logo

కనుల విందుగా శోభాయాత్ర

కరీంనగర్‌ మార్కెట్‌ రోడ్డు శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి నిర్వహించిన శోభాయాత్ర కనులపండువగా కొనసాగింది. కరీంనగర్‌ రాంనగర్‌ మార్క్‌ఫెడ్‌ మైదానంలో ఉత్సవమూర్తులను ట్రాక్టర్‌ వాహనంపై సుందరంగా అలంకరించారు.

Published : 03 Feb 2023 05:50 IST

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ మార్కెట్‌ రోడ్డు శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి నిర్వహించిన శోభాయాత్ర కనులపండువగా కొనసాగింది. కరీంనగర్‌ రాంనగర్‌ మార్క్‌ఫెడ్‌ మైదానంలో ఉత్సవమూర్తులను ట్రాక్టర్‌ వాహనంపై సుందరంగా అలంకరించారు. తాళ్లపాక 12వ వంశం వారసులు తాళ్లపాక హరినారాయణచార్యులు ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి బంధువులు, ఉత్సవ కమిటీ సభ్యులు రథంపై పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. దారి పొడవునా సాంస్కృతిక ప్రదర్శనలు, వాహన సేవ రథాలు, పోలీసు వాహనాలు, ఏనుగులు, ఒంటెలు, అశ్వాలు లాంటి ప్రదర్శనలు నగరవాసులను కట్టిపడేశాయి.

రాంనగర్‌ నుంచి వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు దారికి ఇరువైపులా నగరవాసులు వీక్షించి తరించారు. దక్షిణ భారత సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగాయి. కేరళ సింగారి మేళం, కోలాట నృత్యాలు, దేవతామూర్తులు, చిన్నపిల్లల వేషధారణలు, ఒగ్గు డోలు నృత్యాలు, చిరుతల రామాయణం, కేరళ బృందం పంచ వాయిద్యం, కథాకళి, కాంతారా వేషాలు, కాళీ మాత మూర్తులు, నర్సింహావతారం, సన్నాయి వాయిద్యంపై అన్నమయ్య కీర్తనలు లాంటివి భక్తులు వీక్షించారు. మంత్రి గంగుల కమలాకర్‌ దగ్గరుండి శోభాయాత్రను పర్యవేక్షించారు. గంగు సుధాకర్‌, మంత్రి సతీమణి, కుటుంబ సభ్యులు, మేయర్‌ వై.సునీల్‌రావు, భారాస జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణరావు, నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్‌, డిప్యూటీ మేయర్‌ స్వరూపరాణి, ధర్మకర్తలు చకిలం గంగాధర్‌, శ్రీనివాస్‌, గంప రమేష్‌, గోగుల ప్రసాద్‌, నందెల్లి మహిపాల్‌, ఈవో ఉడుతల వెంకన్న పాల్గొన్నారు.  పోలీసు కమిషనర్‌ సుబ్బారాయుడు బందోబస్తును పరిశీలించి పర్యవేక్షించారు. అదనపు  డీసీపీలు చంద్రమోహన్‌, శ్రీనివాస్‌ బందోబస్తు పర్యవేక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు