logo

అక్రమ దందాకు అడ్డుకట్ట పడేదెన్నడు?

పేదలకు చెందాల్సిన రేషన్‌ బియ్యాన్ని అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. గ్రామాల్లో దళారులు సిండికేట్‌గా మారి నల్లబజారుకు తరలిస్తున్నారు.

Published : 02 Feb 2023 06:13 IST

జిల్లాలో ఆగని రేషన్‌ దందా.. ఫలితం ఇవ్వని 6ఏ కేసులు
ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

పెద్దపల్లిలో పట్టుబడిన రేషన్‌ బియ్యం వాహనం

పేదలకు చెందాల్సిన రేషన్‌ బియ్యాన్ని అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. గ్రామాల్లో దళారులు సిండికేట్‌గా మారి నల్లబజారుకు తరలిస్తున్నారు. వీరికి కొందరు రేషన్‌ డీలర్లు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల అధికారులు, సిబ్బంది తోడవుతుండటంతో ప్రజా ధనం దుర్వినియోగమవుతోంది.

ప్రభుత్వం ప్రజా పంపిణీ కింద అందజేసే దొడ్డు బియ్యం తినడానికి చాలా మంది వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి వారి నుంచి వేలిముద్రలు వేయించుకొని కిలోకు రూ.5 చొప్పున చెల్లించి డీలర్లు బియ్యాన్ని తీసుకుంటున్నారు. వాటిని బడా వ్యాపారులకు విక్రయిస్తూ అక్రమార్జనకు తెర తీస్తున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల విషయానికొస్తే రేషన్‌ దుకాణాలకు ఇవ్వాల్సిన బియ్యం కోటాలో కోతలు విధిస్తూ వాటిని అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఇదే దొడ్డు బియ్యానికి గరిష్ఠంగా రూ.32 వరకు కేటాయిస్తుండగా గతంలో పేదలకు రూపాయికి కిలో చొప్పున ఇచ్చేవారు. ప్రస్తుతం ఉచితంగా ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున అందజేస్తున్నారు. బియ్యం దందా చేస్తున్న వారిపై నిఘా అంతంత మాత్రంగానే ఉంది.

సూత్రధారులు  పట్టుబడితేనే..

జిల్లాలోని కొన్ని బియ్యం మిల్లుల్లో రేషన్‌ బియ్యాన్ని రీ సైక్లింగ్‌ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు చేరవేసే వారిపై పర్యవేక్షణ కొరవడింది. నామమాత్రంగా తనిఖీలు జరిపి 6 ఏ కేసులు నమోదు చేస్తున్నారు. వాస్తవానికి ఇలా దొరికిన వారంతా చిరు వ్యాపారులు. ఈ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరూ పట్టుబడటం లేదు. వారిపై ఉక్కుపాదం మోపితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.

లొసుగులే ఆసరా

* అక్రమార్కులు కేసులకు భయపడటం లేదు. పౌరసరఫరాల చట్టం ప్రకారం వాహనంలో సరకును తరలిస్తూ వ్యక్తి పట్టుబడితే వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తారు. అనంతరం అతడిపై 6-ఏ కేసు నమోదు చేసి సరకు ఆధారంగా జరిమానా విధిస్తారు. చెల్లించిన అనంతరం వాహనాన్ని తిరిగి ఇచ్చేస్తారు. దీంతో ఎలాంటి శిక్ష లేకుండానే బయటకు వచ్చే అవకాశం ఉంది.
* పలుమార్లు వాహనాల ద్వారా బియ్యం తరలిస్తూ పట్టుబడితే వాహన యజమానులపై పీడీ కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. దీంతో వ్యాపారులు తమ పేర్లతో ఉన్న వాహనాలను ఉపయోగించడం లేదు. నెంబరు ప్లేట్లకు రంగులు పూయడం, మార్పులు చేర్పులు చేసి అధికారులనే తప్పుదోవ పట్టిస్తున్నారు.
* పట్టుకున్న బియ్యం తమది కాదంటూ వాదిస్తున్నారు. రేషన్‌ బియ్యాన్ని కొందరు ప్రత్యేకంగా ప్రముఖ సంస్థలకు చెందిన రంగుల సంచుల్లో తరలిస్తుండటంతో స్వాధీనం చేసుకున్న బియ్యానికి, సాధారణ బియ్యానికి తేడా ఉండటం లేదు. దీంతో అధికారులు సరకును రేషన్‌ బియ్యంగా నిర్ధారించేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
* వీధుల్లో తిరుగుతూ రూ.8కి కిలో దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న చిరు వ్యాపారులు రూ.10 చొప్పున దళారులకు విక్రయిస్తున్నారు. సుల్తానాబాద్‌, పెద్దపల్లిలతో పాటు జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల దళారులు చెప్పిన చోటుకు వెళ్లి బియ్యం సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారు.
* జిల్లాలో గత నాలుగేళ్లలో 6ఏ కింద మొత్తం 341 కేసులు నమోదు చేశారు. ఇందులో 9 కేసులు ఇంకా కోర్టుకు పంపించలేదు. మొత్తం 1,27,82,132 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుని 1,26,02,632 క్వింటాళ్లను పౌరసరఫరాల శాఖకు అప్పగించారు. ఇంకా 1,79,500 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు.


జరిమానాలు విధిస్తున్నాం

ఎక్కడైనా రేషన్‌ బియ్యం కొనుగోలు చేస్తున్నా, మిల్లుల్లో రీసైక్లింగ్‌ చేస్తున్నా సమాచారం అందిస్తే దాడులు నిర్వహిస్తున్నాం. బియ్యం స్వాధీనం చేసుకొని, కేసులు నమోదు చేస్తున్నాం. అక్రమ దందా చేసే డీలర్లు, మిల్లర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం. డీలర్లు ఎవరూ బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వొద్దు.
వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు