logo

సర్వాంగ సుందరం!

ఈ ఫొటోలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది మేడిపల్లి మండలం తొంబర్రావుపేటలోని ప్రాథమిక పాఠశాల. మరో చిత్రంలో గతంలో పాఠశాల స్వరూపాన్ని చూడవచ్చు.

Updated : 01 Feb 2023 05:22 IST

నేటి నుంచి ‘మన ఊరు- మన బడి’ పాఠశాలలు ప్రారంభం
న్యూస్‌టుడే, మెట్‌పల్లి, మేడిపల్లి

ఈ ఫొటోలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది మేడిపల్లి మండలం తొంబర్రావుపేటలోని ప్రాథమిక పాఠశాల. మరో చిత్రంలో గతంలో పాఠశాల స్వరూపాన్ని చూడవచ్చు. ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం కింద పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేయడంతో పాఠశాలల స్వరూపాలే మారిపోతున్నాయి. జిల్లాలో తొలి విడత 274 పాఠశాలలను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేయగా ఫిబ్రవరిలో జిల్లాలో 19 పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన పాఠశాలల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయించి మలిదశ కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు.


‘మన ఊరు-మన బడి’ కింద పాఠశాలల స్వరూపాలే మారిపోనున్నాయి. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చి దిద్దాలన్న సంకల్పం ఈ కార్యక్రమం ద్వారా నెరవేరనుంది. గత ఏడాదే పాఠశాలల పనులు ప్రారంభమైనా వివిధ కారణాలతో కాస్తంత ఆలస్యమైనా నిర్మాణాలు ఈనాటికి పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ‘మన ఊరు- మన బడి’ కింద పాఠశాలలు ప్రారంభించాలంటూ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గాల వారీగా ప్రారంభానికి సిద్ధమైన పాఠశాలలను అందుబాటులోని మంత్రులు, శాసనసభ్యులు, కలెక్టర్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 274 పాఠశాలలు తొలివిడతగా ఎంపిక చేశారు. అంచనా వ్యయాన్ని బట్టి పాఠశాలలను 3 కేటగిరీలుగా వర్గీకరించారు. కాగా జిల్లాలో ప్రస్తుతానికి 19 పాఠశాలలు ప్రారంభానికి సిద్ధమైనట్లు అధికారులు నివేదించారు. ‘మన ఊరు మన బడి కింద నిర్దేశించిన 12 పనులతో పాటు, మైదానం అభివృద్ధి, పచ్చదనం పెంపు, లాన్‌, గార్డెనింగ్‌ పనులు చేపట్టారు. పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా పాఠశాలలను ప్రారంభించనున్నారు. సర్పంచుల పర్యవేక్షణలో కొన్ని పనులు పూర్తి చేయించారు. గ్రీన్‌బోర్డ్‌, డ్యూయల్‌ డెస్క్‌, ప్రధానోపాధ్యాయుల కుర్చీ, టేబుల్‌, ఉపాధ్యాయుల కుర్చీలు, టేబుల్స్‌ హైదరాబాద్‌ నుంచి తెప్పించేలా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో నిర్ణయించారు. పాఠశాలల్లో రంగులు కూడా హైదరాబాద్‌లోని ఓ సంస్థ ఆధ్వర్యంలో వేయించారు. ప్రస్తుతానికి కాస్తంత ఫర్నీచర్‌ మినహా సామగ్రి పాఠశాలలకు చేరింది. ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ఫర్నీచర్‌ పాఠశాలలకు చేరనుందని అధికారులు పేర్కొన్నారు.

ప్రారంభించనున్న పాఠశాలలు ఇవే..

జగిత్యాల: ఎంపీపీఎస్‌ ధరూరు (బీజే కాలనీ), ఎంపీపీఎస్‌ సంగంపల్లి, ప్రభుత్వ పీఎస్‌ ఫోర్టు ఉర్దూమీడియం, ఎంపీపీఎస్‌ చలిగల్‌ తె.మీ.
మెట్పల్లి: ఎంపీపీఎస్‌ శివాజీనగర్‌
కోరుట్ల: జడ్పీహెచ్‌ఎస్‌ ఎకిన్‌పూర్‌, జడ్పీహెచ్‌ఎస్‌ మాదాపూర్‌
మేడిపల్లి: ఎంపీపీఎస్‌ తొంబర్‌రావుపేట, ఎంపీపీఎస్‌ కల్వకోట
గొల్లపల్లి: ఎంపీపీఎస్‌ చెందోలి, ఎంపీపీఎస్‌ రాఘవపట్నం
మల్యాల: ఎంపీపీఎస్‌ రామన్నపేట, జడ్పీహెచ్‌ఎస్‌ రామన్నపేట
రాయికల్‌: జడ్పీహెచ్‌ఎస్‌ రాయికల్‌, ఎంపీపీఎస్‌ కుమ్మర్‌పల్లి
సారంగాపూర్‌: ఎంపీపీఎస్‌ పెంబట్ల, ఎంపీపీఎస్‌(ఎస్‌) పెంబట్ల
వెల్గటూర్‌: ఎంపీపీఎస్‌ బీసీ కాలని గొడిశెలపేట, ఎంపీపీఎస్‌ కొత్తపేట

దశలవారీగా అన్ని పాఠశాలలు: జగన్‌మోహన్‌రెడ్డి, డీఈవో

జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ పథకం కింద ఎంపిక చేసిన అన్ని పాఠశాలలను దశలవారీగా సుందరంగా తీర్చిదిద్దుతాం. ప్రస్తుతానికి 19 నమూనా పాఠశాలల పనులు పూర్తయ్యాయి. ఫర్నీచర్‌ రావాల్సి ఉంది. ఫిబ్రవరి 1న వాటిని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లాలోని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో ముందుకు వెళ్తాం. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని