logo

సృజనకు అక్షరాభిషేకం

పాఠాలు చదువుతూనే పుస్తకాలు రాశారు ధర్మారం మండలం నర్సింహులపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు. చంధస్సు గురించి తెలుసుకునే ప్రాయంలోనే చందోబద్ధంగా రచనలు చేశారు.

Published : 03 Feb 2023 05:50 IST

పాఠశాల దశలోనే రచనలతో రాణిస్తున్న విద్యార్థినులు
న్యూస్‌టుడే, ధర్మారం

ముగ్గురు విద్యార్థినుల రచనలతో వెలువరించిన పుస్తకాలు

పాఠాలు చదువుతూనే పుస్తకాలు రాశారు ధర్మారం మండలం నర్సింహులపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు. చంధస్సు గురించి తెలుసుకునే ప్రాయంలోనే చందోబద్ధంగా రచనలు చేశారు. విద్యార్థుల ఆసక్తిని గమనించిన తెలుగు ఉపాధ్యాయుడు కందుకూరి భాస్కర్‌ వారిని ప్రోత్సహించారు. చిన్నారుల రచనలను అచ్చు వేయించేందుకు నిజామాబాద్‌ జిల్లా బాల్కొండకు చెందిన ఏనుగు దయానంద్‌రెడ్డి-రేణుక దంపతులు ముందుకొచ్చారు. దీంతో తాము రాసిన కవితలను, కథలను పుస్తకాల రూపంలో చూసుకుని ఉప్పొంగిపోయారు. ఇటీవలే పాఠశాలలో పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల భాషా నైపుణ్యాలను చూసి డీఈవో మాధవి అభినందించారు. కార్యక్రమానికి హాజరైన బాల సాహితీవేత్తలు సైతం చిన్నారులపై ప్రశంసలు కురిపించారు.

సామాజికాంశాలే కథా వస్తువులు

సమాజంలో ‘ఆడపిల్ల’ పరిస్థితిని బుర్ర వైష్ణవి శతక రూపంలో అక్షరీకరించింది. అమ్మాయి పుట్టిందనగానే బాలింతకు అత్తింటి వారు పెట్టే ఆరళ్ల నుంచి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్నారనే సామాజిక కోణాన్ని వైష్ణవి చందోబద్ధంగా పొందుపరిచింది. అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, సవాళ్లను ఎదుర్కొంటూ రాష్ట్రపతి గానూ ఉన్నత పదవులు చేపడుతున్నారని సరళమైన భాషలో 108 పద్యాలలో వివరించింది. నాగుల శ్రీనిత్య ప్రకృతి ఒడిలో పేరుతో మానవ మనుగడలో ప్రకృతి పాత్ర, జీవవైవిధ్యం, పంటల గురించి చక్కగా కవిత్వం రాసింది. వేల్పుల శ్రీలత స్నేహాన్ని కథాంశంగా ఎంచుకుని 12 కథలు రాసింది. ముగ్గురు విద్యార్థినులు కథలకు తగ్గట్టుగా ఒక్కో పుస్తకంలో ముద్రించేందుకు సొంతంగా బొమ్మలు గీయడం విశేషం.


అభిరుచికి ప్రోత్సాహం తోడై..

వేల్పుల శ్రీలత, 9వ తరగతి, బొట్లవనపర్తి

చిన్నతనం నుంచి దినపత్రికలు, పుస్తకాల్లో చిన్నారులు రాసిన కథలు చదవడం అలవాటు. కథలతో పాటు వారి ఫొటోలను చూసి, నేను కూడా అలా రాయాలని అనుకునేదాన్ని. పలు కథలను పత్రికలకు రాసి పంపాను. నా అభిరుచిని తెలుసుకున్న తెలుగు ఉపాధ్యాయుడు భాస్కర్‌ కథలు రాసేలా ప్రోత్సహించారు. నేను రాసిన 12 కథలతో ‘నిజమైన స్నేహితులు’ పేరిట పుస్తకం అచ్చువేయించడం చాలా సంతోషంగా ఉంది. మున్ముందు రచనలు కొనసాగిస్తాను.


ప్రకృతి ప్రయోజనాలపై..

-నాగుల శ్రీనిత్య, 10వ తరగతి, కానంపల్లి

తెలుగు భాషపై ఆసక్తితో బాల సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదివాను. భాస్కర్‌ సార్‌ సూచనలతో నా దృష్టి సాహిత్యం వైపు మరలింది. చందోబద్ధంగా 108 కవితలు రాశాను. వివిధ రకాల చెట్లు, పూల మొక్కలనే కథా వస్తువులుగా మార్చుకున్నాను. మానవ జీవనం ప్రకృతితో మమేకమై ఉంటుంది. ప్రాణకోటికి ప్రకృతి ద్వారా కలిగే ప్రయోజనాలను పుస్తకంలో వివరించాను. చందోబద్ధంగా ఉందని అందరూ మెచ్చుకోవడం సంతృప్తిగా ఉంది.


బాలికల కష్టాలకు పద్య రూపం

-బుర్ర వైష్ణవి, 10వ తరగతి

కడుపులో నలుసుగా ఉన్నప్పటి నుంచే సమాజంలో ఆడపిల్లలపై చిన్నచూపు. అందుకే గర్భస్థ దశ నుంచి బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉదహరిస్తూ కవితలు రాశాను. సమస్యలు, ఒత్తిళ్లు, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని బాలికలు సాధించిన విజయాలను ఈ పుస్తకంలో పొదుపరిచాను. సమాజంలో ఎదుర్కొంటున్న కష్టాలను పద్య రూపంలో రాశాను. పుస్తకం అచ్చు వేయించడం ఆనందాన్నిచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు