logo

ఉత్తర తెలంగాణపై వివక్ష

ఉత్తర తెలంగాణపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని శాసన మండలి సభ్యుడు టి.జీవన్‌రెడ్డి అన్నారు.

Published : 01 Feb 2023 04:53 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి

జగిత్యాల, న్యూస్‌టుడే: ఉత్తర తెలంగాణపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని శాసన మండలి సభ్యుడు టి.జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్తు అదనపు వినియోగ ఛార్జీల వసూలు వ్యతిరేకిస్తూ వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జంబిగద్దె నుంచి కొత్త బస్టాండ్‌ మీదుగా విద్యుత్తు ఎస్‌ఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి 3 గంటల పాటు ధర్నా, ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థత కప్పిపుచ్చుకునేందుకు రూ. 20 వేల కోట్ల నష్టాన్ని పూడ్చుకునేందుకు వినియోగదారులపై భారం మోపుతున్నారన్నారు. డిపాజిట్‌ చెల్లించిన మీదటే విద్యుత్తు కనెక్షన్‌ ఇస్తారని ఇప్పటికే అదనపు లోడ్‌ అభివృద్ధి ఛార్జీలు వసూలు చేసి ప్రస్తుతం ఏసీడీ పేరిట ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. గతంలో 300 యూనిట్లు దాటితే అదనపు ఛార్జీలు వసూలు చేసేవారని ప్రస్తుతం ప్రతి వినియోగదారుడిపై భారం మోపడంతో పేదలు ఇబ్బంది పడుతున్నారని దుయ్యబట్టారు. విధానపరమైన లోపాలతో విద్యుత్తు సంస్థలు నష్టాల ఊబిలో కూరుకపోతున్నాయన్నారు. పునః విభజన చట్టంలో 4 వేల మెగావాట్ల విద్యుత్తు వినియోగించుకునే అవకాశమున్నా ప్రైవేటు సంస్థల నుంచి 40 శాతం విద్యుత్తు కొనుగోలు చేస్తూ కమిషన్లకు కక్కుర్తి పడి యాదాద్రిలో విద్యుత్తు ప్లాటు ఏర్పాటు చేసి ప్రజలపై రూ.40 వేల కోట్ల భారం మోపారన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ ఛైర్మన్‌, డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పురపాలక మాజీ ఛైర్మన్‌, పీసీసీ సభ్యుడు గిరినాగభూషణం, పీసీసీ కార్యదర్శి బండ శంకర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్‌, పురపాలక మాజీ ఛైర్‌పర్సన్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు టి.విజయలక్ష్మి, బీర్‌పూర్‌ ఎంపీపీ మసర్తి రమేష్‌, పురపాలక ఫ్లోర్‌ లీడర్‌ కల్లెపల్లి దుర్గయ్య, జిల్లా మైనార్టీ విభాగ అధ్యక్షుడు మన్సూర్‌, గొల్లపల్లి మండల కేంద్ర సర్పంచి ముస్కు నిశాంత్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు కాటిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ విభాగ రాష్ట్ర కన్వీనర్‌ చాంద్‌పాషా, జిల్లా, పట్టణ యువజన విభాగ అధ్యక్షులు గుండా మధు, బీరం రాజేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని