బహిరంగ సభలో ప్రకటించారు. వచ్చేనెల 3 నుంచి జరగనున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో నిధులు కేటాయించి మాస్టర్‌ప్లాను రూపొందించి యాదాద్రి తరహాలో ఆలయాన్ని తీర్చితిద్దితే దాదాపు కొండగట్టు క్షేత్రం రూపురేఖలు మారిపోతాయి. అభివృద్ధి పనులు చేపట్టడానికి ముందు కొండపైన బృహత్‌ప్రణాళిక(మాస్టర్‌ప్లాను)ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఇప్పటి వరకు బృహత్‌ ప్రణాళికను తయారు చేయలేదు. కొండగట్టులో మాస్టర్‌ప్లాను అమలు చేయాలని దాదాపు 20 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు రూపొందించినా అమలుకు నోచుకోలేదు. దీంతో ఆలయ పరిధిలో సరైన ప్రణాళిక లేకుండా ఏటా రూ.కోట్లాది నిధులతో నిర్మాణాలు చేపట్టడంవల్ల మున్ముందు బృహత్‌ప్రణాళిక అమలు చేస్తే వాటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి బృహత్‌ ప్రణాళికను అమలు పరిస్తే కొండగట్టు పర్యాటక కేంద్రంగా కూడా మారుతుంది.


అభివృద్ధి పనుల్లో జాప్యం

కొండపైకి పురాతన మెట్లదారిని, ఘాట్‌రోడ్డు పునర్మిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. అంజన్న ఆలయానికి 43 ఎకరాల విలువైన భూములుండగా అందులో కొండపైనే దాదాపు 23 ఎకరాల స్థలం ఉంది. దీనికి తోడు కొండగట్టు గుట్టలకు ఆనుకుని ఉన్న రెవెన్యూ ఆధీనంలోని 333 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఉన్నతాధికారులు ఆలయానికి స్వాధీనం చేశారు. కొండపైన భక్తులు వాహనాలను నిలుపడానికి సరైన పార్కింగ్‌లేక అసౌకర్యానికి గురవుతున్నారు. ఆలయ పరిసరాల్లో దాదాపు 40 గదులు మాత్రమే భక్తులకు అద్దెకివ్వడానికి అందుబాటులో ఉన్నాయి. దీంతో రాత్రివేళల్లో వచ్చే భక్తులు బస చేయడానికి గదులు లభించక నానా ఇక్కట్లు పడుతుంటారు. హనుమాన్‌ జయంతి ఉత్సవాల సమయంలో ఒక్క గది కూడా భక్తులకు అద్దెకివ్వడానికి అవకాశమే ఉండదు. కనీసం 200 గదులు నిర్మిస్తే ఆలయ పరిధిలో బస చేయడానికి వసతి మెరుగు పడుతుందని భక్తులు పేర్కొంటున్నారు. ఆలయం పక్కన క్యూలైనుకు ఆనుకుని ఇటీవల రూ.32 లక్షలతో షెడ్డు నిర్మించడంతో పరిసరాలు ఇరుకుగా మారాయి. ఆలయానికి ఉత్తర ద్వారం వైపు ఎమ్మెల్సీ కవిత, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భూమిపూజ చేసిన ప్రాంతంలో రూ.90 లక్షలతో రామకోటి స్తూపం నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడంలేదు. ఐదేళ్ల క్రితం రూ.5 కోట్లతో మంత్రులు శంకుస్థాపన చేసిన మెట్లదారి పనులు చేపట్టకపోగా, దీక్షాపరుల కోసం మాలవిరమణ మండప నిర్మాణం నేటికీ పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయింది. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.100 కోట్లు త్వరితగతిన మంజూరు చేసి బృహత్‌ ప్రణాళికతో కొండపైన అభివృద్ధి పనులు చేపడితే అంజన్న ఆలయం సరికొత్త శోభను సంతరించుకోనుంది.


గతంలో రూపొందించిన బృహత్తర ప్రణాళిక నమూనా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని