logo

ఎల్లంపల్లి కట్టపై ఇక రయ్‌.. రయ్‌..

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ప్రజలు, సందర్శకులు, పర్యాటకులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రహదారుల నిర్మాణం పూర్తయింది.

Published : 02 Feb 2023 06:13 IST

ఎల్లంపల్లి జలాశయ కరకట్టపై నిర్మించిన తారు రోడ్డు

అంతర్గాం, న్యూస్‌టుడే: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ప్రజలు, సందర్శకులు, పర్యాటకులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు రహదారుల నిర్మాణం పూర్తయింది. డ్యాం ఆనకట్టకు ఇరువైపులా కరకట్టలపై 6 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రతిరోజూ ఈ దారి గుండా రెండు జిల్లాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రజలతోపాటు స్థానిక రైతులు, మత్స్యకారులకు ఈ తారు రోడ్డు మరింత సౌకర్యంగా మారనుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయం పూర్తయి ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇన్ని రోజులుగా కర కట్టల మట్టి దారులపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డు పనులు ప్రారంభించినా మధ్యలో నిలిచిపోవడంతో మూడేళ్లపాటు కంకర రాళ్ల దారులపై ప్రజలు మరింతగా కష్టాలు ఎదుర్కొన్నారు. రోడ్డు బాగా లేనందున సెలవు, సాధారణ రోజుల్లో కుటుంబసభ్యులతో కలిసి డ్యాంను చూడాలన్న ఆసక్తి ప్రజల్లో తగ్గింది. ప్రస్తుతం తారు రోడ్డు నిర్మాణం జరగడంతో డ్యాం వద్దకు త్వరగా చేరుకోవచ్చు. దీంతో సందర్శకులు, పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశముంది. అత్యవసర సమయాల్లో సైతం రెండు జిల్లాల ప్రజలకు ఈ రోడ్డు వరంగా మారనుంది. కాగా కరకట్టల ప్రదేశం నుంచి ఇరువైపులా సమీప గ్రామాల ప్రధాన రహదారుల వరకు అనుసంధాన తారు రోడ్డు నిర్మిస్తే ప్రజల రాకపోకలకు పూర్తిస్థాయిలో సౌకర్యం ఏర్పడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని