logo

అనిశా కేసులో విశ్రాంత వీఆర్వోకు జైలు

విధి నిర్వహణలో లంచం తీసుకుంటూ పట్టుబడిన విశ్రాంత వీఆర్వోకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.12 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పి.లక్ష్మీకుమారి తీర్పు చెప్పారు.

Updated : 01 Feb 2023 05:22 IST

చైతన్యపురి, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో లంచం తీసుకుంటూ పట్టుబడిన విశ్రాంత వీఆర్వోకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.12 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పి.లక్ష్మీకుమారి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామానికి చెందిన వేల్పుల వెంకన్న మూడేళ్ల కిందట తండ్రి ద్వారా తనకు సంక్రమించిన ఆస్తిని విరాసత్‌ చేయాలని తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన జమాబంది నిమిత్తం బావుపేట గ్రామానికి చెందిన వీఆర్వో పాంరాజ్‌ మధుసూదన్‌రావును కలవాలని సూచించారు. పట్టాదార్‌ పాస్‌బుక్‌ ఇచ్చిన వీఆర్వోను టైటిల్‌ డీడ్‌లు ఇవ్వమని అడగగా రూ.2500 లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో వెంకన్న అనిశా అధికారులకు 2010 అక్టోబరు 9న ఫిర్యాదు చేశారు. నవంబరు 1న ఎమ్మార్వో కార్యాలయంలో వెంకన్న నుంచి వీఆర్వో రూ.1500 లంచం తీసుకుంటుండగా ఏసీపీ డీఎస్పీ జైపాల్‌ సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు. కేసు దర్యాప్తు జరిపి సీఐ వీవీ రమణమూర్తి కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బి.కిషోర్‌ వాదించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి పి.లక్ష్మీకుమారి మంగళవారం మధుసూదన్‌రావుకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.12 వేల జరిమానా విధించారు. మధుసూదన్‌రావు ప్రస్తుతం ఉద్యోగ విరమణ పొంది ఉన్నాడు. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న వెంకన్న కోర్టుకు హాజరై నిందితుడికి అనుకూలంగా సాక్ష్యం ఇవ్వడంతో ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని అతనికి ఏసీబీ కోర్టు నోటీసు జారీ చేసింది.


పోలీసుల అదుపులో మరో ఇద్దరు నిందితులు?
తల్వార్‌లతో ప్రదర్శన చేసిన వారిపై కేసు

గోదావరిఖని, న్యూస్‌టుడే: సంచలనం సృష్టించిన రౌడిషీటర్‌ మంథని సుమన్‌ హత్య కేసు విచారణ వేగంగా సాగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి విచారణలో వేగం పెంచారు. గోదావరిఖని పట్టణంలోని నడిబొడ్డున అందరూ చూస్తుండగా కత్తులు, తల్వార్‌లతో నరికి దారుణంగా హత్య చేసిన సంఘటనను పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన పెద్దపల్లి డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ స్వయంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ప్రధాన హంతకుడిగా భావిస్తున్న వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. సుమన్‌ అంతిమయాత్రలో తల్వార్‌లతో ప్రదర్శన చేసిన ఇద్దరిపై గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. తల్వార్‌లతో ప్రదర్శన చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన రౌడీషీటర్లు ఎండీ జాకీర్‌(29), మారంగుల రమేశ్‌(34)లపై కేసు నమోదు చేశారు. రమేశ్‌ను రిమాండ్‌కు తరలించగా, జాకీర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని