logo

బడిలో తాగునీటి వెతలు

విద్యార్థులకు పాఠశాల సమయంలో నాలుగుసార్లు నీళ్లు తాగించాలి. వీరికి పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 03 Feb 2023 05:50 IST

భగీరథ పైపులైన్లకే పరిమితం
కలుషిత నీటితో అనారోగ్యం పాలవుతున్న విద్యార్థులు

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

వీర్నపల్లి మండలం మద్దిమల్ల ప్రాథమికోన్నత పాఠశాలలో 38 మంది విద్యార్థులున్నారు. తాగునీటికి ఉపాధ్యాయులు రోజూ గ్రామంలోని శుద్ధజల కేంద్రం నుంచి నీటిని తీసుకొస్తున్నారు. వాటిని అన్ని తరగతుల విద్యార్థులు సీసాల్లో పట్టుకుని తాగుతున్నారు. ఈ పాఠశాలలో తాగునీటి సరఫరా లేదు.


రుద్రంగి మండల పరిషత్తు పాఠశాలలో 165 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలో తాగునీటి వసతి లేకపోవడంతో విద్యార్థులు ఇంటి నుంచే బాటిళ్లలో నీటిని తీసుకొస్తున్నారు. వాటినే మధ్యాహ్న భోజనంతో పాటు సాయంత్రం వరకు తాగుతారు. అలాగే చందుర్తి మండలం మూడపల్లిలోనూ 68 మంది విద్యార్థులది నిత్యం ఇదే పరిస్థితి.


కోనరావుపేట మండలం కొలనూరు ప్రాథమిక పాఠశాలలో మిషన్‌ భగీరథ పైపులైను ఏర్పాటు చేసినా ట్యాంకు లేక ఖాళీగా వదిలేశారు. దీంతో మధ్యాహ్న భోజనానికి ఇబ్బంది లేకపోయినా విద్యార్థులకు తాగునీటికి తిప్పలు తప్పడం లేదు.

విద్యార్థులకు పాఠశాల సమయంలో నాలుగుసార్లు నీళ్లు తాగించాలి. వీరికి పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాతో రెండేళ్లలో పాఠశాలల నిర్వహణ అంతా మారింది. జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో శుద్ధమైన నీరు అందుబాటులో లేకపోవడం, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న నీటితోనే దాహం తీర్చుకుంటున్నారు. మరికొన్ని పాఠశాలల్లో ట్యాంకులు, బోరుబావుల నిర్వహణ లేదు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి, విద్యార్థులు తాగేనీరు కలుషితమై 32 మంది విద్యార్థులు వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. శుద్ధజలం లేక ఉన్న నీటినే వాడుతున్నారు. ఈ సంఘటనతో జిల్లా ఉన్నతాధికారులు, విద్యాశాఖ ఇంకా పాఠాలు నేర్వలేదని పిస్తోంది. దీనికి నిదర్శనం ఇప్పటికీ చాలా పాఠశాలల్లో తాగునీటి సరఫరాను గమనిస్తే తెలుస్తుంది.

జిల్లాలో మొత్తం 531 ప్రభుత్వ పాఠశాలలకుగాను 124 పాఠశాలల్లో వంట గదులు లేవు. ఇక్కడ అరకొర వసతుల నడుమ మధ్యాహ్న భోజనాన్ని వండి వడ్డిస్తున్నారు. ఇక 98 బాలుర పాఠశాలలు, 31 బాలికల పాఠశాలల్లో మూత్రశాలలు లేవు. ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు జిల్లాలో తొలి విడత ‘మన ఊరు- మన బడి’లో 172 పాఠశాలను ఎంపిక చేశారు. ఇందులో ఫిబ్రవరి 1 నాటికి 21 పాఠశాలల్లో రూ.5 కోట్లతో మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకొచ్చారు. చాలా చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. పాఠశాలల్లో మిషన్‌ భగీరథ నీటి నిల్వకు సంపుల నిర్మాణాలు అసంపూర్తి దశలో ఉన్నాయి. ఇంటి నుంచి తెచ్చుకొన్న నీటి సీసాలు, మధ్యాహ్న భోజన సమయానికి ఖాళీ అవుతున్నాయి. ఆపై దాహం వేస్తే నోరు కట్టేసుకోవాల్సిందే. తాగునీటి సమస్యలున్న చోట శుద్ధజలం అందించేందుకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా అవి విద్యార్థులకు చేరడం లేదు. నీటి సరఫరా లేక పాఠశాలల్లో మూత్రశాలలను నిర్వహించడం లేదు. దీనికితోడు పారిశుద్ధ్య సిబ్బంది లేక కంపుకొడుతున్నాయి. వినియోగం లేక మరుగుదొడ్లు తాళాలతో దర్శనమిస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగినపుడు మాత్రమే అధికారుల హడావుడి కనిపిస్తుంది. తర్వాత వదిలేయడం పరిపాటిగా మారింది.

కోనరావుపేట మండలం కొలనూరు ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న ట్యాంకు నిర్మాణం

పారిశుద్ధ్య సిబ్బంది లేక..

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బంది, వాచ్‌మెన్‌లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. కరోనా సమయంలో వీరిని విధుల నుంచి తొలగించడంతో సమస్య తీవ్రమైంది. బడులు ప్రారంభమయ్యాక వీరిని తిరిగి నియమించలేదు. విద్యా కమిటీలు, ప్రధానోపాధ్యాయులు కలిసి ఏర్పాటు చేసుకోవాలని సూచించినా ఫలితం లేదు. ఈ విషయమై ఉపాధ్యాయులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థల్లోని పారిశుద్ధ్య కార్మికులచే పాఠశాలలను నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అవి అమలుకు నోచుకోవడం లేదు. గ్రామాల్లోనే అంతంత మాత్రంగా నిర్వహిస్తున్నారు. ఇక పాఠశాలలవైపు చూసిన దాఖలాలు లేవు.


సరఫరాలో ఇబ్బందులతోనే సమస్యలు

రాధాకిషన్‌, జిల్లా విద్యాధికారి

పాఠశాలల్లో తాగునీటి సమస్యలపై జడ్పీ స్టాండింగ్‌ కమిటీలో చర్చిస్తున్నాం. గ్రామాలు, పురపాలికల్లో ఏదైనా పనులు చేపడితే రోజుల తరబడి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దానికి స్థానిక సంస్థలు, భగీరథ వారు ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారు. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సొంతంగా శుద్ధజలం తెప్పిస్తున్నారు. కొన్ని చోట్ల ఆర్వో ప్లాంట్లు ఉన్నాయి. పారిశుద్ధ్య నిర్వహణపై చాలా చోట్ల పట్టించుకోవడం లేదు. పారిశుద్ధ్య కార్మికులను కేటాయించాలని స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు