logo

నిరుద్యోగ యువతకు టాస్క్‌ చేయూత

డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, ఇతర ఉన్నత కోర్సులు అభ్యసించిన తర్వాత ప్రతి ఒక్కరి లక్ష్యం కొలువు. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ అవకాశం ఉండకపోవడంలో చాలామంది ప్రైవేటు ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్‌ రంగాల వైపు దృష్టి సారిస్తున్నారు.

Published : 01 Feb 2023 04:53 IST

నైపుణ్యాల పెంపునకు ప్రత్యేక శిక్షణ

శిక్షణ పొందుతున్న అభ్యర్థులు

న్యూస్‌టుడే, తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌): డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, ఇతర ఉన్నత కోర్సులు అభ్యసించిన తర్వాత ప్రతి ఒక్కరి లక్ష్యం కొలువు. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ అవకాశం ఉండకపోవడంలో చాలామంది ప్రైవేటు ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్‌ రంగాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ కొలువు రావాలన్నా నైపుణ్యం, విషయ పరిజ్ఞానం, సృజనాత్మకత, ఆంగ్లభాషపై పట్టు అవసరం. ఉమ్మడి జిల్లా నుంచి ఏటా వేల సంఖ్యలో ఇంజినీరింగ్‌, డిగ్రీ పట్టాలు తీసుకుంటున్నారు. ఉద్యోగ సాధనలో సరైన నైపుణ్యాలు లేక వెనుకబడుతున్నారు. అలాంటి వారికి టాస్క్‌ (తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ నాలెడ్జ్‌) చేయూతనిస్తోంది. కరీంనగర్‌లోని ప్రాంతీయ శిక్షణ కేంద్రం (ఐటీటవర్‌)లో సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్‌ రంగాల్లో ఉచిత శిక్షణ అండగా ఉంటుంది.

రంగాల వారీగా బ్యాచ్‌లు..

డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ చదివిన వారు సాఫ్ట్‌వేర్‌ రంగం వైపు అడుగులు వేయాలనుకునే వారికి కరీంనగర్‌లోని ఉజ్వల పార్క్‌ సమీపంలో ఐటీ టవర్‌లో టాస్క్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. అభ్యర్థులు ఎంచుకున్న రంగాల వారీగా జాబితా తయారు చేస్తారు. తర్వాత బ్యాచ్‌ల వారీగా అభ్యర్థుల చరవాణికి సందేశం వస్తుంది. టాస్క్‌ పలు కార్పొరేట్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. దరఖాస్తు, శిక్షణ, కంపెనీల్లో ఉన్న ఉద్యోగావకాశాలు ఎలాంటి అర్హతలు కావాలో పూర్తి వివరాలు కూడా సంబంధిత వెబ్‌సైట్లో లభిస్తాయి. ప్రస్తుతం కళాశాలల్లో చదువుతున్న వారికి ఇందులో అవకాశం ఉండదు. టాస్క్‌ ఆధ్వర్యంలో ఆయా కళాశాలల వారీగా విద్యార్థుల పేర్లు నమోదు చేసుకుంటే అక్కడే శిక్షణ ఇస్తారు. బీటెక్‌ విద్యార్థుల ప్రాజెక్టు సంబంధించి సాయంత్రం వేళల్లో సలహాలు ఇస్తున్నారు. ఇది సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది.

ప్రత్యేకతలు..

కరీంనగర్‌ ఐటీ టవర్‌లో ఏర్పాటు చేసిన టాస్క్‌ ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రత్యేకమైంది. రెండు తరగతి గదులు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, సమావేశ మందిరం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా తీర్చిదిద్దారు. ప్రతి బ్యాచ్‌కు 50 మంది చొప్పున ఇప్పటి వరకు 700 మందికి పైగా ఇక్కడ శిక్షణ తీసుకున్నారు. ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారు. ఫిబ్రవరి నుంచి కొత్త బ్యాచ్‌లు మొదలయ్యాయి.

గ్రామీణ ప్రాంతాల వారికి వరం

హైదరాబాద్‌లాంటి నగరాల్లో ఉండే వారికి అనేక కోచింగ్‌ సెంటర్లు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండి చదువుకునే వారికి అలాంటి సౌకర్యం ఉండదు. పట్టణాలకు వెళ్లడం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి పరిస్థితుల్లో నైపుణ్యాలు లేక చాలామంది కొలువులకు దూరమవుతున్నారు. గ్రామీణ యువతకు టాస్క్‌ ఆధ్వర్యంలో శిక్షణ వరంగా మారింది. జావా, ఇతర ప్రోగ్రామింగ్‌ కోర్సులను హైదరాబాద్‌లాంటి ప్రాంతాల్లో నేర్చుకుంటే లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. అవే కోర్సులకు ఇక్కడ ఉచితంగా నేర్పిస్తున్నారు. ఇక్కడ తర్ఫీదు పొందిన అనేక మంది వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు సాధించారు.


అన్ని విధాలుగా శిక్షణ..

ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువతను అన్ని విధాలుగా సన్నద్ధం చేయడానికి వివిధ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కొవాలో ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు. క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం, భావవ్యక్తీకరణ, అనర్గళంగా మాట్లాడటం, బేసిక్‌ ఇంగ్లిష్‌ వంటివి నేర్పిస్తారు. బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి రెండు నెలలపాటు శిక్షణ ఇస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగానికి సంబంధించి ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌ కోర్సులు అందిస్తున్నారు. పుల్‌స్టాక్‌ జావా, వెబ్‌ టెక్నాలజీస్‌, కోడింగ్‌ స్కిల్‌, సీ ప్రోగ్రామింగ్‌, ఆల్‌గారిథమ్‌, డేటా స్ట్రక్చర్‌, డేటాబేస్‌ ప్రోగ్రామింగ్‌ వంటి కోర్సులను అందిస్తున్నారు.


టీసీఎస్‌లో కొలువు సాధించా
- వికాస్‌, టీసీఎస్‌ ఉద్యోగి

ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత కరీంనగర్‌ ప్రాంతీయ శిక్షణ కేంద్రం(ఐటీ టవర్‌)లో నెల రోజులపాటు జావా కోర్సులో మెలకువలు నేర్చుకున్నా. సమాచార నైపుణ్యాలూ నేర్పించారు. ఇంటర్వ్యూలో నెగ్గి టీసీఎస్‌లో కొలువు సాధించి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాను. వేలల్లో పెట్టి కోర్సులు నేర్చుకోకుండా ఉచితంగా తర్ఫీదు పొంది.. కొలువు సాధించడం సంతోషంగా ఉంది.


శిక్షణ ఉపయోగపడింది
- సయ్యద్‌ జమీరుద్దీన్‌, యాక్సెంచర్‌ ఉద్యోగి

మాది కరీంనగర్‌. బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్‌ పూర్తి చేసిన తర్వాత టాస్క్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జావా ఫుల్‌స్టాక్‌ కోర్సు ఉచితంగా శిక్షణ తీసుకున్నాను. ఇక్కడ ఉద్యోగం సాధించేలా మెలకువలు నేర్పించారు. యాక్సెంచర్‌ ఇండియాలో కొలువు సంపాదించాను. సాఫ్ట్‌వేర్‌ రంగం వైపు రావాలనుకుంటున్న యువతకు ఇది ఒక వరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని