logo

పాఠశాల వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఆర్టీసీ అద్దె బస్సు ఓ ప్రైవేటు పాఠశాల బస్సును వెనక నుంచి ఢీకొట్టగా 20 మంది విద్యార్థులు, పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

Updated : 01 Feb 2023 19:15 IST

20 మంది విద్యార్థులు, 10 మంది ప్రయాణికులకు గాయాలు

సంఘటన స్థలంలో విలపిస్తున్న విద్యార్థులు

ఎల్లారెడ్డిపేట, న్యూస్‌టుడే: ఆర్టీసీ అద్దె బస్సు ఓ ప్రైవేటు పాఠశాల బస్సును వెనక నుంచి ఢీకొట్టగా 20 మంది విద్యార్థులు, పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రంలోని ఓ పాఠశాలకు చెందిన బస్సులో రాజన్నపేట, అల్మాస్‌పూర్‌ గ్రామాల్లోని విద్యార్థులను తీసుకెళ్తుతున్నారు. యూటర్న్‌ చేసేందుకు డ్రైవర్‌ ప్రయత్నిస్తుండగా కామారెడ్డి నుంచి సిరిసిల్లకు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు వెనక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. పాఠశాల బస్సులో 33 మంది ఉండగా, 20 మంది విద్యార్థులు, క్లీనర్‌ గాయపడ్డారు. వీరిలో శ్రీనివాస్‌రెడ్డి, కార్తీక్‌, శ్రీధర్‌, జాయ్‌, శివారెడ్డి, మణిసంజన్‌రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 10 మంది గాయపడగా వీరిలో సిరిసిల్లకు చెందిన సిరిమల్ల రజిత, ఆమె కుమారుడు వినయ్‌, రాచర్ల గొల్లపల్లికి చెందిన స్టాఫ్‌నర్సు అందె జ్యోతి, గంభీరావుపేట మండలం లింగాపూర్‌ మాజీ సర్పంచి సరస్వతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రులను వెంటనే స్థానికులు 108 వాహనంలో మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మరో రెండు నిమిషాల్లో పాఠశాలకు చేరుకుంటుందనగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు విలపిస్తూ ఆందోళనతో ఆసుపత్రికి పరుగు తీశారు. విద్యార్థుల హాహాకారాలు, ఆర్తనాదాలతో దవాఖానా మార్మోగింది. కాగా ఈ సంఘటనలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ షేక్‌ నయీమొద్దీన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్‌ తెలిపారు. ఆర్టీసీ బస్సును అజాగ్రత్తగా, అతివేగంగా నడపి, పాఠశాల బస్సును ఢీకొట్టడం వల్ల పలువురు విద్యార్థులతోపాటు క్లీనర్‌ బత్తుల పవన్‌ గాయపడ్డారని పేర్కొన్నారు. పాఠశాల బస్సు డ్రైవర్‌ వడ్నాల కిషన్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మంత్రి కేటీఆర్‌ ఆరా

ఈ ప్రమాదంపై మంత్రి కేటీఆర్‌ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంటనే డీఈఓ రాధాకిషన్‌, ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్‌ సత్యనారాయణస్వామిలతో చరవాణిలో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆర్టీసీ కామారెడ్డి డిపో మేనేజర్‌ మల్లేశం, పలువురు ప్రజాప్రతినిధులు ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని