logo

నిర్మలమ్మ కరుణ కొంతే!

ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లా ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.. దేశవ్యాప్తంగా అమలయ్యే వివిధ పథకాలు మినహా ప్రత్యేకంగా ఎలాంటి వరాలు దక్కలేదు..

Updated : 02 Feb 2023 09:52 IST

ఉమ్మడి జిల్లాకు దక్కని ప్రత్యేక ప్రయోజనం

నేతన్నలకు నిరాశ

వేతన జీవులకు ఊరట
ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లా ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.. దేశవ్యాప్తంగా అమలయ్యే వివిధ పథకాలు మినహా ప్రత్యేకంగా ఎలాంటి వరాలు దక్కలేదు.. వేతన జీవులకు ఆదాయ పన్ను పరిమితి పెంపుతో కొంత ఊరట లభించగా.. బడ్జెట్‌లో నేతన్నల ఊసే లేదు. రైల్వేలకు సంబంధించి కేటాయింపులపై స్పష్టత కొరవడటం.. ఐఐఐటీ, నవోదయ వంటి కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు ప్రకటనలు లేకపోవడం నిరాశ కలిగించింది.


విద్యా ప్రమాణాల పెంపుతో లబ్ధి

విద్యా బోధనలో కొత్త విధానాలతోపాటు పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లుగా యువతలో నైపుణ్యాలను తీర్చిదిద్దనున్నారు. దీనికోసం ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ 4.0ను ప్రవేశపెట్టారు. జిల్లాల్లోని విద్యా శిక్షణ కేంద్రాల్లో ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణనివ్వనున్నారు. కరీంనగర్‌లోని డైట్‌ సెంటర్‌కు ఈ అవకాశం రానుంది. కేంద్ర ప్రభుత్వం పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లను ప్రారంభించింది. ఈసారి విద్యార్థులకు డిజిటల్‌ గ్రంథాలయాలను ప్రకటించింది. ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సహాయ సిబ్బందిని భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని రెండు గురుకులాల్లో 802 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ ఖాళీగా ఉన్న 68 పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.


చిరుధాన్యాల సాగు కొంతే..

బడ్జెట్‌లో శ్రీఅన్న పథకం ద్వారా చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా చిరు ధాన్యాలు సాగు 10 వేల ఎకరాలకు మించడం లేదు. స్థానిక అధికారులు రైతులను ప్రోత్సహిస్తేనే ఈ పథకం ద్వారా లబ్ధి కలగనుంది. ఉమ్మడి జిల్లాలో వరి, పత్తి సాగు ఎక్కువ. సాగు వ్యయం నానాటికీ పెరుగుతుండడం.. మద్దతు ధరలు మాత్రం నామమాత్రంగా పెరుగుతుండటంతో గిట్టుబాటు కాక అన్నదాతలు నష్టపోతున్నారు. ఈ పంటల కనీస మద్దతు ధర పెరిగితేనే రైతులకు ఊరట లభించనుంది. వ్యవసాయ రుణాలను రూ.20 లక్షల కోట్లకు పెంచడంతో బ్యాంకులు, సహకార సంఘాల నుంచి రుణ పరిమితి పెరగనుంది. పీఏసీఎస్‌లను మల్టీపర్పస్‌ కోఆపరేటివ్‌ సొసైటీలుగా మార్చాలని పేర్కొన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 127 పీఏసీఎస్‌ల అభివృద్ధికి అవకాశం ఉంది. డిజిటలైజేషన్‌ చేయనుండటంతో రుణాల పంపిణీ, చెల్లింపుల్లో పారదర్శకత ఉంటుంది.


కొత్త విద్యా సంస్థలు లేవు..

ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు కేంద్రీయ, ఒక నవోదయ విద్యాలయం మాత్రమే ఉన్నాయి. కొత్త జిల్లాలకు నవోదయ ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని ఆశించినా నిరాశే మిగిలింది. ఉమ్మడి జిల్లాకు ట్రిపుల్‌ ఐటీ, ఐఐఎం వంటి ఊసేలేదు. కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న నర్సింగ్‌ పాఠశాల స్థాయిని పెంచి బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుగా మార్చాలనే డిమాండ్‌ ఉంది. అయితే దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలకు అనుబంధంగా 154 నర్సింగ్‌ కళాశాలలను మంజూరు చేసినట్లు ప్రకటించారు. అందులో కరీంనగర్‌కు స్థానం ఉందా? అనేది స్పష్టత రావాల్సి ఉంది.


1.52 లక్షల మంది వేతన జీవులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని రంగాల్లో కలిపి 1,52,680 మంది వేతన జీవులున్నారు. ఇందులో లక్ష మంది వరకు ఆదాయపు పన్ను చెల్లించేవారే.. ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి బడ్జెట్‌ కావడంతో ఆదాయ పన్ను పరిమితిని పెంచి కేంద్రం ఉద్యోగులకు ఊరట కల్పించింది. రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు మినహాయింపులు ఉపయోగించుకొని పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వీటిని అయిదు స్లాబులుగా చేశారు.


జాతీయ రహదారులపై స్పష్టత కరవు

భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా తొమ్మిది వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మిస్తామని 2014లో కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 2021-22 బడ్జెట్‌లో మంచిర్యాల- మంథని- వరంగల్‌ జాతీయ గ్రీన్‌ కారిడార్‌ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఇది సర్వే దశలో ఉంది.  తాజా బడ్జెట్‌లో జగిత్యాల- కరీంనగర్‌- వరంగల్‌, కరీంనగర్‌- సిరిసిల్ల- పిట్లం, సిరిసిల్ల- సిద్దిపేట- జనగాం, నిర్మల్‌- ఖానాపూర్‌- జగిత్యాల, కరీంనగర్‌- మానకొండూరు- జమ్మికుంట- భూపాలపల్లి, రాయపట్నం - కరీంనగర్‌- కోదాడ మార్గాల ఊసేలేదు.


నేతన్న ఊసే లేదు

వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద రంగమైన వస్త్రోత్పత్తి పరిశ్రమపై కేంద్ర పద్దులో ప్రస్తావన లేకపోవడంతో నేతన్నల్లో నిరాశ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 25 వేల మంది నేత కార్మికులు ఉంటారు. రాష్ట్రంలో మరమగ్గాల వస్త్రోత్పత్తి పరిశ్రమ విస్తరించిన సిరిసిల్లలో మెగాపవర్‌లూం క్లస్టర్‌ ఏర్పాటు చేస్తే వస్త్ర పరిశ్రమ దాని అనుబంధ రంగాలు విస్తరిస్తాయి. నాణ్యమైన వస్త్రోత్పత్తుల ఎగుమతికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలో గర్షకుర్తి, జమ్మికుంట, కరీంనగర్‌ చేనేత క్లస్టర్లుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఊసేలేదు.


మత్స్య రంగానికి ఊతం

పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లతో ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఎల్లంపల్లి, ఎగువ, మధ్య, దిగువ మానేరు, అన్నపూర్ణ జలాశయాలున్నాయి. ఈ పథకం అమల్లోకి వస్తే ఉమ్మడి జిల్లాలో 42 వేల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది.


రైల్వే నిధుల లెక్క తేలితేనే..

రైల్వే శాఖకు భారీగా నిధులను కేటాయించారు.  ఇది 2013-14 బడ్జెట్‌తో పోలిస్తే.. తొమ్మిది రెట్లు అధికమన్నారు. కానీ వీటిలో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వివరాలేవీ వెల్లడి కాలేదు. బొగ్గు, ఎరువులు, ఆహారధాన్యాల ఉత్పత్తులను పోర్టులు, విమాశ్రాయాలకు వేగంగా తరలించేందుకు  రైల్వేలైన్లను పునరుద్ధరించనున్నారు. వాటిలో ఉమ్మడి జిల్లాలో బొగ్గు, యూరియా, వరి, పత్తి, మొక్కజొన్న వంటి వ్యవసాయోత్పత్తులు అధికంగా ఉంటాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని ప్రధాన రైలు మార్గమైన కాజిపేట- బల్లార్షా వయా గాంగ్‌టక్‌ మార్గంలో ఉప్పల్‌- పెద్దంపేట మధ్య మూడోలైను మార్గం పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. కొత్త లైను ఏమైనా మంజూరు చేస్తారా చూడాలి. కాజీపేట- బల్లార్షా సెక్షన్‌లో వందేభారత్‌ రైలు ప్రవేశపెట్టడంపై స్పష్టత రాలేదు. బడ్జెట్‌లో వందేభారత్‌ రైళ్ల పెంపుపై ప్రకటన నేపథ్యంలో ఈ మార్గంలో రైలును నడిపితే ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, సింగరేణి పరిశ్రమల్లో పనిచేసే వివిధ రాష్ట్రాల ఉద్యోగులకు ప్రయాణ సౌకర్యం మెరుగవనుంది.


విమానం ఎగిరేనా

దేశవ్యాప్తంగా 50 ప్రాంతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో బసంత్‌నగర్‌ విమానాశ్రయం పునరుద్ధరణపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇది పూర్తయితే ఉమ్మడి జిల్లావాసులు ఇక్కడి నుంచే విమాన ప్రయాణం చేసే కల నెరవేరనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని