logo

నమూనా బడులు.. అరకొరగా పనులు

సర్కారు బడుల్లో కార్పొరేట్‌కు దీటుగా బోధన అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.

Updated : 03 Feb 2023 05:58 IST

‘మన ఊరు.. ’పై నిరంతరం  సమీక్షించినా ఆలస్యమే..
4న మండలానికి రెండు  పాఠశాలలు ప్రారంభం
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

ర్కారు బడుల్లో కార్పొరేట్‌కు దీటుగా బోధన అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మౌలిక వసతులు కల్పించేందుకు తొలి విడతలో జిల్లాలో 191 పాఠశాలలకు అవకాశం కల్పించారు. ఇందులో మండలానికి రెండు పాఠశాలలను నమూనాగా తీసుకొని పనులు పూర్తి చేయడంతో పాటు జనవరిలో ప్రారంభించాలని భావించారు. పనులు ఆలస్యం కావడంతో ఈ నెల 4న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు పాఠశాలల్లో పనుల తీరుపై పరిశీలన్మాతక కథనం.

అన్నీ అడ్డంకులే..

జిల్లాలో పాఠశాలల అభివృద్ధి పనులకు అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఉపాధిహామీలో చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. పనుల నిర్వహణపై జిల్లా స్థాయిలో సమీక్షించినా ఫలితం లేకపోయింది. పలు చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేసి పైపై పూతలు అద్దుతున్నారు. పెయింటింగ్‌, ఎలక్ట్రిషియన్‌ పనులు నాసిరకంగా చేస్తున్నారు. ఫర్నిచర్‌, గ్రీన్‌ చాక్‌బోర్డు, డ్యూయల్‌ బెంచీల సరఫరాలో జాప్యం నెలకొంది. సామగ్రిని రాష్ట్ర స్థాయిలోనే కొనుగోలు చేసి జిల్లాలకు పంపిణీ చేస్తుండటంతో ఆలస్యమవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీ స్థలంలో నాణ్యత లేని మొరం చల్లుతున్నారు. జిల్లాలో మంథని బాలురు, పత్తిపాక, గర్రెపల్లి, బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాలలకు 12 ఎల్‌ఈడీ టీవీలు సరఫరా చేశారు. ఒక్కో పాఠశాలకు మూడు కేటాయించారు.


అందని డ్యూయల్‌ బెంచీలు

బ్రాహ్మణపల్లి బడి ముందు పోసిన మొరం

పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాలలో రూ.22 లక్షలతో భోజనశాల, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీ పనులు చేశారు. ఎలక్ట్రిషియన్‌, పెయింటింగ్‌, తాత్కాలిక మరమ్మతు పనులు పూర్తయ్యాయి. గ్రీన్‌ చాక్‌బోర్డు, ఎల్‌ఈడీ టీవీలు పంపిణీ చేశారు. డ్యూయల్‌ బెంచీలు సరఫరా కావాల్సి ఉంది. రాఘవపూర్‌ ప్రాథమిక పాఠశాలలో పనులు పూర్తి చేయడంతో బెంచీలు సరఫరా అయ్యాయి.


నిర్మాణాలు సరే.. సామగ్రి ఏదీ!

కాచపల్లి ప్రాథమిక పాఠశాల

సుల్తానాబాద్‌: గర్రెపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.14 లక్షల నిధులతో నిర్మించిన డైనింగ్‌హాల్‌, విద్యుత్తు నవీకరణ తదితర మరమ్మతు పనులు పూర్తయ్యాయి. కదంబాపూర్‌ కాచపల్లి ప్రాథమిక పాఠశాలలో రూ.7 లక్షలు కేటాయించారు. మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణం తదితర పనులు తుది దశకు చేరాయి. బెంచీలు, గ్రీన్‌ చాక్‌బోర్డు కూడా రావాల్సి ఉంది.  


రంగులద్దినా పాత ఫర్నీచరే..

కాల్వశ్రీరాంపూర్‌: కాల్వశ్రీరాంపూర్‌ ఉన్నత పాఠశాలకు రూ.26.20 లక్షలు, కిష్టంపేట బడికి రూ.11.50 లక్షలు మంజూరయ్యాయి. కాల్వశ్రీరాంపూర్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థుల ఫర్నీచర్‌, గ్రీన్‌ చాక్‌బోర్డు, సోలార్‌ ప్యానెల్‌, కిష్టంపేటలో ఉపాధ్యాయులు, విద్యార్థుల ఫర్నీచర్‌, గ్రీన్‌చాక్‌ బోర్డు సమకూర్చలేదు. పాఠశాలల్లో అన్ని వసతులు సమకూరకుండానే ప్రారంభిస్తుండటంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


కొనసాగుతున్న నిర్మాణాలు

ఓదెల: మండలంలో గుండ్లపల్లె, చిన్నకొమిర పాఠశాలలను నమూనాగా ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో విద్యుద్దీకరణ, తాగునీటి వసతి, రంగులద్దడం వంటి పనులు ఇటీవల పూర్తయ్యాయి. కుర్చీలు, డ్యూయల్‌ డెస్కు బెంచీలు, గ్రీన్‌చార్ట్‌ బోర్డులు, ఎల్‌ఈడీ టీవీలు ఇంకా రాలేదు. వంట గదులు నిర్మాణ దశలో ఉన్నాయి. గుండ్లపల్లెలో పాఠశాల చుట్టుపక్కల రైతుల వ్యవసాయ భూములుండగా హద్దులు నిర్ణయించకపోవడంతో ప్రహరీ నిర్మాణానికి నోచుకోలేదు.


మెరుగైన వసతులు

ధర్మారం: పత్తిపాక ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు రూ.24.41 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో పాఠశాలలో తాగునీటి వసతి, విద్యుద్దీకరణ పనులు, భోజనశాల నిర్మాణం ఇతరత్రా మరమ్మతు పనులు చేపట్టారు. మూడు తరగతి గదుల్లో డిజిటల్‌ ప్రొజెక్టర్లు బిగించారు. ఆవరణనూ పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ఆకర్షణీయంగా రంగులు వేయించారు. పనులన్నీ పూర్తయ్యాయి. గతంతో చూస్తే చాలా వరకు వసతులు మెరుగయ్యాయి.


రూపురేఖలు మారుతున్నాయి

మాధవి, జిల్లా విద్యాధికారి

జిల్లాలోని 28 నమూనా పాఠశాలల్లో పనులు పూర్తి చేశాం. సామగ్రి సరఫరా అవుతోంది. పనులు పూర్తయిన చోట బడుల రూపురేఖలు మారుతున్నాయి. విద్యార్థులకు మౌలిక వసతుల కొరత తీరనుంది. ఈ నెల 4న ప్రారంభించనున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు