logo

బాల్యానికి అండ.. భవితకు భరోసా

ప్రాథమిక విద్య పౌరుల భవితకు పునాది. అది దృఢంగా ఉంటేనే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చు. కొందరు తల్లిదండ్రులు అవగాహన లేకనో, ఆర్థిక ఇబ్బందుల కారణంగానో బలపం పట్టాల్సిన పిల్లలతో పనులు చేయిస్తున్నారు.

Published : 03 Feb 2023 05:50 IST

సత్ఫలితాలిస్తున్న ‘ఆపరేషన్‌ స్మైల్‌’, ‘ముస్కాన్‌’
న్యూస్‌టుడే, కరీంనగర్‌ మంకమ్మతోట

పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న అధికారులు

ప్రాథమిక విద్య పౌరుల భవితకు పునాది. అది దృఢంగా ఉంటేనే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చు. కొందరు తల్లిదండ్రులు అవగాహన లేకనో, ఆర్థిక ఇబ్బందుల కారణంగానో బలపం పట్టాల్సిన పిల్లలతో పనులు చేయిస్తున్నారు. వారికి పనుల నుంచి విముక్తి ప్రసాదించేలా ప్రభుత్వం ఏటా జనవరిలో ‘ఆపరేషన్‌ స్మైల్‌’, జులైలో ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ పేరిట ప్రత్యేక తనిఖీలు చేపడుతోంది. ఎనిమిదేళ్లుగా చేపడుతున్న ప్రత్యేక తనిఖీలతో బాల కార్మికుల సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది. బాల కార్మికులు లేని జిల్లాగా తయారు చేయాలని జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి ఫలితం కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరిలో చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌లో పట్టుబడిన బాలల సంఖ్య గణనీయంగా తగ్గడమే ఇందుకు నిదర్శనం.

ప్రత్యేక తనిఖీలు..

జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (బాలల రక్షణ పథకం), పోలీస్‌, కార్మిక శాఖ, స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా తనిఖీ చేపడుతున్నారు. ఏటా జనవరి, జులైలో రెండు నెలలపాటు ఈ తనిఖీలు కొనసాగుతాయి. ముఖ్యంగా బాల కార్మికులు, అక్రమ రవాణా, తప్పిపోయిన చిన్నారులు, అనాథలు, భిక్షాటన చేస్తున్న చిన్నారులను గుర్తించి వారికి విముక్తి కల్పిస్తున్నారు. బాల్యంలోనే ఇటుక బట్టీలు, తదితర పని ప్రదేశాల్లో ఉండే చిన్నారులను గుర్తించి.. వారిని సమీపంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పిస్తున్నారు. కేంద్రాలు సమీపంలో లేని వారికి పౌష్టికాహారం పని ప్రదేశాల్లోనే అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. పని ప్రదేశాల్లో ఉన్న గర్భిణులు, బాలింతలకు సైతం పోషకాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌..

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తున్న పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి వారికి అప్పగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనిలో పెట్టుకున్న యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి, హెచ్చరిస్తున్నారు. పాఠశాల విద్య మధ్యలోనే మానేసి పని ప్రదేశాల్లో కనిపించిన బాలలను తిరిగి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేని మూలంగా పాఠశాలకు వెళ్లలేని వారిని ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పిస్తున్నారు. భిక్షాటన చేస్తున్న పిల్లలను సైతం గుర్తించి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో ఇప్పటి వరకు 3364 పిల్లలను గుర్తించారు. వీరిలో బాలురు 2509, బాలికలు 855 మంది ఉన్నారు.


బాలకార్మికులు లేని జిల్లానే లక్ష్యం

సబితకుమారి, జిల్లా సంక్షేమ అధికారి

ఏటా రెండు నెలలపాటు కొనసాగిస్తున్న ఆపరేషన్‌ స్మైల్‌, ముస్కాన్‌ తనిఖీలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గతంలో పెద్ద సంఖ్యలో బాల కార్మికులు పట్టుబడే వారు, ప్రస్తుతం ఆ సంఖ్య చాలా శాతం తగ్గింది. పట్టుబడ్డ పిల్లలందరికీ ప్రత్యామ్నాయం చూపి వారిని అంగన్‌వాడీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చేర్పిస్తున్నాం. బాల కార్మికుల రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు