logo

అక్రమ తవ్వకాలు ఆగేదెట్టా?

మొరం మట్టి అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. గ్రామాల్లోని చెరువులు, కుంటలతో పాటు ఎస్సారెస్పీ ప్రధాన కాలువ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి మట్టి తరలింపు చేస్తూ సొమ్ము చేసుకొంటున్నారు.

Published : 02 Feb 2023 06:06 IST

యథేచ్ఛగా తరలుతున్న చెరువులు, కుంటల మట్టి    
న్యూస్‌టుడే, శంకరపట్నం

ధర్మారంలోని ఎర్రకుంటలో మట్టి తవ్వకాలు

మొరం మట్టి అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. గ్రామాల్లోని చెరువులు, కుంటలతో పాటు ఎస్సారెస్పీ ప్రధాన కాలువ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి మట్టి తరలింపు చేస్తూ సొమ్ము చేసుకొంటున్నారు.

ఇదీ పరిస్థితి

శంకరపట్నం మండలంలో సుమారు 110 చెరువులు, కుంటలు ఉన్నాయి. మండలంలోని తాడికల్‌, ధర్మారం, వంకాయగూడెంతో పాటు పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలను మట్టి తవ్వకాల కోసం వినియోగిస్తున్నారు. ఇప్పలపల్లి, అంబాల్‌పూర్‌, కేశవపట్నం, కరీంపేట్‌ గ్రామాల శివారులో ఎస్సారెస్పీ ప్రధాన కాలువ పరిధిలోని మొరం మట్టి రవాణా నిరంతరం కొనసాగుతోంది. అన్ని సీజన్‌లలో గ్రామాలలో మట్టి తవ్వకాలు చేపడుతూ దందా చేస్తున్నా కట్టడి చేసే అధికారులు కానరావటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలు గ్రామాల్లోని పొక్టెయిన్‌ యంత్రాల నిర్వాహకులు ఏళ్లుగా మట్టి అక్రమ రవాణా చేపడుతున్నారని, తవ్వకాలతో ట్రాక్టర్ల ద్వారా ట్రిప్పునకు రూ.600కు మట్టి తరలిస్తూ చెరువులు, కుంటలతో పాటు ప్రధాన కాలువ ప్రాంతాలను లోయలుగా మారుస్తున్నారని వాపోతున్నారు. ‘‘ఇటీవల తాడికల్‌ కుంటలో నీళ్లున్నా మట్టి తవ్వకాలు సాగించారు. ధర్మారం గ్రామ ఎర్రకుంటలో పగటి వేళలో తవ్వకాలు చేపట్టారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల పేరిట అధికారులకు తెలుపుతూ ప్రైవేటు వ్యక్తులు చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు, ఇతరత్రా నిర్మాణాలకు రాత్రి సమయాల్లో మట్టి విక్రయాలతో వ్యాపారం సాగిస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలతో పాటు శిఖం భూముల ఆక్రమణలను నియంత్రించాల’’ని స్థానికులు పేర్కొంటున్నారు.


శాఖాపరమైన చర్యలు

గ్రామాల్లోని చెరువులు, కుంటల శిఖం భూములు ఆక్రమణ చేసే వారిపై చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదులు చేస్తే పరిశీలనతో పాటు చెరువులు, కుంటలు ఆక్రమణ జరగకుండా శాఖపరంగా తగిన చర్యలు చేపడతాం. 

 శ్రీనివాస్‌రావు, తహసీల్దార్‌


అనుమతి తప్పనిసరి

గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో అనుమతి పొందకుండా మట్టి తవ్వకాలు చేసే వారిని గుర్తిస్తాం. మట్టి అక్రమ తవ్వకాలపై సమాచారం అందించినా చర్యలు తీసుకుంటాం. ఎస్సారెస్పీ మట్టితో పాటు చెరువులు, కుంటల్లో అక్రమంగా తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు.

కవిత, డీఈఈ


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని