logo

ఆర్టీసీ బస్టాండులో పార్కింగ్‌ బాదుడు

కరీంనగర్‌ బస్టాండ్‌లో నిత్యం వందలాది మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తమ వాహనాలను ప్రయాణ ప్రాంగణ ఆవరణలోని సైకిల్‌ స్టాండ్‌లో పార్కింగ్‌ చేస్తుంటారు.

Published : 03 Feb 2023 05:50 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ రవాణావిభాగం

ఖాళీ స్థలంలో నిలిపిన కార్లు

రీంనగర్‌ బస్టాండ్‌లో నిత్యం వందలాది మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తమ వాహనాలను ప్రయాణ ప్రాంగణ ఆవరణలోని సైకిల్‌ స్టాండ్‌లో పార్కింగ్‌ చేస్తుంటారు. దీనిని ఆసరా చేసుకున్న స్టాండ్‌ నిర్వాహకులు ఇష్టారీతిలో ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రయాణికులను డ్రాపింగ్‌, పికప్‌ చేసుకోవడానికి వాహనాల్లో వచ్చిన వారు ఉచితంగా పార్కింగ్‌ చేసే అవకాశముంది. నిర్వాహకులు మాత్రం వారి నుంచీ రుసుం వసూలు చేస్తున్నారు.

బస్టాండ్‌ ఆవరణలో రెండు పార్కింగ్‌ స్థలాలు ఉన్నాయి. సైకిల్‌స్టాండ్‌-1 నాలుగేళ్ల కాలపరిమితితో నెలకు రూ.2,64,100(జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలు అదనం), సైకిల్‌ స్టాండ్‌-2కు నెలకు రూ.2,06,850 (జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలు అదనం) గుత్తేదారులు ఆర్టీసీకి చెల్లిస్తున్నారు. వాహనానికి గంటకు ఎంత ఛార్జీ వసూలు చేయాలనేది టెండర్‌ సమయంలో నమోదు చేస్తారు. నిర్దేశించిన సమయాన్ని బట్టి వసూలు చేయాలి. కానీ వారు ఇష్టారాజ్యం వసూలు చేస్తున్నారు.

కనిపించని బోర్డు

పార్కింగ్‌ స్థలాల వద్ద నిర్దేశిత రుసుంల పట్టిక, సమయంతో కూడిన నామఫలకాలు ఏర్పాటు చేయలేదు. నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తున్నారు. వారు ఇచ్చే రసీదులో వాహనం దెబ్బతిన్నా, విలువైన వస్తువులు పోయినా సంబంధం లేదని ముద్రించడం గమనార్హం.

మనిషిని కాపలా పెట్టి మరీ..

పార్కింగ్‌ ప్రదేశాలు కాకుండా బస్టాండ్‌ ఆవరణలో ఖాళీ ప్రదేశం ఉంది. ఎవరైన బంధువులను, కుటుంబ సభ్యులను పికప్‌, డ్రాపింగ్‌ చేయడానికి వచ్చిన వారి వాహనాలు ఇక్కడ ఉచితంగా పార్కింగ్‌ చేసుకోవచ్చు. అలా వచ్చి పది నిమిషాలు నిలిపిన కార్ల నుంచి కూడా రూ.100 వసూలు చేస్తున్నారు. ఓ గుత్తేదారు ఇక్కడ ప్రత్యేకంగా ఓ వ్యక్తిని పెట్టి పార్కింగ్‌ స్థలానికి వెళ్లాలని సూచిసున్నట్లు వాహనదారులు తెలిపారు. వారు చెప్పినట్లుగా వినకపోతే టైర్ల నుంచి గాలి, ప్లగ్‌లు తీస్తున్నారు.

కొందరు తమ వాహనాలను పార్కింగ్‌ స్థలంలో కాకుండా ఖాళీ ప్రదేశంలో ఉదయం పార్కింగ్‌ చేసి బస్సుల్లో వెళ్లి సాయంత్రం తీసుకెళ్తున్నారని, నిబంధనల ప్రకారం అంత సమయం అక్కడ వాహనాలను నిలపరాదని అధికారులు అంటున్నారు.


ఉన్నతాధికారులు ఉన్నా...

కరీంనగర్‌ బస్టాండ్‌ పర్యవేక్షణ అంతా కరీంనగర్‌-1 డిపో పరిధిలోకి వస్తుంది. దుకాణాలు, సైకిల్‌ స్టాండ్‌ ఇలా మొత్తం చూడాల్సిన బాధ్యత ఆ డిపో అధికారులది. వీరికి తోడు ఇక్కడే ఈడీ, ఆర్‌ఎం, డిప్యూటీ ఆర్‌ఎం కార్యాలయాలు కూడా ఉన్నాయి. అయినా దీనిని అడ్డుకోవడంలేదు.


అడిగినా పట్టించుకోవడం లేదు

- లోపల్లి శ్రీనివాస్‌రావు, వాహనదారుడు

పార్కింగ్‌ స్థలంలో ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్‌ చేశాను. గంటలోపు తిరిగి వచ్చి నా వాహనాన్ని తీసుకుంటే రూ.18 వసూలు చేశారు. గంటలోపు సమయానికి ఆరు (జీఎస్టీ కలుపుకొని) రూపాయలు తీసుకోవాలి కదా అని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వడం లేదు. 4 గంటలు వాహనం పార్కింగ్‌ చేస్తే ఎంత తీసుకుంటారని ప్రశ్నిస్తే రూ.30 తీసుకుంటామని సమాధానం చెబుతున్నారు. ఇంత దర్జాగా వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం.  


చర్యలు తీసుకుంటాం

- ఎన్‌.చందర్‌రావు, డిప్యూటీ ఆర్‌ఎం

బస్టాండ్‌ పార్కింగ్‌ స్థలం కరీంనగర్‌-1 డిపో పరిధిలోకి వస్తుంది. గుత్తేదారులు నిబంధనల మేరకు నడుచుకోవాలి. వారికి  కేటాయించిన స్థలంలో వారు పార్కింగ్‌ చేయాలి. ఖాళీ స్థలం ఎలాంటి రుసుం వసూలు చేయరాదు. అత్యధిక రుసుం వసూలు చేసినా, అదనపు స్థలం ఉపయోగించినా వారిపై చర్యలు తీసుకుంటాం. దీనిపై విచారణ జరిపి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు